గో ఫర్‌ నేచర్‌

30 Jul, 2019 08:19 IST|Sakshi
గత ఏడాది చార్మినార్‌ వద్ద హెచ్‌సీయూ ఎక్స్‌ప్లోరర్స్‌ విద్యార్థుల సందడి

హెచ్‌సీయూలో ట్రెక్కింగ్, నేచర్‌వాక్‌

తెలంగాణ కల్చర్, సిటీ టూర్‌

‘ఎక్స్‌ప్లోరర్స్‌’తో విద్యార్థుల్లో ఐక్యత  

సీనియర్, జూనియర్ల మధ్య సఖ్యత

వీకెండ్స్‌లో చలోమంటూ పర్యటన

సహజసిద్ధమైన భారీ బండరాళ్లు.. పచ్చదనం.. వృక్ష సంపద.. వివిధ రకాల జంతువులు.. ప్రకృతి అందాల వీక్షణతో స్నేహం, ప్రేమభావన ఏర్పడేలా చేయడమే లక్ష్యంగా ‘ఎక్స్‌ప్లోరర్స్‌’ చేస్తున్న కృషి ఫలిస్తోంది. 2018లో ఏర్పాటు చేసిన  ఎక్స్‌ప్లోరర్స్‌ నిర్వాహకులు ఇప్పటి వరకు 20 వరకు కార్యక్రమాలు చేపట్టారు. గచ్చిబౌలిలోని హైదరాబాద్‌ సెంట్రల్‌ యూనివర్సిటీలోని ప్రకృతి సోయగాలను ఆస్వాదించేలా చేసి సీనియర్, జూనియర్ల మధ్య సఖ్యత, స్నేహభావం పెంపొందించేందుకు ట్రెక్కింగ్, నేచర్‌వాక్, లేక్‌ వాక్, రాక్‌ క్లైంబింగ్‌ చేస్తూ, ఫొటోగ్రఫీ కోసం ఎక్స్‌ప్లోరర్స్‌ పేరుతో ప్రత్యేక కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. ప్రధానంగా వీకెండ్‌లోనే విద్యార్థులకు అనువైన రోజుల్లో మాత్రమే వర్జిన్‌రాక్స్, వైట్‌రాక్స్‌ ప్రాంతాలలో కార్యక్రమాలు ఏర్పాటు చేస్తారు. ప్రకృతి అందాలను తిలకిస్తూ, స్నాక్స్‌ తింటూ ఎంజాయ్‌ చేస్తూ ఆహ్లాదంగా గడుపుతున్నారు.

రాయదుర్గం :హెచ్‌సీయూలో పచ్చికబయళ్లు అధికంగా ఉన్నాయి. రెండువేలకుపైగా ఎకరాల్లో విస్తరించి ఉన్న క్యాంపస్‌లో నాలుగు చెరువులు, వాటి చుట్టూ రాతికొండలు, చిట్టడవి అందులో రకరకాల పక్షులు, జంతువుల తచ్చాడుతూ కంటికి ఇంపుగానే కాకుండా ఎంతో ఆహ్లాదాన్ని కలిగిస్తుంటాయి. ఈ నేపథ్యంలో ఎక్స్‌ప్లోరర్స్‌ నేచర్‌వాక్‌ కార్యక్రమాన్ని కూడా నిర్వహిస్తోంది. ఇందులో పాల్గొనేందుకు ఎంతో మంది ఆసక్తి కనబరుస్తున్నారు.

తెలంగాణ సంస్కృతిని తెలిపేందుకే..
తెలంగాణ సంస్కృతిని విద్యార్థులకు చూపేందుకే హెచ్‌సీయూ ఎక్స్‌ప్లోరర్స్‌ ఆధ్వర్యంలో సిటీ టూర్‌ను నిర్వహిస్తున్నారు. నగరంలోని అందాలను తిలకించడం, తెలంగాణ సంస్కృతిపై అవగాహన పెంచేందుకు బోనాల వేడుకల రోజునే ఈ కార్యక్రమాన్ని గత ఏడాది ప్రారంభించారు. క్యాంపస్‌లోని సౌత్, నార్త్‌ క్యాంపస్‌ కాంప్లెక్స్‌ ప్రాంతంలో సమావేశమై సిటీటూర్‌కు బయలుదేరు తారు. గత ఏడాది 200 మంది దాకా వెళ్లగా ఈసారి 365 మంది పాల్గొన్నారు. సిటీ టూర్‌లో భాగంగా సాలార్‌జంగ్‌ మ్యూజియం, చార్మినార్, గోల్కొండ కోట, బోనాల ఉత్సవాల సందర్భంగా లాల్‌దర్వాజా అమ్మవారి దర్శనం, ఆ తర్వాత వేడుకలను తిలకిస్తారు.

అనూహ్య స్పందన.. 

దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన విద్యార్థులకు క్యాంపస్‌లోని బయోడైవర్సిటీని చూపించడమే ఎక్స్‌ప్లోరర్స్‌ లక్ష్యం. గత ఏడాది నుంచి తెలంగాణ కల్చర్‌ గురించి అందరికీ తెలిపేలా చేయడం కోసం బోనాల సందర్భంగా సిటీ టూర్‌ పేరిట కార్యక్రమాలు చేపట్టాం.  రోజరోజుకూ విద్యార్థులు చురుగ్గా పాల్గొంటున్నారు.   – రోహిత్‌కుమార్‌ బొందుగుల, హెచ్‌సీయూ ఎక్స్‌ప్లోరర్స్‌ ప్రతినిధి

స్నేహ భావన..
వారంలో ఐదురోజుల పాటు నిత్యం కంప్యూటర్లు, పుస్తకాలతో తీరికలేకుండా గడిపే విద్యార్థులకు ఆటవిడుపుగా ఉండేందుకు ఈ ఎక్స్‌ప్లోరర్‌ కార్యక్రమాలు చేస్తున్నాం. సెలవుల్లోనే ఈ కార్యక్రమాలు చేస్తాం. సీనియర్, జూనియర్‌ అనే భావన పోగొట్టేలా, అంతా కలిసి ఉండేలా, చదువులోనూ, ఇతర అంశాలలో పరస్పరం సహకరించేలా ఉపకరిస్తోంది ఈ కార్యక్రమం.   – ఎస్‌ సాయిదుర్గా రాంప్రసాద్,ఎక్స్‌ప్లోరర్స్‌ నిర్వాహకుడు

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు