ఆత్మాభిమాన రక్షణకే ‘కొండా’ గెంటివేత

26 Sep, 2018 11:48 IST|Sakshi
సమావేశంలో మాట్లాడుతున్న మేయర్‌ నరేందర్‌

వరంగల్‌: వరంగల్‌ తూర్పు నియోజకవర్గ పరిధిలోని ప్రజల ఆత్మాభిమానాన్ని రక్షించేందుకే కొండా దంపతులను టీఆర్‌ఎస్‌ నుంచి గెంటివేసినట్లు నగర మేయర్‌ నన్నపునేని నరేందర్‌ అన్నారు. వరంగల్‌లోని మహేశ్వరి గార్డెన్స్‌లో మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ తెలంగాణ సిద్ధాంత కర్త జయశంకర్‌ పేరు కూడా ఉచ్ఛరించే అర్హత కొండా దంపతులకు లేదన్నారు. కొండగట్టు బస్సు ప్రమాద స్థలానికి సీఎం రాలేదని ఆరోపణలు చేసిన కొండా సురేఖ  తన తండ్రి మరణిస్తే మురళీ ఎందుకు రాలేదో చెప్పాలన్నారు. సురేఖ తండ్రి మరణిస్తే ఎవరికి చెప్పాలో తెలియని పరిస్థితుల్లో పీఏ సునీల్‌ తనకు చెబితే అందరికి సమాచారం అందించానన్నారు. రాజశేఖర్‌రెడ్డి జన్మనిస్తే.. కేసీఆర్‌ పునర్జన్మను ఇచ్చారని అన్న కొండా దంపతులు ఇప్పుడు టికెట్‌ ఇవ్వకుంటే విమర్శలు చేయడం సబబు కాదన్నారు. మాజీ మంత్రి బస్వరాజ్‌ సారయ్య మాట్లాడుతూ తెలంగాణకు అసలు ద్రోహులు కొండా దంపతులేనని అన్నారు.

వంచనగిరిలో కుక్కను తుపాకీతో కాల్చి సర్పంచ్‌ అయిన కొండా మురళీకి తమకు రాజకీయంగా అశ్రయం కల్పించిన వారికి వెన్నుపోటు పొడిచిన చరిత్ర ఉందన్నారు. తెలంగాణ కావాలని 42 మం ది కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు సంతకాలు చేసి యూపీఏ చైర్‌పర్సన్‌ సోనియాగాంధీకి ఇచ్చిన లేఖలో కొండా సురేఖ సంతకం చేయలేదన్నారు. వీరికి తెలంగాణ అనే మాట ఎత్తే అర్హత లేదన్నారు. జిల్లాకు పట్టిన శని పోయిందని, ఇలాంటి దుర్మార్గులను ఏ పార్టీ కూడా చేర్పించుకోవద్దని కోరారు. టీఆర్‌ఎస్‌ రాష్ట్ర కార్యదర్శి మెట్టు శ్రీనివాస్‌ మాట్లాడుతూ ప్రెస్‌మీట్‌లో తెలంగాణ ద్రోహులు ఇచ్చిన స్క్రీప్ట్‌ను సురేఖ చదివారని, ఉమ్మడి రాష్ట్రంలో వారి నీతిమాలిన చరిత్ర అందరికి తెలుసన్నారు. నైతిక విలువలు ఏ మాత్రం ఉన్నా కొండా మురళి తన ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేయాలని డిమాండ్‌ చేశారు. సమావేశంలో కార్పొరేటర్లు గుండా ప్రకాశ్‌రావు, వీర బిక్షపతి, ఝెలుగం లీలావతి, శారదాజోషి, కేడల పద్మ, ఉషశ్రీ పద్మ,  దామోదర్‌ యాదవ్, నాయకులు జన్ను జకార్య, రామా బాబూరావు, హరిరమాదేవి, తూర్పాటి సారయ్య, సురేష్‌జోషి, మసూద్, బిల్లా శ్రీకాంత్, రాజన్‌బాబు  తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు