‘పెరటికోళ్ల’ జాడేది?

25 Jun, 2018 15:35 IST|Sakshi
సబ్సిడీలో అందజేసిన పెరటికోళ్లు (ఫైల్‌)

ఏడాది పాటు కొనసాగిన పథకం

జిల్లాకు 380 యూనిట్లు మంజూరు

పేదలకు అందుబాటులో లేని మేలైన పథకం

కొనసాగించాలంటున్న లబ్ధిదారులు

మెదక్‌ జోన్‌: నిరుపేదల అభివృద్ధి కోసం పెద్ద పెట్టుబడిలేకుండా   ప్రవేశపెట్టిన పెరటికోళ్ల పెంపకం ఒక ఏడాదికే పరిమితమైంది. దీనిపై ఎంతో ఆశపెట్టుకున్న  పేదలకు ఈ పథకం అందుబాటులో లేకుండా పోయింది.  2016లో కేంద్ర ప్రభుత్వం పెరటికోళ్ల పథకాన్ని ప్రవేశపెట్టింది. ఈ పథకానికి తెల్లరేషన్‌ కార్డుగల నిరుపేదలందరూ అర్హులుగా నిర్ణయించింది.

ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన  నేషనల్‌ లైవ్‌స్టాక్‌ మిషన్‌(ఎన్‌ఎల్‌ఎం) ద్వారా ఈ పథకాన్ని ప్రారంభించింది. పథకం ప్రారంభంలో జిల్లాకు  380 యూనిట్లు మంజూరు చేశారు. దీంతో నిరుపేదలను గుర్తించిన వెటర్నరీ అధికారులు ముందుగా  300 యూనిట్లను పంపిణీ  చేశారు. కారణాలతో 80 యూనిట్లు అప్పట్లో లబ్ధిదారులకు అందించలేక  పోయారు.

2017లోనూ పెరటికోళ్ల పథకానికి నిధులు మంజూరి అయితే వాటితో పాటు మిగిలిపోయిన 80 యూనిట్లను సైతం  లబ్ధిదారులకు పంపిణీ చేయలనుకున్న  అధికారుల అంచనాలు తారుమారయ్యాయి.  ఒక ఏడాదికే ఈ పథకానికి ప్రభుత్వం మంగళం పాడటంతో మిగిలిపోయిన 80 యూనిట్లను  ఎవరికి పంపిణీ  చేసినా.. మిగతా  లబ్ధిదారులతో ఇబ్బందులు వస్తాయని ఆ 80 యూనిట్లను ఎవరికీ ఇవ్వకుండా మిన్నకుండిపోయారు. 

నిరుపేదలకు ఎంతో మేలు..

ఈ పథకంలో ఒక్కో యూనిట్‌లో 45 కోళ్లు ఉంటా యి. వీటి ఖరీదు రూ.3,750. లబ్ధిదారుడి వాటా గా కేవలం  రూ. 810 మాత్రమే చెల్లించాలి. అంటే కేవలం 20 శాతం మాత్రమే. ఇందుకు ప్రభుత్వం సబ్సిడీ కింద యూనిట్‌కు రూ. 2,940 చెల్లిస్తుంది.   వెటర్నరీ అధికారులు మేలుజాతి కోళ్లను లబ్ధి దారుడికి అందజేస్తారు. 45 కోళ్లలో 5 పుంజులు ఉండగా 40 కోడిపెట్టలుంటాయి.

అంతేకాకుండా వీటికి దానకోసం ఉపయోగించేందుకు మక్కల మిషన్‌ , నెట్‌(వల) తదితర వాటిని కోళ్లకు ఉపయోగించే పరికరాలను సైతం ప్రభుత్వం అప్పట్లో సరఫరా చేసింది. ఈ కోళ్లు  కేవలం 2 నెలల్లోనే గుడ్లుపెట్టడం మొదలు పెడుతుంటాయి. ఒక్కో కోడిపెట్ట 140 నుంచి 150 వరకు గుడ్లు పెడుతుంది. ఒక్కో గుడ్డు 60 గ్రాముల తూకం ఉంటుంది.

