గార్డ్‌ రూము అడ్డుగా ఉండడంతో...

25 Jul, 2014 17:08 IST|Sakshi
గార్డ్‌ రూము అడ్డుగా ఉండడంతో...

హైదరాబాద్: 'మాసాయిపేట' దుర్ఘటనపై నాందేడ్-కాచిగూడ ప్యాసింజర్ రైలు డ్రైవర్ స్పందించాడు. నిన్న ఉదయం 9:15 గంటల సమయంలో ప్రమాదం జరిగిందని 'సాక్షి'తో చెప్పాడు. 300 మీటర్ల నుంచే తాము విజిల్ ఇచ్చామని తెలిపాడు. అయితే బస్సు ఆకస్మాత్తుగా ట్రాక్‌పైకి బస్సు వచ్చిందని, గార్డ్‌ రూము అడ్డుగా ఉండడంతో బస్సును గుర్తించలేకపోయామని వెల్లడించాడు. బ్రేక్‌ వేసేందుకు ప్రయత్నించామని కాని రైలు వేగం వల్ల ప్రమాదం జరిగిందని ట్రైన్ డ్రైవర్ వివరించాడు.

రైలు కనపడకుండా అడ్డుగా మారిన గది..
గేటు లేకుండా దిష్టిబొమ్మలా మిగిలిన ఆ గది ఇప్పుడు ప్రమాదకరంగా మారింది. ట్రాక్ దాటేందుకొచ్చే వాహనదారులు దగ్గరికొచ్చాక.. రైలు ఇంజిన్ సరిగ్గా ఎంతదూరంలో ఉందో కనిపించకుండా ఆ గది అడ్డుగా మారింది. ఇంజిన్ కాస్త దూరంగానే ఉండిఉంటుందన్న భావనతో కొందరు వాహనదారులు వేగంగా వాహనాన్ని పట్టాలెక్కించి ప్రమాదాల బారిన పడుతున్నారు.

ఆ గది కట్టకముందు అడపాదడపా జరిగే ప్రమాదాలు.. ఆ తర్వాత తరచూ జరుగుతున్నాయి. గది నిర్మాణం తర్వాత దాదాపు 25కుపైగా ప్రమాదాలు జరిగాయన్నది స్థానికుల కథనం. అందులో ఈ స్కూలు బస్సు దుర్ఘటన అతిపెద్దది. ఒకవేళ గేటు ఏర్పాటు చేయటంలో మరింత జాప్యం జరిగేపక్షంలో వెంటనే ఆ గదిని కూల్చేయాలని వారు అధికారులను కోరుతుండటం గమనార్హం.

మరిన్ని వార్తలు