జెండా ఏదైనా.. హామీలే ఎజెండా!

4 Apr, 2019 03:13 IST|Sakshi

విభజన హామీల నుంచి సాగునీటి ప్రాజెక్టులకు జాతీయ హోదా దాకా 

ప్రచారంలో ఈ అంశాలనే ఉపయోగించుకుంటున్నరాజకీయ పక్షాలు

సాక్షి, హైదరాబాద్‌: లోక్‌సభ ఎన్నికల ప్రచారం రాష్ట్ర ప్రజల ఎజెండా దిశగా వెళుతోంది. తమను గెలిపిస్తే ఫలానా సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామంటూ రాష్ట్రంలోని ప్రధాన రాజకీయ పక్షాలు ప్రజలకు హామీలిస్తున్నాయి. రాష్ట్రంలోని అతిపెద్ద సాగునీటి ప్రాజెక్టుకు జాతీయ హోదాతో పాటు విభజన చట్టంలో ఉండి అమలు కాని కార్యక్రమాలు, ఐటీఐఆర్, ఇతర అంశాలు రాజకీయ పార్టీలకు పచారా స్త్రాలుగా మారుతున్నాయి.  

ఆ రెండు ప్రాజెక్టులూ..! 
రాష్ట్రంలో సాగునీటి ప్రాజెక్టులకు జాతీయ హోదా అంశం ఈ ఎన్నికల్లో ప్రచారాస్త్రంగా మారింది. కాళేశ్వరం ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇవ్వాలని కేంద్రాన్ని కోరినా బీజేపీ ప్రభుత్వం పట్టించుకోలేదని టీఆర్‌ఎస్‌ ఆరోపిస్తోంది. ఇదే విషయాన్ని ఎన్నికల ప్రచారంలో కూడా ఆ పార్టీ నేతలు చెబుతున్నారు. కాళేశ్వ రం విషయంలో కేంద్రం సానుకూలంగా స్పం దించి ఉంటే బాగుండేదని బీజేపీని బోనులో నిలబెట్టే యత్నం చేస్తోంది. అయితే, తమను గెలిపించి కేంద్రంలో రాహుల్‌ను ప్రధాని చేస్తే రాష్ట్రంలోని ఏదో ఒక సాగునీటి ప్రాజెక్టుకు జాతీయ హోదా తీసుకువస్తామని ప్రతిపక్ష కాంగ్రెస్‌ ప్రజలకు చెప్తోంది. అందులో కాళేశ్వరంతో పాటు పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టులను ఆ ప్రాధాన్యాలుగా ఎంచుకుంటోంది.  

విభజన అంశాలు తెరపైకి 
తమను 16 ఎంపీ స్థానాల్లో గెలిపిస్తే జాతీయ రాజకీయాల్లో కీలకమవుతామని టీఆర్‌ఎస్‌ ప్రకటించిన నాటి నుంచే రాష్ట్ర విభజన చట్టం లోని హామీలు తెరపైకి వచ్చాయి. ఇప్పటికే ఆ పార్టీ దగ్గర 15 మంది ఎంపీలున్నారని, అయి నా విభజన చట్టంలోని హామీలను కూడా సాధించలేకపోయారని కాంగ్రెస్‌ ఆరోపిస్తోంది. బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ, ఖాజీపేట రైల్‌కోచ్‌ ఫ్యాక్టరీ, గిరిజన, ఉద్యాన వర్సిటీల ఏర్పాటు, తొమ్మిది, పది షెడ్యూళ్లలోని సంస్థల విభజన లాంటి అంశాలు ఈ హామీల రూపంలో పెండింగ్‌లో ఉండటంతో వీటిని కూడా ఎన్నికల ప్రచారాస్త్రాలుగా చేసుకుని రాజకీయ పార్టీ లు ముందుకెళుతున్నాయి. పార్లమెంటులో ఆమోదించిన చట్టంలోని అంశాలను సైతం నెరవేర్చే పనిని బీజేపీ మర్చిపోయిందని టీఆర్‌ఎస్‌ ప్రచారం చేస్తోంది.  

