జన హితం.. నవరాత్రోత్సవం

11 Oct, 2018 13:18 IST|Sakshi
పట్టు వస్త్రాలు తీసుకెళ్తున్న అధికారులు (ఇన్‌సెట్‌లో) బాలా త్రిపురసుందరీ దేవిగా అమ్మవారు

పాపన్నపేట(మెదక్‌): జన జీవన  హితాన్ని కోరి ప్రారంభించే నవరాత్రి ఉత్సవాలకు భక్తులు అధిక సంఖ్యలో హాజరై అమ్మవారి కృప పొందాలని  కలెక్టర్‌ ధర్మారెడ్డి సూచించారు. బుధవారం ఏడుపాయల్లో నవరాత్రి ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. పాలకవర్గ చైర్మన్‌ విష్ణువర్ధన్‌రెడ్డి, ఈఓ మోహన్‌రెడ్డి, పాలకవర్గ డైరెక్టర్లు దుర్గమ్మతల్లికి పట్టు వస్త్రాలు సమర్పించారు. అనంతరం ప్రత్యేక పూజలుచేసి ఉత్సవ విగ్రహాన్ని పల్లకిపై  ఊరేగింపుగా తీసుకొచ్చి ప్రత్యేక మండపంలో ప్రతిష్ఠించారు.

ఉదయం 10గంటలకు ఏడుపాయలకు చేరుకున్న కలెక్టర్‌ ధర్మారెడ్డి, జాయింట్‌ కలెక్టర్‌ నగేశ్‌  మూల విరాట్‌కు ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం కలెక్టర్‌ మాట్లాడుతూ తెలంగాణలోనే ప్రసిద్ధి చెందిన ఏడుపాయల దుర్గమ్మ తల్లి ఆశేష భక్తుల ఆరాధ్య దైవమన్నారు. ప్రతిరోజు వివిధ అలంకారాలతో దర్శనమిచ్చే అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలిరావాలని కోరారు.
 
ఘనంగా పల్లకీ సేవ 
ఏడుపాయల దుర్గమ్మతల్లి  మూల విరాట్‌ విగ్రహం వద్ద ఏడుపాయల పాలకవర్గ చైర్మన్‌ విష్ణువర్ధన్‌రెడ్డి దంపతులు, ఈఓ మోహన్‌రెడ్డి, ధర్మకర్తలు కిష్టయ్య, నాగప్ప, దుర్గయ్య, జ్యోతిఅంజిరెడ్డి, ప్రభుగౌడ్, శ్రీధర్, చంద్రయ్య, కిషన్, నారాయణ, సంగప్ప, గౌరిశంకర్, నాగయ్య, ఎం.శ్రీనివాస్‌రెడ్డి, ఎక్స్‌ అఫిషియో సభ్యులు నర్సింహచార్యులు ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం అమ్మవారి ఉత్సవ విగ్రహాన్ని పల్లకిపై ఉంచి డప్పు చప్పుళ్లతో ఏడుపాయల్లో శోభయాత్ర నిర్వహించారు.  పూజల్లో పాల్గొన్న భక్తులకు తీర్థ ప్రసాదాలు అందించారు. అలాగే భక్తులకు మధ్యాహ్నం అన్నదాన కార్యక్రమం చేపట్టారు.

 
బాలా త్రిపుర సుందరీదేవిగా..
మొదటిరోజు దుర్గమ్మ తల్లి బాల త్రిపుర సుందరిదేవి విశేష అలంకారంతో భక్తులకు దర్శనమిచ్చారు. అమ్మవారిని ముదురు పసుపురంగు వస్త్రాలతో అలంకరించారు. గోకుల్‌షెడ్డును రంగు రంగుల పూలు, మెరుపు కాగితాలతో తీర్చిదిద్దారు.   కుంకుమార్చనకు రూ.250లు, అలాగే 9రోజుల గోత్రనామార్చన చేయించుకునే వారు రూ.1500 చెల్లించాలని భక్తులకు సూచించారు.

నేడు శ్రీ గాయత్రిదేవిగా. 
రెండోరోజు  గురువారం అమ్మవారు శ్రీ గాయత్రిగా దర్శనమివ్వనున్నారు.   లేత గులాబీ రంగు వస్త్రాలతో అలంకరించి ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు. అమ్మవారి పూజల్లో పాల్గొనే భక్తులు ఉదయం 9.30 నుంచి సాయంత్రం 5.30 గంటల్లోపు హాజరు కావాలలన్నారు. 

మరిన్ని వార్తలు