తొలి ప్రతిపాదన ‘పేట’లో డ్రెయినేజీ వ్యవస్థ 

16 Mar, 2019 15:31 IST|Sakshi

రూ.55 కోట్లతో ప్రతిపాదనల

100 కిలోమీటర్ల డ్రెయినేజీకి ప్రణాళికలు   

సాక్షి, నారాయణపేట: జిల్లా ఆవిర్భావం అనంతరం ‘పేట’ అభివృద్ధి వైపు అడుగులు వేస్తోంది. తొలి ప్రయత్నంగా పారిశుద్ధ్య వ్యవస్థపై అధికారులు దృష్టి సారించారు. వందశాతం మంచినీటి సౌకర్యం ఉన్న మున్సిపాలిటీల్లో అండర్‌గ్రౌండ్‌ డ్రెయినేజీ వ్యవస్థ ఏర్పాటుకు ప్రణాళికలు సిద్ధం చేసి పంపించాలని తెలంగాణ ప్రభుత్వం ఆదేశాలు జారీచేసింది. అందులో భాగంగా హైదరాబాద్‌ జోన్‌లోని 19 మున్సిపాలిటీలకు పబ్లిక్‌హెల్త్‌ ఇంజనీరింగ్‌ ఇన్‌ చీఫ్‌ కమిషనర్‌ ఉత్తర్వులను జారీ చేశారు. అందులో నారాయణపేట గ్రేడ్‌–2 మున్సిపాలిటీకి అవకాశం వచ్చింది. 

రూ. 55 కోట్ల నిధులకు ప్రతిపాదనలు
పట్టణంలో ప్రస్తుతం 70 కిలో మీటర్ల మేర ఓపెన్‌ డ్రెయినేజీలు ఉన్నాయి. అయితే అండర్‌గ్రౌండ్‌ డ్రెయినేజీ నిర్మాణం దాదాపు 100 కిలో మీటర్లు చేపట్టేందుకు ఆర్‌వీ కన్సల్టెన్సీవారు ప్రతిపాదనలు సిద్ధం చేశారు. పట్టణంలోని 23 వార్డుల్లో ఉన్న ఓపెన్‌ డ్రెయినేజీలను పరిశీలించి ఎక్కడెక్కడ ఇంకా ఓపెన్‌ డ్రెయినేజీలు అవసరమని గుర్తించారు. దాంతో పాటు అండర్‌గ్రౌండ్‌ డ్రెయినేజీ 1.5 మీటర్ల లోతులో నిర్మాణం చేపట్టేందుకు ప్రణాళికలను రూపొందించారు. ఈ డ్రెయినేజీల నిర్మాణం కోసం రూ.55 కోట్ల నిధులు కావాల్సి వస్తుందని అధికారులు అంచనా వేశారు.  

సీవరేజ్‌ ట్రీట్‌మెంట్‌ ప్లాంట్‌ 
పట్టణంలో చేపట్టే అండర్‌గ్రౌండ్‌ డ్రెయినేజీ నిర్మాణంతో వీధుల నుంచి పారే  మురుగునీరంతా ఒక చోట చేరేందుకు ప్లాంట్‌ను ఏర్పాటు చేస్తారు. దానినే  సీవరేజ్‌ ట్రీట్‌మెంట్‌ ప్లాంట్‌ అంటారు. పట్టణంలో రెండు ప్లాంట్లను ఏర్పాటు చేయనున్నారు. ఒకటి పళ్ల ఏరియాలోని బీబీ దర్గా సమీపంలో, మరోటి పగిడిమారి రోడ్‌లో ఏర్పాటు చేసేందుకు స్థలాలను పరిశీలించారు. ఒక్కో  ప్లాంట్‌కు దాదాపు ఎకరా స్థలం కావాల్సి ఉంది. 

వర్షపునీరు పారేందుకు.. 
ఇళ్లనుంచి విడుదలైన నీటితో పాటు వర్షపు నీరు పారే నీటిని మాత్రమే ఓపెన్‌ డ్రెయినేజీల్లో పారేందుకు చర్యలు చేపట్టనున్నారు. మలమూత్ర విసర్జన, మురుగునీరు, బాత్‌రూం వాటర్‌ పైప్‌లైన్‌లను అండర్‌గ్రౌండ్‌ డ్రెయినేజీలకు అనుసంధానం చేస్తారు. ఈ నీరంతా సీవరేజ్‌ ట్రీట్‌మెంట్‌ ప్లాంట్‌కు చేరి ఫిల్టర్‌ అయి మళ్లీ బయటికి నాలాల ద్వారా పంపిస్తారు.  

ప్రభుత్వ ఆమోదమే తరువాయి.. 
ఆర్‌వీ కన్సల్టెన్సీ వారు తయారు చేసిన అండర్‌గ్రౌండ్‌ డ్రెయినేజీ ప్రతిపాదనలు (ప్రిమిలరీ డిటెల్‌ ప్రాజెక్ట్‌ రిపోర్ట్‌)ను స్థానిక మున్సిపల్‌ ఇంజనీరింగ్‌ విభాగం అధికారులు ఇటీవలే హైదరాబాద్‌ పబ్లిక్‌ హెల్త్‌ ఇంజనీరింగ్‌ ఇన్‌ చీఫ్‌ కమిషనర్‌కు పంపించారు. ఆ శాఖ పరిశీలన తర్వాత ఫైనల్‌ డిజైన్‌ను రూపొందిస్తూ ప్రభుత్వానికి నివేదిస్తారు. ప్రభుత్వం నుంచి ఆమోదం వస్తే పనులు ప్రారంభం కావడమే తరువాయి.   ప్రతిపాదనలు పంపించాం 

 నారాయణపేట పట్టణంలో అండర్‌గ్రౌండ్‌ డ్రెయినేజీ నిర్మాణం కోసం ఆర్‌వీ ద్వారా సర్వే చేయించాం. రూ.55 కోట్ల మేర నిధులు కావాలని డీపీఆర్‌ రూపొందించి ప్రతిపాదనలు తయారు చేసి సీడీఎంఏకు పంపించాం. ప్రభుత్వ అనుమతులు రాగానే పనులు ప్రారంభిస్తాం. 
– ఖాజాహుసేన్, ఇంజనీయర్, మున్సిపాలిటీ నారాయణపేట    

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా