సంచలనం రేపుతున్న నారాయణ సంస్థల ఆడియో

2 Nov, 2017 19:24 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : విద్యార్థుల వరుస ఆత్మహత్యలతో వివాదస్పదమైన నారాయణ విద్యాసంస్థలకు సంబంధించిన ఓ ఆడియో ప్రస్తుతం సంచలనం రేపుతోంది.  సోషల్‌ మీడియాలో ఆ సంస్థలకు చెందిన ఆడియో టేప్‌ వైరల్‌గా మారింది. నారాయణ సంస్థల్లో జరుగుతున్న అనైతికక కార్యక్రమాలు ఆ ఆడియో ద్వారా బయటకు వెల్లడి కావడం మరోసారి చర్చనీయాంశమైంది. నారాయణ విద్యాసంస్థలకు సంబంధించిన ఇద్దరు ఉద్యోగుల సంభాషణ... ఇప్పుడు సోషల్‌మీడియాలో ప్రకంపనలు సృష్టిస్తోంది.

హైదరాబాద్‌ రామాంతపూర్‌లోని నారాయణ స్కూల్‌కు చెందిన వైస్‌ ప్రిన్సిపల్‌ నవీన్‌ .. అదే బ్రాంచ్‌కు చెందిన ప్రిన్సిపాల్‌ సరితా అగర్వాల్‌తో మాట్లాడిన సంభాషణలు బయటపడ్డాయి. డీమానిటైజేషన్‌ సమయంలో బ్లాక్‌మనీని నారాయణ యాజమాన్యం వైట్‌మనీగా ఎలా మార్చిందో వీరిద్దరూ ఆ వీడియోలో చర్చించుకున్నారు. అలాగే యాజమాన్యంలోని కీలక వ్యక్తికి ...మహిళలతో వివాహేతర సంబంధం ఉన్నట్లు ఆ సంభాషణల్లో వెల్లడి అయింది. హయత్‌నగర్‌ నారాయణ బ్రాంచ్‌కు చెందిన ఉద్యోగి శ్రీలత ఆత్మహత్యకు కారణం ఏంటో కూడా....ఈ ఆడియోలో చెప్పడం సంచలనంగా మారుతోంది.

వనస్థలీపురంలో ఉన్న నారాయణ విద్యాసంస్థల గెస్ట్‌హౌస్‌ అరాచకాలకు అడ్డాగా మారిందని...ఈ ఆడియో ద్వారా తెలుస్తోంది. నారాయణ సంస్థలకు సంబంధించిన కీలకమైన విషయాలపై చర్చ జరిగిన ఈ ఆడియో టేపు.....ఇప్పుడు వైరల్‌ అవుతోంది. అయితే ఈ ఆడియో వ్యవహారంపై నారాయణ యాజమాన్యం ఇప్పటివరకూ స్పందించలేదు.  కాగా రెండు తెలుగు రాష్ట్రాల్లో ఆడియో కలకలం రేపుతోంది. అలాగే ఆడియో టేపులను బహిర్గతం చేశాడన్న అనుమానంతో వైస్‌ ప్రిన్సిపల్‌ నవీన్‌పై నారాయణ సిబ్బంది దాడికి పాల్పడ్డారు. దీంతో బాధితుడు నవీన్‌ ఉప్పల్‌ పోలీసులను ఆశ్రయించాడు. బయటపడ్డ ఆ ఆడియోతో తనకెలాంటి సంబంధం లేదని తెలిపాడు. అయినా తనపై అకారణంగా దాడి చేశారని, తనకేమీ జరిగినా నారాయణదే బాధ్యత అని నవీన్‌ అన్నారు. నారాయణ నుంచి తనకు ప్రాణహానీ ఉందని, తన అంతు చూస్తామని బెదిరిస్తున్నారని ఆయన తెలిపారు.

కాగా నారాయణ ఉద్యోగుల ఆడియో సంభాషణ రాష్ట్రవ్యాప్తంగా ఆగ్రహావేశాలు రగిలిస్తోంది. నారాయణలో జరుగుతున్న అక్రమాలు, అవినీతిపై.....విద్యార్థి సంఘాలు భగ్గుమంటున్నాయి. నారాయణగూడలోని నారాయణ కాలేజీపై ఏబీవీపీ కార్యకర్తలు దాడి చేశారు. ఫర్నీచర్‌ అంతా ధ్వంసం చేశారు. అడ్డగోలుగా చెలామణి అవుతోన్న నారాయణ సంస్థలపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

   కలకలం రేపుతున్న ఆడియో సంభాషణ 

మరిన్ని వార్తలు