రాష్ట్రంలో పెద్ద పులుల వివరాలు వెల్లడించనున్న ప్రధాని

27 Jul, 2019 02:36 IST|Sakshi

సోమవారం వివరాలు వెల్లడించనున్న ప్రధాని మోదీ 

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణ ఏర్పడ్డాక రాష్ట్రంలో ఎన్ని పెద్ద పులులున్నాయి?  గతంతో పోల్చితే పులుల సంఖ్య పెరిగిందా లేక తగ్గిందా? దేశవ్యాప్తంగా మొత్తం ఎన్ని ఉన్నాయి? జాతీయస్థాయిలో చూస్తే గతంలో మాదిరిగానే వాటి సంఖ్యలో వృద్ధి జరిగిందా లేదా అన్న ప్రశ్నలకు ప్రధాని నరేంద్రమోదీ సమాధానం చెప్పనున్నారు. అంతర్జాతీయ పులుల దినోత్సవం సందర్భంగా ఈ నెల 29న సోమవారం ఇందుకు సంబంధించిన అధికారిక లెక్కలు విడుదల చేయనున్నారు. ప్రతి నాలుగేళ్లకూ ఓసారి పులుల గణన చేపడతారు. 2006లో తొలిసారిగా దేశవ్యాప్తంగా టైగర్‌ సెన్సెస్‌ను విడుదల చేయగా.. మళ్లీ 2010లో, ఆ తర్వాత 2014లో ఈ వివరాలను ప్రకటించారు.

2014లో ఏపీ, తెలంగాణలను కలిపి ఒకటిగానే సమాచారం వెల్లడించారు. ప్రత్యేక రాష్ట్రంగా తెలంగాణ ఏర్పడ్డాక మొదటిసారిగా ఇక్కడ ఎన్ని పులులున్నాయనేది అధికారికంగా వెల్లడి కానుంది. 2014 లెక్కల ప్రకారం ఉమ్మడి ఏపీ లో 68 పులులుండగా వాటిలో 20 పులులు తెలంగాణలో ఉన్నట్టుగా (ఆమ్రాబాద్‌ టైగర్‌ రిజర్వ్‌లో17, కవ్వాల్‌ టైగర్‌ రిజర్వ్‌లో 3) ఇక్కడి అధికారులు అంచనా వేశారు. ప్రస్తుతం తెలంగాణలో వీటి సంఖ్య 28 నుంచి 30 వరకు పెరిగినట్టు అనధికార లెక్కలను బట్టి తెలుస్తోంది. దేశవ్యాప్తంగా చూస్తే 2006లో 1,411 పులులు ఉండగా.. 2010లో 1,706కు, 2014లో 2,226కు వాటి సంఖ్య పెరిగింది. 

మరిన్ని వార్తలు