ఫలితాల కోసం నిరీక్షణ  

18 Jun, 2018 14:58 IST|Sakshi
నవోదయ అడ్మిషన్‌ పరీక్ష రాస్తున్న విద్యార్థులు(ఫైల్‌)  

ఆందోళనలో నవోదయ, గురుకుల అభ్యర్థులు

ప్రైవేట్‌ పాఠశాలల నుంచి పెరుగుతున్న ఒత్తిడి

ఇబ్బందుల్లో విద్యార్థుల  తల్లిదండ్రులు

జనగామ అర్బన్‌: నవోదయ, గురుకుల విద్యాసంస్థల్లో అడ్మిషన్ల కోసం ప్రవేశ పరీక్షలు నిర్వహించినా ఫలితాలు ఇంకా విడుదల కాలేదు. ఒక వైపు నూతన విద్యా సంవత్సరం ప్రారంభమైంది. ప్రైవేట్‌ పాఠశాలల్లో సిలబస్‌ శరవేగంగా దూసుకెళ్తోంది. దీంతో అడ్మిషన్‌ టెస్ట్‌ రాసిన విద్యార్థులతోపాటు వారి తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నవోదయ ప్రవేశ పరీక్షను నిర్వహించి దాదాపు రెండు నెలలు, గురుకుల పాఠశాలల్లో అడ్మిషన్ల కొరకు పదిహేను రోజుల క్రితం ప్రవేశ పరీక్ష నిర్వహించారు.

ఫలితాలు విడుదల చేయడంలో అధికారులు తాత్సారం చేస్తుండడంతో విద్యార్థులు కలవరపాటుకు గురవుతున్నారు. మరోవైపు గతంలో చదివిన ప్రైవేట్‌ పాఠశాల యాజమాన్యాల నుంచి అడ్మిషనతోపాటు బుక్స్, యూనిఫామ్స్‌ కొనుగోలు చేయాలని ఒత్తిడి వస్తోందని విద్యార్థుల తల్లిదండ్రులు చెబుతున్నారు. నాణ్యమైన విద్య అందుతుందనే ఉద్దేశంతో నవోదయ, గురుకుల పాఠశాలల్లో అడ్మిషన్లు కోసం తమ పిల్లలతో పరీక్ష రాయించిన తల్లిదండ్రులు ఫలితాలు రాకపోవడంతో ఏమి చేయాలో తోచక దిక్కులు చూస్తున్నారు. 

నవోదయకు 9700 మంది హాజరు..

2018-19 విద్యా సంవత్సరానికి గాను నవోదయ పాఠశాలలో ఆరో తరగతిలోని 80 సీట్లకు నోటిఫికేషన్‌ వేయగా ఉమ్మడి వరంగల్‌ జిల్లాలో వ్యాప్తంగా 12,079 మంది విద్యార్ధులు దరఖాస్తు చేసుకున్నారు. అధికారులు మొత్తం 54 కేంద్రాలలో ఏప్రిల్‌ 21న ప్రవేశ పరీక్ష నిర్వహించగా 9700 విద్యార్థులు హాజరయ్యారు.  

గురుకుల ప్రవేశ పరీక్షకు 6144 మంది..

జ్యోతిరావు పూలే బీసీ గురుకుల పాఠశాలలో 6, 7, 8, 9 తరగతుల్లో ఉన్న ఖాళీ సీట్ల కోసం ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా తొమ్మిది సెంటర్లలో అడ్మిషన్‌ టెస్ట్‌ నిర్వహించారు. వరంగల్‌ రూరల్, అర్బన్‌ జిల్లాలోని ఐదు కేంద్రాల్లో 4087 మంది, జయశంకర్, జనగామ, మహబుబాబాద్‌ జిల్లాల్లోని నాలుగు కేంద్రాల్లో 2057 మంది విద్యార్థులు ప్రవేశ పరీక్షకు హాజరయ్యారు. నవోదయ, గురుకుల పాఠశాల రెండింటిలో అడ్మిషన్ల కోసం ప్రవేశ పరీక్షలు రాసిన  విద్యార్థులు సైతం కొందరు ఉన్నారు.

మరిన్ని వార్తలు