ఆ మూడూ కీలకమే..! 
వీటికి తోడు ఐటీఐఆర్, పసుపుబోర్డు ఏర్పాటు, ఎర్రజొన్నల అంశం కూడా ఈసారి ఎన్నికల్లో ప్రచారాస్త్రాలుగా మారుతున్నాయి. ఐటీఐఆర్‌ను ప్రకటించి కేంద్రం వదిలేసిందని టీఆర్‌ఎస్‌ చెబుతుంటే 50 లక్షల మందికి ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి కల్పించే ఈ ప్రాజెక్టును తాము పూర్తి చేస్తామని కాంగ్రెస్‌ హామీ ఇస్తోంది. కానీ, బీజేపీ మాత్రం రాష్ట్రం నుంచి సరైన రీతిలో ప్రతిపాదనలు వెళ్లనందునే ఈ ప్రాజెక్టు సకాలంలో మంజూరు కాలేదని ఓటర్లకు నచ్చజెప్పే ప్రయత్నం చేస్తోంది. ఇక, భారీ ఎత్తున నిజామాబాద్‌ లోక్‌సభకు నామినేషన్ల దాఖలుకు కారణమైన పసుపుబోర్డు ఏర్పాటు, ఎర్రజొన్న రైతుల అంశాలు కూడా పెద్ద ఎత్తున ప్రచారంలో చర్చనీయాంశమవుతున్నాయి.  

అనేక అంశాలపై...  
వీటితో పాటు హైదరాబాద్‌–కరీంనగర్‌ రైల్వేలైన్, స్మార్ట్‌సిటీల ఏర్పాటు, పోడు భూముల సమస్య పరిష్కారం, సింగరేణిలో కారుణ్య నియామకాలు, మెడికల్‌ కళాశాలల ఏర్పాటు, తుమ్మిడిహెట్టి బ్యారేజీ, సచివాలయ నిర్మాణం కోసం బైసన్‌పోలో గ్రౌండ్‌ అప్పగింత లాంటి కేంద్రంతో సంబంధమున్న అనేక అంశాలపై అధికార టీఆర్‌ఎస్, ప్రతిపక్ష కాంగ్రెస్‌తో పాటు బీజేపీ కూడా క్షేత్రస్థాయిలో తమదైన రీతిలో ప్రచారం చేసుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో ఈసారి ఎన్నికల్లో ఓటర్లు ఎలాంటి తీర్పునిస్తారు...కేసీఆర్‌ ప్రతిపాదిస్తున్న విధంగా జాతీయ స్థాయిలో టీఆర్‌ఎస్‌ను బలీయమైన శక్తిగా నిర్ణయిస్తారా.. మోదీ, రాహుల్‌గాంధీల ప్రధాని అభ్యర్థిత్వం వైపు మొగ్గు చూపుతారా అన్నది వేచిచూడాల్సిందే..!

రోడ్లు... ఓటుకు బాటలు 
తాము ప్రతిపాదించి కార్యరూపంలోకి తీసుకొస్తున్న రీజినల్‌ రింగురోడ్డు ఓట్ల వర్షం కురిపిస్తుందని టీఆర్‌ఎస్‌ ఆశిస్తోంది. ఉమ్మడి రంగారెడ్డి, నల్లగొండ, మెదక్, మహబూబ్‌నగర్‌ జిల్లాలకు ఉపయుక్తమైన ఈ ప్రాజెక్టు రూ.12వేల కోట్ల వ్యయం అంచనాతో, 338 కిలోమీటర్లు మేర రెండు లేన్లలో ఏర్పాటు కావాల్సి ఉంది. అయితే, ఇందులో కేంద్రం వాటానే రూ.10,500 కోట్లు ఉంటుంది. దీంతో కేంద్రంలో టీఆర్‌ఎస్‌ను కీలకం చేస్తే ఈ ప్రాజెక్టుకు ఎలాంటి అవాంతరాలు లేకుండా పూర్తి చేస్తామని ఆ పార్టీ చెబుతోంది. గత ఐదేళ్లలో రాష్ట్రంలోని 3,155 కిలోమీటర్ల పొడవైన 25 జాతీయ రహదారులను ప్రతిపాదిస్తే కేవలం 1,388 కిలోమీటర్లను మాత్రమే కేంద్రం గుర్తించిందని, మిగిలింది గుర్తించలేదనే అంశాలను ప్రచారం చేస్తోంది

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

వేలూరు లోక్‌సభకు ఎన్నికల షెడ్యూల్‌ విడుదల

కుటుంబ కథా చిత్రం!

ఒక్కో ఓటుపై రూ.700

అలా అయితే ఫలితాలు మరోలా ఉండేవి: పవన్

రాజ్‌నాథ్‌ రాజీనామాకు సిద్ధపడ్డారా?