బుక్‌ ఆఫ్‌ రికార్డుకు ‘నవయుగ’ శ్రీకారం

1 Aug, 2018 13:55 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

గాంధీ వేషధారణలో 184  సూక్తులను ఆలపించనున్న 184 మంది విద్యార్థులు

గాంధీజీ 150వ జయంతి  సందర్భంగా ఆయనకు ఘననివాళి

తెలుగు, తెలంగాణ బుక్‌ ఆఫ్‌ రికార్డులో చోటుకు అవకాశం

నేడు హంటర్‌రోడ్డులోని అలకనంద గార్డెన్స్‌లో ప్రారంభం

నూతన ఒరవడికి నాంది పలకనున్న  హైస్కూల్‌ విద్యార్థులు

కాజీపేట అర్బన్‌ వరంగల్‌ : జాతిపిత మహాత్మా గాంధీ 150వ జయంతి సందర్భంగా దేశవ్యాప్తంగా ఆయనకు ఘనంగా నివాళులర్పించాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపునిచ్చిన విషయం విదితమే. ఈ సందర్భంగా హన్మకొండ హంటర్‌రోడ్డులోని నవయుగ హైస్కూల్‌ కరస్పాండెంట్‌ గోపు లింగారెడ్డి తన విద్యార్థులతో నూతన ఒరవడికి నాంది పలికేందుకు సన్నాహాలు చేస్తున్నాడు. తెలుగు, తెలంగాణ బుక్‌ ఆఫ్‌ రికార్డుల్లో పాఠశాల విద్యార్థులకు చోటు సాధించడానికి అరుదైన అవకాశాన్ని అందిస్తునే రికార్డు బ్రేక్‌కు కృషి చేస్తున్నారు.

గాంధీజీ 150వ జయంతి సందర్భంగా ...

గాంధీజీ 150వ జయంతి సందర్భంగా మహాత్ముడికి ఘన నివాళి అందించాలని సంకల్పించారు. విద్యార్థులకు జాతిపిత ఆశయాలను, విశిష్టతను, స్వాతంత్య్రం సాధనకు అందించిన సేవలను తెలియజేయాలనే ఉద్దేశ్యంతో వినూత్న కార్యక్రమాన్ని చేపట్టనున్నారు. ఈ మేరకు 184 మంది విద్యార్థులు గాంధీజీ వేషధారణలో దోతి, కండువా, శాలువ, చేతి కర్ర, కళ్లజోడ్లను ధరించి, గాంధీజీ చెప్పిన 184  సూక్తులను ఆలపిస్తారు. దీంతో తెలుగు, తెలంగాణ బుక్‌ ఆఫ్‌ రికార్డులో స్థానం పొందడంతో పాటు రికార్డు కూడా బ్రేక్‌ చేయనున్నారు. ప్రతి విద్యార్థి పేరు తెలంగాణ, తెలుగు బుక్‌  ఆఫ్‌ రికార్డుల్లో నమోదు కానుంది.

నేడు అరుదైన రికార్డు కోసం ప్రదర్శన..

ఓరుగల్లు నగరంలో మరో చరిత్ర సృష్టించడానికి నవయుగ హైస్కూల్‌ విద్యార్ధులు బుధవారం తమ ప్రతిభను ప్రదర్శించడానికి సన్నద్ధమవుతున్నారు. పాఠశాలకు చెందిన ఎల్‌కేజీ నుంచి 10వ తరగతికి చెందిన విద్యార్థులు పాల్గొననున్నారు. తెలుగు, తెలంగాణ బుక్‌ ఆఫ్‌ రికార్డ్స్‌ సీఈఓ బొమ్మరెడ్డి శ్రీనివాసరెడ్డి, వరంగల్‌ కోఆర్డినేటర్‌ సీతం రఘువేందర్, యూత్‌వింగ్‌ ఇన్‌చార్జి గంగారపు అఖిల్‌లు న్యాయ నిర్ణేతలుగా వ్యవహరించనున్నారు.

ఈ ప్రదర్శనను హంటర్‌రోడ్డులోని అలకనంద గార్డెన్స్‌లో ప్రారంభించనున్నారు. మధ్యాహ్నం 2 గంటలకు హన్మకొండ పబ్లిక్‌ గార్డెన్‌లో గాంధీజీ విగ్రహానికి పూలమాల వేసి, జెడ్పీ కార్యాలయం వరకు ర్యాలీగా బయలుదేరుతారు. అనంతరం జెడ్పీలో 184 మంది గాంధీజీ వేషధారణ విద్యార్థులు స్వచ్ఛభారత్‌ను నిర్వహిస్తారు.

సాయంత్రం ఆరుగంటలకు తెలుగు, తెలంగాణ బుక్‌ ఆఫ్‌ రికార్డులో పేరు నమోదు చేసిన ధ్రువపత్రాలను అతిథుల ద్వారా అందుకోనున్నారు.   కార్యక్రమంలో అర్బన్‌ జిల్లా కలెక్టర్‌ అమ్రపాలి, పశ్చిమ ఎమ్మెల్యే దాస్యం వినయ్‌భాస్కర్,  సివిల్‌ సప్‌లై కార్పొరేషన్‌ రాష్ట్ర చైర్మన్‌ పెద్ది సుదర్శన్‌ రెడ్డి, జెడ్పీ చైర్‌పర్సన్‌ గద్దల పద్మ, ఆర్జేడీ రాజీవ్, డీడీ జగన్, ఎంఈఓ వీరభద్రునాయక్‌లు పాల్గొననున్నారు.   

గాంధీజీ ఆశయాలను తెలియజేయడమే లక్ష్యం

విద్యార్థులకు గాంధీజీ ఆశయాలను తెలియజేయడమే లక్ష్యంతో 184 మంది విద్యార్థులకు సురభి కళాకారులతో మేకప్‌ చేయిస్తున్నాం. గాంధీజీ మెరుగైన సమాజ నిర్మాణం కోసం అందించిన 184 సుక్తులను విద్యార్థులతో పలికిస్తాం. విద్యార్థులను నెలరోజలుగా తీర్చిదిద్దుతున్నాం. తెలుగు,తెలంగాణ బుక్‌ ఆఫ్‌ రికార్డుల్లో నవయుగ విద్యార్థులకు చోటు దక్కనుండటం ఆనందంగా ఉంది.

– గోపు లింగారెడ్డి ,కరస్పాండెంట్‌ ,నవయుగ హైస్కూల్‌ 

మరిన్ని వార్తలు