ప్రతిభకు 'ఉపకార వేతనం'

9 Aug, 2019 13:01 IST|Sakshi

పేద విద్యార్థులకు వరంగా నేషనల్‌ మీన్స్‌ కమ్‌ మెరిట్‌ స్కాలర్‌షిప్‌

నవంబర్‌ 3న పరీక్ష    

ఈ నెల 29 దరఖాస్తుకు చివరి తేదీ 

సాక్షి, సూర్యాపేట: ప్రతిభ ఉండి ఆర్థిక స్థోమత లేక ఎందరో పేద విద్యార్థులు ఉన్నత చదువులకు దూరమవుతున్నారు. పాఠశాల విద్యను ఎలాగోలా పూర్తి చేసి వివిధ కారణాలతో చదువు మానేస్తున్నారు. దీంతో ప్రతిభ ఉన్నా ఏమి చేయలేని స్థితిలో ఉంటున్నారు. అలాంటి వారి కోసమే కేంద్ర ప్రభుత్వం నేషనల్‌ మెరిట్‌ స్కాలర్‌షిప్‌ పథకం ద్వారా ఉపకార వేతనాలు అందిస్తూ ప్రోత్సహిస్తోంది.

ఉన్నత విద్యనందించేందుకే..
ప్రతిభ కలిగిన పేద విద్యార్థులకు ఉన్నత విద్యనందించేందుకు కేంద్ర ప్రభుత్వం ఏటా నేషనల్‌ మీన్స్‌ కమ్‌ మెరిట్‌ స్కాలర్‌షిప్‌ పరీక్ష నిర్వహిస్తూ విద్యార్థులను ఎంపిక చేస్తోంది. ప్రభుత్వ, జిల్లా పరిషత్, మున్సిపల్, ఎయిడెడ్, వసతి సౌకర్యాలు లేని ఎనిమిదో తరగతి చదువుతున్న విద్యార్థులు ఈ పరీక్షకు అర్హులు. ఇందులో ఎంపికైన విద్యార్థులకు తొమ్మిదో తరగతి నుంచి ఇంటర్‌ పూర్తయ్యే వరకు నాలుగేళ్ల పాటు ఉపకార వేతనం అందిస్తోంది. 2008లో ప్రారంభమైన ఈ పథకం ద్వారా ఏటా విద్యార్థులకు ఎంపిక పరీక్షలు నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం 2019–20 సంవత్సరానికి నోటిఫికేషన్‌ విడుదలైంది. ఈ నెల 29 దరఖాస్తుకు చివరి తేదీ కాగా నవంబర్‌ 3న పరీక్ష నిర్వహించనున్నారు. 

అర్హత, దరఖాస్తు విధానం....
2018–19 విద్యాసంవత్సరంలో 7వ తరగతిలో 50 శాతం మార్కులతో ఉత్తీర్ణత పొంది ఉండాలి. తల్లిదండ్రుల వార్షిక ఆదాయం రూ.లక్షా 50 వేల లోపు ఉండాలి. పరీక్ష ఫీజు ఓసీ, బీసీ లకు రూ.100, ఎస్సీ, ఎస్టీ దివ్యాంగ విద్యార్థులకు రూ.50గా నిర్ణయించారు. పూర్తి చేసిన దరఖాస్తుకు రెండు పాస్‌పోర్టు ఫొటోలతో పాటు ఆధార్, ఆదాయ, కుల ధ్రువీకరణపత్రాలు, బోనాఫైడ్‌ పత్రాలు జతచేయాలి. బ్యాంక్‌లో డీడీ తీసి దరఖాస్తు, ధ్రువీకరణ పత్రాలతో డీఈఓ కార్యాలయంలో ఇవ్వాలి. లేదా ఆన్‌లైన్‌లో అయితే ప్రభుత్వ పరీక్షల సంచాలకుల కార్యాలయం వెబ్‌సైట్‌  bre.telangana.govt.in  లో దరఖాస్తు చేయాల్సి ఉంది.

