ఇష్టంతో పోలీస్‌ ఉద్యోగం

8 Nov, 2017 12:47 IST|Sakshi

యువత లక్ష్యాలను ఎంచుకోవాలి

తల్లిదండ్రుల ఆశయాలను నెరవేర్చాలి

‘సాక్షి’తో ఏసీపీ సునీతామోహన్‌

నర్సంపేట: చిన్నప్పటి నుంచే పోలీస్‌ కావాలనే బలమైన కాంక్ష ఉండేది. మా కుటుంబంలో ఎవరూ పోలీసు అధికారులు లేరు. తల్లిదండ్రుల సూచనతో బీటెక్‌ పూర్తి చేశా. 2012 లో గ్రూప్‌–1కు ఎంపికై పోలీస్‌ అధికారిగా బాధ్యతలు స్వీకరించా. కిందిస్థాయి సిబ్బందితో సమన్వయం చేస్తూ.. ఉన్నతాధికారుల ఆదేశాలను అమలు చేస్తున్నానని నర్సంపేట ఏసీపీ సునీతామోహన్‌ అన్నారు. మంగళవారం ఆమె ‘సాక్షి’ ఇంటర్వూ్యలో మాట్లాడారు. ఆ వివరాలు ఆమె మాటల్లోనే..

నాన్న కోరిక మేరకు..
మాది హైదరాబాద్‌. తల్లిదండ్రులు వరలక్ష్మి–సోమశేఖర్‌. మేము నలుగురం సంతానం. అక్క, అన్న, చెల్లెలు కూడా ఉన్నత చదువులు చదివారు. నాన్న సోమశేఖర్‌ కోరిక మేరకు నేను గ్రూప్‌–1కు ఎంపికయ్యా. 2012లో నాకు మొదటి పోస్టింగ్‌ నల్లగొండ సీసీఎస్‌లో ఇచ్చారు. రెండో పోస్టింగ్‌ సూర్యాపేట డీఎస్పీగా పనిచేసిన రోజులు మరువలేనివి. మూడో పోస్టింగ్‌ నర్సంపేట ఏసీపీగా వచ్చా.

                             భర్త చంద్రమోహన్‌తో ఏసీపీ సునీతామోహన్‌
శిక్షణలో స్నేహం, వివాహం..
గ్రూప్‌–1కు ఎంపికైన తర్వాత శిక్షణ సమయంలో మా బ్యాచ్‌కు చెందిన ఆదిలాబాద్‌ జిల్లా వాసి చంద్రమోహన్‌తో  స్నేహం ఏర్పడింది. స్నేహం ప్రేమగా మారి వివాహం వరకు వెళ్లింది. మా ఇద్దరి అభిప్రాయాలను తల్లిదండ్రులు అంగీకరించారు. 2013 డిసెంబర్‌ 27న వివాహం చేసుకున్నం. చంద్రమోహన్‌ ప్రస్తుతం కరీంగనర్‌ ఇంటెలిజెన్స్‌ డీఎస్పీగా పనిచేస్తున్నారు.

చాలెంజ్‌గా తీసుకుంటా..
విద్యా, ఉద్యోగాల్లో మహిళలు కూడా రాణించడం సంతోషకరం. పోలీస్‌ శాఖలో మహిళలు రాణించాలంటే ప్రత్యేక ప్రణాళికలు అవసరం. ఉన్నతాధికారుల సహకారంతో ముందుకు వెళ్తా. ఒత్తిడికి గురికాకుండా పోలీస్‌ ఉద్యోగాన్ని చాలెంజ్‌గా తీసుకుంటా. శాంతిభద్రతలకు విఘాతం కలిగించే ఏ ఒక్క అంశాన్ని కూడా వదలకుండా కఠిన చర్యలు తీసుకుంటా.

యువత లక్ష్యాన్ని ఎంచుకోవాలి..
ఇది వరకు ఏదైనా రంగంలో పనిచేసిన వారు ఆదర్శనీయులుగా ఉండడం సహజమే. ఏ రంగంలో లేని వారు కూడా మంచి పనులు చేస్తూ గుర్తింపు పొంది ఆదర్శవంతంగా ఉంటారు. యువత ప్రత్యేక లక్ష్యాన్ని ఎంచుకుని తల్లిదండ్రుల ఆశయలను నెరవేర్చాలి. ఉన్నతమైన స్థానంలో స్థిరపడాలి. చెడు మార్గంలో పయనించి సమాజానికి చేటును తెచ్చే వారు తల్లిదండ్రులను కూడా ఇబ్బందిపెట్టిన వారు అవుతారు..

మరిన్ని వార్తలు