పూర్తిగా దేశీయవాలి గుడ్లు కావడంతో  వీటికి మంచి డిమాండ్‌ ఉండేది.   వీటిని అంగన్‌వాడీ కేంద్రాలకు సరఫరా చేయాలని అధికారులు సైతం బావించారు.   రెండు సంవత్సరాల క్రితం  ఈ పథకం ద్వారా  లబ్ధి పొందిన  లబ్ధిదారులు ఈ పథకం  నిరుపేదలకు ఎంతో మేలుచేసేదిగా ఉందని పేర్కొంటున్నారు. 

రోగనిరోధకశక్తి అధికం.... 

పేరటికోళ్ల పథకం ద్వారా లబ్ధిదారులకు పంపిణీ చేసే కోళ్లు మేలుజాతివి కావడంతో వీటికి రోగని రోధక శక్తి అధికంగా ఉంటుంది. వీటికి దాన కింద మక్కలతో పాటు, ప్రత్యేకంగా తయారు చేసిన దానను అధికారులు అప్పట్లో సబ్సిడీపై పంపిణీ చేశారు. కాగా పూర్తిగా నాటు(దేశీయవాలి)కోడితో సమానంగా పెరిగేవి.  కొద్ది సమయంలోనే ఈ కోడి 6 కిలోల బరువు వరుకు పెరుగుతుందని అధి కారులు చెబుతున్నారు.

కానీ కోడిని అమ్మటం కన్నా   మూడు మాసాలకోసారి  140 నుంచి 160 వరకు పెట్టే గుడ్లను విక్రయిస్తేనే లబ్ధిదారుడికి అధిక మొత్తంలో లాభం ఉంటోంది.  ఈ గుడ్లను తిన్నప్రజలకు సైతం రోగనిరోదక శక్తి పుష్కలంగా లబిస్తోంది.    ముఖ్యంగా ఈ పథకం గిరిజనులకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది.  అడవిబిడ్డలు అధిక శాతం  ఊరికి దూరంగా అడవుల్లో ఉం టారు.

దీంతో  పెరటికోళ్ల పథకం ద్వారా కోళ్లను పొందిన  లబ్ధిదారులు వారు ఉండే ప్రాంతాల్లో వదిలిపెడితే రోజంతా ఆరుబయటనే  గింజలు, పురుగులను  తిని సాయంత్రానికి ఇంటికి చేరుకుంటాయి.

నిరంతరంగా కొనసాగించాలి..

నిరుపేదల అభివృద్ధి కోసం దోహదపడే పెరటికోళ్ల పథకాన్ని నిరంతరాయంగా కొనసాగించాలి.  ఇలాంటి పథకాన్ని ఒక్క యేడాది పాటు కొంత మందికి మాత్రమే ఇచ్చి నిలిపివేయడం సమంజసం కాదు.   ఈ పథకం ఎంతోమంది నిరుపేదలకు ఉపయోగ పడాలంటే  దీనికి ప్రతిఏటా నిధులు విడుదల చేయాలి.    –బాగయ్య, రైతు

బాగా డిమాండ్‌ ఉంది..

2016లో జిల్లాకు 380 యూనిట్లు మంజూరయ్యాయి. ఇందులో 300 యూనిట్లు పంపిణీ చేశాం. పలు కారణాలతో 80 యూనిట్లు పంపిణీ చేయలేకపోయాం.  వాటిని త్వరలో పంపిణీ చేప్తాం.  పెరటికోళ్ల పథకం కోసం ప్రజల నుంచి బాగా డిమాండ్‌  ఉంది. లబ్ధిదారుల డిమాండ్‌ను ప్రభుత్వానికి నివేదించాం. ప్రభుత్వం మళ్లీ మంజూరు చేస్తే లబ్ధిదారులను ఎంపిక చేసి అందజేస్తాం.  –అశోక్‌కుమార్, వెటర్నరీ శాఖ జిల్లా అధికారి  

మరిన్ని వార్తలు