పరీక్ష విధానం..
నవంబర్‌ 3, 2019న ఉదయం 9.30 నుంచి 12.30 గంటల వరకు పరీక్ష ఉంటుంది. పరీక్షలో పేపర్‌ 1, పేపర్‌ 2 ఉంటాయి. మెంటల్‌ ఎబిలిటీలో 90 మార్కులు, స్టాటిస్టిక్స్‌ ఎచీవ్‌మెంట్‌లో 90, మొత్తం 180 మార్కులకు ప్రశ్నపత్రం ఉం టుంది. ఇది మల్టిపుల్‌ చా యిస్‌ విధానంలో ఉం టుంది. తెలుగు, ఇంగ్లిష్, హిందీ, ఉర్దూ మీడియంలో పరీక్ష నిర్వహిస్తారు. పరీక్ష సమయం 3 గంటలు, దివ్యాంగ విద్యార్థులకు మరో అరగంట ఎక్కువ సమయం కేటాయిస్తారు. 6,7 తరగతులతో పాటు 8వ తరగతికి సంబంధించిన గణిత, సామాన్య, సాంఘిక శాస్త్రాల ఆంశాలపై 90 మార్కులకు పరీక్ష ఉంటుంది. ఇందులో గణితానికి 20, సాంఘిక, సామాన్య శాస్త్రాలకు 35 మార్కుల చొప్పున ఉంటాయి.

ఎంపిక విధానం...
జిల్లా ప్రతిపాదికన మెరిట్‌ లిస్ట్‌ రూపొందిస్తారు. ప్రతి పేపర్‌లో కనీస అర్హత మార్కులు పొందాల్సి ఉంటుంది. జనరల్‌ కేటగిరికి చెందిన విద్యార్థులు 40 శాతం మార్కులు, ఎస్సీ, ఎస్టీ విద్యార్థులు 32 శాతం మార్కులు సాధిస్తే ఎంపిక కావచ్చు. ఎంపికైన విద్యార్థులకు 9వ తరగతి నుంచి ఇంటర్‌ వరకు నెలకు రూ.1000 చొప్పున ఏడాదికి రూ.12000 విద్యార్థి అకౌంట్‌లో జమ చేస్తారు. 

ఇమాంపేట మోడల్‌స్కూల్‌లో 10 మంది..
2017–18 విద్యా సంవత్సరంలో నిర్వహించిన నేషనల్‌ మీన్స్‌ కమ్‌ మెరిట్‌ స్కాలర్‌షిప్‌ పరీక్షకు జిల్లా వ్యాప్తంగా ఉన్న 9 మోడల్‌స్కూల్స్‌ నుంచి 34 మంది విద్యార్థులు ఎంపిక కాగా సూర్యాపేట మండలం ఇమాంపేట మోడల్‌స్కూల్‌ నుంచి 9 మంది విద్యార్థులు ఎంపిక కావడం గమనార్హం. గత ఐదు సంవత్సరాల నుంచి ఇమాంపేట మోడల్‌స్కూల్‌ విద్యార్థులు 53 మంది ఎంపిక అయ్యారని పాఠశాల ప్రధానోపాధ్యాయుడు శంకర్‌నాయక్‌ తెలిపారు. పాఠశాలలోని ఉపాధ్యాయుల కృషి, విద్యార్థులు చదువులో ముం దుండడంతోనే ఇది సాధ్యమైనట్లు ఆయన పేర్కొన్నారు.

 రాష్ట్ర ప్రభుత్వం సహకారంతో..
ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థుల్లో ప్రతిభ వెలికి తీయడానికి కేంద్ర ప్రభుత్వం ఏటా నేషనల్‌ మీన్స్‌ కమ్‌ మెరిట్‌ స్కాలర్‌షిప్‌ల పేరిట పరీక్షలు నిర్వహిస్తూ వస్తోంది. ప్రారంభంలో తొమ్మిదో తరగతి విద్యార్థులకు మాత్రమే అవకాశం ఉండేది. అనంతరం ఎనిమిదో తరగతి విద్యార్థులకు కూడా అవకాశం కల్పించింది. కేంద్ర ప్రభుత్వం ఏటా రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో పరీక్ష నిర్వహిస్తోంది.

మరిన్ని వార్తలు