‘ఉపాధి’ ఉద్యోగులపై ఉక్కుపాదం!

26 Jun, 2015 04:47 IST|Sakshi
‘ఉపాధి’ ఉద్యోగులపై ఉక్కుపాదం!

సాక్షి, హైదరాబాద్: ఉపాధిహామీ ఉద్యోగులపై ఉక్కుపాదం మోపేందుకు సర్కారు సన్నద్ధమైంది. మూడు రోజుల్లోగా సమ్మె విరమించి విధుల్లో చేరాలని, లేనిపక్షంలో.. తదుపరి ఎటువంటి సమాచారం లేకుండానే తొలగిస్తామంటూ.. సమ్మె చేస్తున్న ఉద్యోగులందరికీ గ్రామీణాభివృద్ధి శాఖ తాజాగా నోటీసులు జారీచేసింది. మహాత్మాగాంధీ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద నిర్దిష్ట కాల పరిమితి ఉద్యోగులు (ఎఫ్‌టీఈ)గా పనిచేస్తున్న వారికి కాంట్రాక్టు గడువు గత మార్చితోనే ముగియగా, కాంట్రాక్టు రెన్యువల్ పెండింగ్‌లో ఉంది.

ఫీల్డ్ అసిస్టెంట్ (ఎఫ్‌ఏ)ల కాంట్రాక్ట్ గడువు ఈ నెలాఖరుతో ముగియనుంది. అనధికారికంగా విధులకు హాజరుకాకపోవడం, సమ్మెలో పాల్గొనడం కాంట్రాక్టు నిబంధనలకు విరుద్ధమని ఉద్యోగులకు అందిన నోటీసుల్లో అధికారులు స్పష్టం చేశారు. నిబంధనలను అతిక్రమిస్తే కాంట్రాక్టును రెన్యువల్ చేసేందుకు వీలుకాదని హెచ్చరించారు.

దీర్ఘకాలంగా ఉన్న తమ డిమాండ్లను పరిష్కరించాలంటూ.. రాష్ట్రవ్యాప్తంగా సుమారు 14 వేలమంది ఎఫ్‌ఏలు, ఎఫ్‌టీఈలు నిరవధిక సమ్మెకు దిగిన సంగతి తెలిసిందే. పదేళ్లుగా కాంట్రాక్టు పద్ధతిలో పనిచేస్తున్న తమ సర్వీసును క్రమబద్ధీకరించి ఉద్యోగ భద్రత కల్పించాలని, కనీస వేతనం రూ.15 వేలు ఇవ్వాలని వారు డిమాండ్ చేస్తున్నారు. ఇప్పుడు నోటీసులు ఇవ్వడం పట్ల ఉద్యోగ సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి.
 
హరితహారానికి  ప్రత్యామ్నాయ ఏర్పాట్లు
హరితహారానికి ఉపాధిహామీ ఉద్యోగుల సమ్మె ఆటంకంగా మారింది. ఈ కార్యక్రమమంతా ఉపాధి ఉద్యోగులతోనే ముడిపడి ఉండడం, 10 రోజులుగా వారంతా సమ్మెలోనే ఉండడంతో సర్కారుకు ఏంచేయాలో పాలుపోని పరిస్థితి. కార్యక్రమం ప్రారంభానికి (జూలై 3) గడువు సమీపిస్తుండడంతో ప్రత్యామ్నాయాలపై సర్కారు దృష్టి సారించింది. అవసరమైన ఏర్పాట్లు చేయాలని గ్రామీణాభివృద్ధి విభాగం అధికారులను ఆదేశించింది. కాగా, హరితహారం బాధ్యతలను పంచాయతీ కార్యదర్శులకు అప్పగించి, ఎంపీడీవోలను పర్యవేక్షక అధికారులుగా వ్యవహరించేలా ప్రభుత్వం ప్రణాళిక సిద్ధం చేస్తుంది.
 
నిబంధనల మేరకే నోటీసులిచ్చాం..
సమ్మెలో ఉన్న కాంట్రాక్టు ఉద్యోగులందరికీ నిబంధనల మేరకే నోటీసులిచ్చాం. ఉద్యోగుల డిమాండ్లను ఇప్పటికే ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాం. సర్వీసు క్రమబద్ధీకరణ, వేతనాల పెంపు అంశాలు ప్రభుత్వ పరిశీలనలో ఉన్నందున సమ్మె విరమించి విధుల్లో చేరాలని  కోరుతున్నాం. సమ్మెను కొనసాగిస్తే.. హరితహారం అమలుకు ఇబ్బందులు తలెత్తకుండా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తున్నాం.
- అనితా రాంచంద్రన్, గ్రామీణాభివృద్ధి విభాగం కమిషనర్
 
సమ్మె ఆపం...
పదేళ్లుగా ఎటువంటి భద్రత లేకుండానే ఉద్యోగం చేస్తున్నాం. ఉద్యోగ భద్రత కల్పించమని డిమాండ్ చేస్తుంటే.. ఉద్యోగాలు పీకేస్తామని నోటీసులు ఇచ్చారు. అయినా.. మా డిమాండ్లు పరిష్కారమయ్యే వరకు సమ్మెలో కొనసాగుతాం. ఉమ్మడి రాష్ట్రంలో.. తామంతా ఆందోళన చేపట్టినప్పుడు ప్రస్తుత ముఖ్యమంత్రి, ప్రస్తుత పంచాయతీరాజ్ మంత్రి మా వద్దకు వచ్చి ప్రత్యేక రాష్ట్రమేర్పడగానే ఉద్యోగాలను క్రమబద్ధీకరిస్తామని హామీ ఇచ్చారు. దాన్ని నెరవేర్చాలి.
- శ్యామలయ్య, ఫీల్డ్ అసిస్టెంట్స్ అసోసియేషన్ అధ్యక్షుడు

మరిన్ని వార్తలు