మిడ్‌మానేరు.. ఇక జాతీయ ప్రాజెక్టు

4 Nov, 2017 14:05 IST|Sakshi

రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండలం మాన్వాడ గ్రామ సమీపంలో చివరిదశ నిర్మాణంలో ఉన్న మధ్యమానేరు రిజర్వాయర్‌ ఇక జాతీయ ప్రాజెక్టు జాబితాలో చేరనుంది. రాష్ట్ర భారీ నీటిపారుదల శాఖామంత్రి తన్నీరు హరీశ్‌రావు అసెంబ్లీలో గురువారం ప్రకటన చేయడం జిల్లా ప్రజల్లో ఆనందం నింపింది.

బోయినపల్లి(చొప్పదండి): ‘మధ్యమానేరు ప్రాజెక్టు నిర్మాణానికి 2006లో టెండర్లు పిలిచారు. ఆ తర్వాత ఎనిమిదిన్నరేళ్లలో రూ.106కోట్లు ఖర్చు చేశారు. మూడేళ్లలో మేం రూ.461కోట్లు ఖర్చు చేసి యుద్ధ ప్రాతిపదికన పనులు పూర్తయ్యేలా చర్యలు తీసుకున్నాం. ప్రాజెక్టు కోసం 25 గేట్లు సిద్ధమయ్యాయి. రెండు, మూడు నెలల్లో గేట్లు బిగించి ప్రాజెక్టును జాతికి అంకితం చేస్తాం’ అని గురువారం మిడ్‌మానేరుపై అసెంబ్లీలో ప్రశ్నోత్తరాల సమయంలో కాంగ్రెస్‌ శాసనసభ్యుడు టి.జీవన్‌రెడ్డి అడిగిన ప్రశ్నకు నీటి పారుదల శాఖామంత్రి టి.హరీశ్‌రావు వివరణ ఇచ్చారు.

2లక్షల ఎకరాలకు సాగునీరు
ఉమ్మడి కరీంనగర్, వరంగల్‌ జిల్లాల్లోని సుమారు 2లక్షల ఎకరాలకు సాగునీరు అందించేందుకు రూపొందించిన మిడ్‌మానేరు ప్రాజెక్టు అంశం అసెంబ్లీలో హాట్‌ టాపిక్‌గా మారింది. ఎస్సారెస్పీ నుంచి 12 టీఎంసీల నీరు ఇక్కడకు తరలించడంతో ఎస్సారెస్పీలో నీటి లభ్యత లోటు ఏర్పడిందని ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి పేర్కొన్నారు. దీంతో మంత్రి హరీశ్‌రావు మిడ్‌మానేరుపై పూర్తి వివరణ ఇచ్చారు. అలాగే సింగూర్‌ ప్రాజెక్టు నుంచి 15 టీఎంసీల నీరు ఎస్సారెస్పీకి విడుదల చేసి లోటు పూడుస్తామని మంత్రి హామీ ఇచ్చారు.

నిల్వ సామర్థ్యం 25.873 టీఎంసీలు
25.873 టీఎంసీల నీటి నిల్వ సామర్థ్యంతో 2006లో దివంగత ముఖ్యమంత్రి వైఎస్సార్‌ మధ్యమానేరుకు రూపకల్పన చేశారు. ఈ సమయంలోనే నిజామాబాద్‌ జిల్లా ఎస్సారెస్పీ నుంచి బోయినపల్లి మండలం వరదవెల్లి క్రాస్‌ రెగ్యులేటర్‌ వరకు 122 కిలోమీటర్ల పొడవున వరదకాలువ నిర్మించారు. ఎస్సారెస్పీలో పూర్తిస్థాయి నీటిమట్టం ఉన్న తర్వాత పోటెత్తే వరదనీరును వరదకాలువ ద్వారా మిడ్‌మానేరులోకి తరలించేందుకు వీలుగా నిర్మించారు. వైఎస్సార్‌ మరణానంతరం వచ్చిన ప్రభుత్వాలు ప్రాజెక్టుపై శ్రద్ధ చూపలేదు. టీఆర్‌ఎస్‌ అధికారంలోకి వచ్చిన మూడేళ్లలోనే రూ.461కోట్లు ఖర్చు చేయడంతో పది టీఎంసీల నీటి నిల్వ సామర్థ్యానికి ప్రాజెక్టు రూపుదిద్దుకుంది.

