‘వాళ్లు ముస్లిం ప్రజలను మోసం చేస్తున్నారు’

17 Sep, 2018 13:29 IST|Sakshi

సాక్షి, హైదరబాద్‌ : భారత ప్రధాని నరేంద్ర మోదీ, తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌ రావులు కలిసి ముస్లిం ప్రజలను మోసం చేస్తున్నారని టీపీసీసీ చీఫ్‌ ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి ఆరోపించారు. సోమవారం తెలంగాణ విమోచన దినోత్సవం సందర్భంగా గాంధీ భవన్‌లో జాతీయ జెండాను ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. హైదరాబాద్ స్టేట్ నిజాం పాలనలోనే కొనసాగిందని తెలిపారు. జవహర్ లాల్ నెహ్రు ,సర్దార్ వల్లభాయ్ పటేల్ కృషి వల్ల నిజాం పాలన నుంచి తెలంగాణ ప్రజలకు విముక్తి కలిగిందని అన్నారు. సెప్టెంబర్‌ 17ను అధికారికంగా నిర్వహించాల్సిన ప్రభుత్వం మోసపూరితంగా నిర్వహించటం లేదని విమర్శించారు. అమరవీరుల ఆత్మగోసించే విధంగా కేసీఆర్ పాలన ఉందని అన్నారు.

ఇచ్చిన మాటలు తప్పినందుకు కేసీఆర్‌ను గద్దె దించేయాలని ప్రజలకు పిలుపునిచ్చారు. వచ్చే ఎన్నికలు కేసీఆర్ కుటుంబానికి, తెలంగాణ ప్రజలకు మధ్య జరగబోతున్నాయని పేర్కొన్నారు. టీఆర్‌ఎస్‌ పార్టీకి ఓటు వేస్తే బీజేపీకి వేసినట్లేనని అన్నారు. తెలంగాణలో 25 లక్షల ఓట్లు గల్లంతు అయ్యాయని, వాటిని సవరణ చేసిన తర్వాతనే ఎన్నికలు నిర్వహించాలని డిమాండ్‌ చేశారు. తెలంగాణ నుంచి కేసీఆర్ కుటుంబాన్ని తరిమికొడుదామని అన్నారు. ప్రభుత్వం ఏర్పడిన 10 రోజుల్లో ఇందిరా పార్కు దగ్గర ధర్నా చౌక్ నిర్మిస్తామని హామీ ఇచ్చారు. ఏక కాలంలో 2 లక్షల రుణాలు మాఫీ చేస్తామన్నారు. ఆర్టీసీ సంస్థను ప్రభుత్వంలో విలీనం చేస్తామని, ఉద్యోగ భద్రత కల్పిస్తామని హామీ ఇచ్చారు. కొత్త బస్సులను కొనుగోలు చేస్తామని ఆయన అన్నారు.

>
మరిన్ని వార్తలు