ప్రాణాలను బలిగొంటున్న హైవే క్రాసింగ్‌లు

11 Apr, 2019 15:53 IST|Sakshi
ముకుందాపురం వద్ద సిగ్నల్స్‌ లేని క్రాసింగ్‌, ఆకుపాముల వద్ద ప్రమాదకరంగా ఉన్న క్రాసింగ్‌ 

ఆరు నెలల్లో 14మంది మృతి, పలువురికి తీవ్రగాయాలు

సిగ్నల్స్‌ ఏర్పాటు చేయాలంటున్న  ప్రజలు

సాక్షి, మునగాల : తొమ్మిదవ నంబర్‌ జాతీయ రహదారిని నాలుగులేన్లుగా తీర్చిదిద్ది 65వ నంబర్‌ జాతీయ రహదారిగా మార్చిన జీఎమ్మార్‌ సంస్థ క్రాసింగుల ఏర్పాటులో నియమాలు పాటించకపోవడంతో తరచూ ప్రమాదాలు చోటు చేసుకుం టున్నాయి. ముఖ్యంగా మండల పరిధిలో 25కి.మీ. పరిధిలో విస్తరించి ఉన్న జాతీయ రహదారిపై ఉన్న ఏడు గ్రామాల్లో ఆరు ఆరు క్రాసింగులను ఏర్పాటు చేశారు.  వీటిలో సగానికిపైగా అనధికారికంగా ఏర్పాటు చేసినవే ముఖ్యంగా మం డల కేంద్రంలో సివిల్‌ ఆసుపత్రి ఎదురుగా అనధికారికంగా ఉన్న క్రాసింగ్‌ ప్రమాదకరంగా మారింది.

నెలకు ఐదారు ప్రమాదాలు ఈ ప్రాంతంలో జరుగుతూనే ఉన్నాయి. మండల పరిధిలోని జాతీయ రహదారిపై ఉన్న క్రాసింగ్‌ల వద్ద గత అక్టోబర్‌ నుంచి ఇప్పటి వరకు ఐదు నెలల కాలంలో 16మంది మృత్యువాత పడగా 38మంది గాయపడిన సంఘటనలు చోటు చేసుకున్నాయి. ఆకుపాముల శివారులో రిలయన్స్‌ బంక్‌ ఎదురుగా నిర్మించిన క్రాసింగ్‌ అత్యంత ప్రమాదకరంగా మారింది.  ముకుందాపురం వద్ద బస్టాండ్‌ సెం టర్, హరిజన కాలనీ ఎదురుగా ఏర్పాటు చేసిన డివైడర్ల వద్ద ఎటువంటి సిగ్నల్స్‌ ఏర్పాటు చేయకపోవడంతో తరచూ ప్రమాదాలు నెలకొంటున్నాయి.

ముకుందాపురం వద్ద జాతీయ రహదారిపై అండర్‌ పాస్‌ బ్రిడ్జీలతో పాటు సర్వీసు రోడ్లు ఏర్పాటు చేయాలని ఇటీవల గ్రామస్తులు 15రోజుల పాటు రిలే నిరాహారదీక్ష కూడా చేపట్టారు. జాతీయరహాదారిపై అతివేగంతో ప్రయాణించే వాహనాలు రోడ్డు దాటుతున్న పాదచారులు, ద్విచక్ర వాహనదారులను ఢీకొట్టడంతో వారి ప్రాణాలు గాలిలో కలిసిపోతున్నాయి. నిత్యం జరిగే ప్రమాదాల వల్ల జాతీయ రహదారిపై ఉన్న గ్రామాల ప్రజలు భయాందోళనల మధ్య కాలం వెళ్లదీస్తున్నారు. 


సిగ్నల్స్‌ ఏర్పాటు చేయాలి
జాతీయ రహదారిపై ఉన్న క్రాసింగ్‌ల వద్ద సిగ్నల్స్‌ ఏర్పాటు చేస్తే కొంత మేరకు ప్రమాదాలు నివారించే అవకాశముంది. సదరు క్రాసింగుల వద్ద ప్రమాద హెచ్చరిక  బోర్డులు ఏర్పాటు చేయాల్సి ఉంది. ప్రమాదం జరిగిన సమయంలో ఆరాటపడే అధికార యంత్రాంగం అటు పిమ్మట జాగ్రత్త చర్యలు చేపట్టకపోవడం శోచనీయం.  మండల కేంద్రంలో దాదాపు కి.మీ పొడవున ఉన్న ఫ్‌లైఓవర్‌ బ్రిడ్జిని ఏర్పాటు చేసిన జీఎమ్మార్‌ సంస్థ కేవలం ఒక అండర్‌ వెహికల్‌ పాస్‌ బ్రిడ్జిని ఏర్పాటు చేయడంతో మండల కేంద్రానికి వచ్చే ఆయా గ్రామాల ప్రజలు తప్పని పరిస్థితులలో క్రాసింగులను  దాటి వెళ్లాల్సి వస్తుంది. ఫలితంగా ప్రమాదాలు జరగుతున్నాయి.

అండర్‌పాస్‌ ఏర్పాటు చేయాలి
జాతీయ రహదారిపై ఏర్పాటు చేసిన క్రాసింగుల వద్ద తరచూ ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. ముఖ్యంగా ముకుం దాపురం వద్ద జరిగే ప్రమాదాలు ఎక్కువ. తక్షణమే ముకుందాపురం వద్ద అండర్‌పాస్‌ బ్రిడ్జి నిర్మాణంతో పాటు ఇరువైపులా సర్వీసు రోడ్లు ఏర్పాటు చేయాలి
– పందిరి నాగిరెడ్డి, ముకుందాపురం గ్రామస్తుడు

సిగ్నల్స్‌ ఏర్పాటు చేయాలి
ప్రస్తుతం జాతీయ రహాదారిపై ఉన్న క్రాసింగుల వద్ద సిగ్నల్స్‌ ఏర్పాటు చేస్తే కొంతమేర ప్రమాదాలు అరికట్టవచ్చు, అదే విధంగా గ్రామాల సరిహద్దులలో వాహానాల వేగాన్ని అదుపు చేసే విధంగా చర్యలు తీసుకోవాలి. హైవేపై క్రాసింగ్‌ల వద్ద సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలి. 
– మాదంశెట్టి మహేష్‌

మరిన్ని వార్తలు