పటిష్ట వ్యవస్థతోనే కేసుల సత్వర పరిష్కారం

25 Dec, 2018 04:55 IST|Sakshi
కార్యక్రమంలో మాట్లాడుతున్న గట్టు తిమ్మప్ప. చిత్రంలో జస్టిస్‌ ఎంఎస్‌కే జైస్వాల్‌ తదితరులు

జస్టిస్‌ ఎంఎస్‌కే జైస్వాల్‌  

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్ర, జిల్లా వినియోగదారుల ఫోరంలలో చాలా కేసులు పెండింగ్‌లో ఉన్నాయని తెలంగాణ రాష్ట్ర వినియోగదారుల వివాదాల రిడ్రెసల్‌ కమిషన్‌ అధ్యక్షులు జస్టిస్‌ ఎంఎస్‌కే జైస్వాల్‌ అన్నారు. వీటిని త్వరితగతిన పరిష్కరించేందుకు ప్రభుత్వం, ప్రజల నుంచి పూర్తి సహకారం ఉండాలని కోరారు. జాతీయ వినియోగదారుల దినోత్సవం సందర్భంగా సోమవారం తెలంగాణ పౌరసరఫరాల భవన్‌లో జరిగిన కార్యక్రమానికి జస్టిస్‌ జైస్వాల్, తెలంగాణ స్టేట్‌ కోఆపరేటివ్‌ వినియోగదారుల ఫెడరేషన్‌ చైర్మన్‌ గట్టు తిమ్మప్ప ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు.

ఈ సందర్భంగా జస్టిస్‌ జైస్వాల్‌ మాట్లాడుతూ వినియోగదారులకు వారి హక్కులు, బాధ్యతలపై మరింత అవగాహన పెంచాల్సిన అవసరం ఉందనీ, అలాగే వారినుంచి వచ్చిన ఫిర్యాదులను త్వరితగతిన పరిష్కరించడానికి అన్ని విధాలా కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఇప్పుడున్న 90 రోజుల గడువులో కేసుల పరిష్కారానికి సమయపాలనను కచ్చితంగా అమలు చేయాలంటే అందుకు కావాల్సిన వ్యవస్థను కూడా పటిష్టం చేసుకోవాలని అన్నారు. గత నెలరోజుల్లో రాష్ట్ర వినియోగదారుల ఫోరంకు 115 కేసులు రాగా 91 కేసులు పరిష్కారమయ్యాయన్నారు.

అయితే పెండింగ్‌ కేసులను కూడా నిర్దేశిత గడువులోగా పరిష్కరించేందుకు కృషి చేస్తామని అన్నారు. గట్టు తిమ్మప్ప మాట్లాడుతూ, తెలంగాణలో వినియోగదారులకు బాసటగా నిలుస్తూ నిర్దేశిత గడువులోగా కేసుల పరిష్కారానికి కమిషన్‌ కృషి చేస్తోందని, వినియోగదారుల ఫోరంను బలోపేతం చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని తెలిపారు. ఈ కార్యక్రమానికి హైదరాబాద్‌ చీఫ్‌ రేషనింగ్‌ ఆఫీసర్‌ రవి, ప్రముఖ వినియోగదారుల కార్యకర్త ఎన్‌.గణేషన్, సీఏటీసీవో అధ్యక్షులు గౌరీశంకరరావు, వినియోగదారుల వ్యవహారాల డిప్యూటీ కమిష
నర్‌ అనూరాధ, పౌరసరఫరాల శాఖ అధికారులు పాల్గొన్నారు.  
 

మరిన్ని వార్తలు