ఎన్టీఆర్‌ చరిత్రను పాఠ్యాంశాలుగా చేర్చాలి: హరికృష్ణ

28 May, 2018 07:05 IST|Sakshi
ఎన్టీఆర్‌కు నివాళులు అర్పించిన హరికృష్ణ, ఇతర కుటుంబ సభ్యులు

సాక్షి, హైదరాబాద్‌ : దివంగత మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు జయంతి సందర్భంగా ఆయన కుటుంబసభ్యులు నివాళులు అర్పించారు. నందమూరి హరికృష్ణ కుటుంబ సభ్యులతో కలిసి ఎన్టీఆర్‌ ఘాట్‌లో సమాధి వద్ద నివాళులు అర్పించి, స్మరించుకున్నారు. అనంతరం మీడియాతో మాట్లాడిన హరికృష్ణ.. తెలుగు ప్రజల సంక్షేమం కోసం కృషి చేసిన గొప్ప నేత అని కొనియాడారు. నేడు ప్రతి ఇంట ఒక బిడ్డ ఎన్టీఆర్‌లా ఉన్నత స్థానంలో ఉండాలని కోరుకుంటారని ఆయన అన్నారు.

 తనకు, తెలుగు రాష్ట్రాలకు ఎన్టీఆర్‌ జయంతి ఒక పర్వదినం లాంటిదని హరికృష్ణ వెల్లడించారు. ఎన్‌టీ రామరావు గురించి చెప్పడానికి తరాలు, యుగాలు సరిపోవని తెలిపారు. బడుగు బలహీన వర్గాల ఉన్నతి, అభివృద్ధి కోరకున్న గొప్పనాయకుడు ఎన్టీఆర్‌ అని గుర్తు చేసుకున్నారు. ఎందరో మహానుభావుల జీవిత చరిత్రలు పాఠ్యాంశాలుగా ఉన్నాయని, అలాగే ఎన్టీఆర్‌ జీవితంలోని కొన్ని ముఖ్యఘట్టలను తెలుగు రాస్ట్రాల్లో పాఠ్యాంశాలుగా చేర్చాలని తెలుగు ప్రభుత్వాలను కోరారు.

తెలుగువారికి ఒక భాష ఉందని నిరూపించారని, తెలుగు రాష్ట్ర ప్రజలు తరాలు చెప్పుకొనే సేవ చేశారని హరికృష్ణ అన్నారు. తెలుగు వారి ఆత్మగౌరవం కోసం ఎర్రకోటపై జెండా ఎగరవేసిన మహోన్నత వ్యక్తి అని చెప్పారు. ఒకప్పుడు పార్టీలో రథసారధిగా ఉన్న మీరు మహానాడుకు ఎందుకు వెళ్లలేకపోయారన్న ప్రశ్నకు సమాధానం దాటవేశారు. హరికృష్ణ తనయులు కళ్యాణ్‌ రామ్‌, జూనియర్‌ ఎన్టీఆర్‌, ఇతర కుటుంబ సభ్యులు ఎన్టీఆర్‌కు నివాళులు అర్పించారు.

(మరిన్ని చిత్రాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి)

మరిన్ని వార్తలు