ప్రత్యేక గుర్తింపు
కేంద్ర ప్రభుత్వం అనుమతి ఉన్న ప్రాజెక్టుగా మధ్యమానేరు ఇప్పటికే ప్రత్యేక గుర్తింపు పొందింది. ఏఐబీపీ(ఆక్సిలరేటెడ్‌ ఇరిగేషన్‌ బెనిఫిట్‌ ప్రోగ్రాం) జాబితాలో మిడ్‌మానేరు ఉండడంతో కేంద్ర ప్రభుత్వం నుంచి ప్రాజెక్టుకు 25 శాతం నిధులు వస్తాయని ఇంజినీరింగ్‌ అధికారులు పేర్కొంటున్నారు. ప్రాజెక్టులో కాంక్రిట్‌ పనులు 4.8లక్షల క్యూబిక్‌ మీటర్లు చేయాల్సి ఉంది. 2006 నుంచి ప్రస్తుత టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం వచ్చేవరకు కేవలం 50వేల క్యూబిక్‌ మీటర్ల పని మాత్రమే చేశారు. టీఆర్‌ఎస్‌ అధికారంలోకి వచ్చాక 4.10లక్షల క్యూబిక్‌ మీటర్ల మేర పనులు చేశారు. ప్రస్తుతం మిషన్‌ భగీరథ పనుల కోసం ఎస్సారెస్పీ నుంచి వదిలిన నీరు 5.20 టీఎంసీలుంది.

వచ్చే నవంబర్‌ వరకు నీటి నిల్వ
మిడ్‌మానేరు ప్రాజెక్టు ఆధారంగా మిషన్‌ భగీరథ పథకం కింద సిరిసిల్ల, వేములవాడ, చొప్పదండి నియోజకవర్గాల్లోని 18 మండలాలు, 466 గ్రామాలకు తాగునీరు అందించేందుకు ప్రభుత్వం ప్రణాళిక సిద్ధం చేసింది. ఇందులో భాగంగానే ఎస్సారెస్పీ నుంచి వరదకాలువ ద్వారా నీరు విడుదల చేసి 5 టీఎంసీలు నిల్వ చేసింది. వచ్చే ఏడాది నవంబర్‌ వరకు మిడ్‌మానేరులో ఇది నిల్వ ఉంటుందని ఎస్‌ఈ శ్రీకాంత్‌రావు చెప్పారు. ఈలోగా ప్రాజెక్టుకు 25 గేట్లు బిగించి పూర్థిస్థాయిలో నీరు నిల్వ చేయాలని భావిస్తున్నారు. అన్నీ సవ్యంగా జరిగితే 2018 మార్చి వరకు మిడ్‌మానేరు ప్రాజెక్టును జాతికి అంకితం చేస్తారు.

పెరగనున్న భూగర్భజలాలు
మిడ్‌మానేరులో ఏడాదిపాటు 5 టీఎంసీల నీరు నిల్వ ఉంటే.. బోయినపల్లి మండలం మాన్వాడ, మల్లాపూర్, కొదురుపాక, నీలోజిపల్లి, శాభాష్‌పల్లి, వరదవెల్లి, వేములవాడ మండలం రుద్రవరం, సంకెపెల్లి, తంగళ్లపల్లి మండలం చీర్లవంచ, చింతలఠాణా తదితర ముంపు గ్రామాల పరిధిలోని పునరావాస కాలనీల్లో భూగర్భజలాలు పెరిగే అవకాశముంది. 

>
మరిన్ని వార్తలు