తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడ నుంచైనా రేషన్‌ 

27 Jul, 2019 01:44 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : ఇక రేషన్‌కు పరేషాన్‌ ఉండదు. నిరుపేదలకు నిట్టూర్పులు ఉండవు. సరుకుల కోసం నిర్దేశిత షాపు వద్దకే లబ్ధిదారులు ఉరుకులు, పరుగులు పెట్టాల్సిన పనిలేదు. తెలుగురాష్ట్రాల్లో ఎక్కడినుంచైనా రేషన్‌ సరుకులు పొందవచ్చు. దేశవ్యాప్తంగా ‘ఒకే దేశం– ఒకే కార్డు’కింద నేషనల్‌ పోర్టబిలిటీ విధానాన్ని కేంద్రం ప్రవేశపెట్టనుంది. దీనికి ఏపీ, తెలంగాణల నుంచే శ్రీకారం చుట్టింది. ఆయా ప్రాంతాలకు వలసలు వెళ్లేవారి సౌకర్యార్థం ఈ విధానాన్ని చేపట్టింది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ ఒక క్లస్టర్, గుజరాత్, మహారాష్ట్రలు మరో క్లస్టర్‌గా ఏర్పాటు చేసి ఆగస్ట్‌ ఒకటి నుంచి నేషనల్‌ పోర్టబిలిటీ విధానాన్ని అమలులోకి తేనుంది. దీనికి సంబంధించి హైదరాబాద్‌ పంజగుట్టలోని ఒక రేషన్‌ షాప్‌లో శుక్రవారం పౌర సరఫరాల శాఖ నిర్వహించిన ట్రయల్‌రన్‌ విజయవంతమైంది. ఏపీ చెందిన ఇద్దరు లబ్ధిదారులు హైదరాబాద్‌లో సరుకులు తీసుకున్నారు. పోర్టబిలిటీ ట్రయల్‌రన్‌ విజయవంతం కావడంపట్ల పౌర సరఫరాల శాఖ కమిషనర్‌ అకున్‌ సబర్వాల్‌ సంతోషం వ్యక్తం చేశారు.  

‘ట్రయల్‌రన్‌’లబ్ధిదారులు 
– పంజగుట్టలోని షాప్‌ నంబర్‌ 1677750లో పౌర సరఫరాల శాఖ శుక్రవారం ఆంధ్రప్రదేశ్‌లోని తూర్పు గోదావరి జిల్లా రాజమండ్రికి చెందిన ఈశ్వరరావు(కార్డు నంబర్‌ డబ్ల్యూఏపీ 048102580472), విశాఖపట్నం జిల్లా యలమంచిలికి చెందిన అప్పారావు (కార్డు నంబర్‌ డబ్ల్యూఏపీ 0034109700550) లబ్ధిదారులు సరుకులు తీసుకున్నారు.  

తెలంగాణే ఆదర్శం..  
రాష్ట్రంలోని 2.82 కోట్ల లబ్ధిదారులు రాష్ట్రంలోని ఏ రేషన్‌ షాపు నుంచైనా సరుకులు తీసుకునేలా పోర్టబిలిటీ విధానాన్ని గత ఏడాది ఏప్రిల్‌ నుంచి రాష్ట్ర ప్రభుత్వం అమల్లోకి తెచ్చింది. ఈ విధానాన్ని ఇప్పటి వరకు 2.07 కోట్ల మంది లబ్ధిదారుల వినియోగించుకున్నారు. హైదరాబాద్‌ జిల్లాలో 42 లక్షలు, మేడ్చల్‌ 29 లక్షలు, రంగారెడ్డి 18 లక్షలు, నిజామాబాద్‌ 10 లక్షలు, వరంగల్‌ 9 లక్షల మంది పోర్టబిలిటీ ద్వారా రేషన్‌ సరుకులను తీసుకున్నారు. ఈ విధానం దేశానికి ఆదర్శంగా నిలిచింది. 

వచ్చే జూన్‌నుంచి దేశవ్యాప్తంగా... 
దేశానికి మోడల్‌గా నిలిచిన ఈ పోర్టబిలిటీ విధానాన్ని వచ్చే ఏడాది జూన్‌ నుంచి దేశవ్యాప్తంగా అమలు చేయడానికి కేంద్రం నిర్ణయించింది. ఇందుకు కొన్ని మార్గదర్శకాలను జారీ చేసింది. 

మరిన్ని వార్తలు