పంచాయతీ ఎన్నికల్లో వర్గీకరణ పాటించాలి

24 Jun, 2018 17:34 IST|Sakshi
మీడియా సమావేశంలో మాట్లాడుతున్న మద్దికుంట లింగం నాయీ

తెలంగాణ నాయీ బ్రాహ్మణ ఐక్యవేదిక డిమాండ్‌

సాక్షి, హైదరాబాద్‌: వచ్చే గ్రామపంచాయతీ ఎన్నికల్లో వెనుకబడిన తరగతుల వారికి కేటాయించే రిజర్వేషన్లను ఏబీసీడీ గ్రూప్‌లుగా కేటాయించాలని తెలంగాణ నాయీ బ్రాహ్మణ ఐక్యవేదిక అధ్యక్షులు మద్దికుంట లింగం నాయీ డిమాండ్‌ చేశారు. ఈ  అంశంపై బీసీ సంఘాలు, ఎంబీసీ సంఘాల నాయకులు చేపట్టిన పోరాటానికి తెలంగాణ రాష్ట్ర నాయీబ్రాహ్మణ ఐక్యవేదిక సంపూర్ణ మద్దతునిస్తుందన్నారు.

శనివారం బషీర్‌బాగ్‌లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. విద్యా, ఉద్యోగాల్లో అమల్లు చేస్తున్నట్టుగానే ఎన్నికల్లోనూ బీసీ రిజర్వేషన్లు కేటగిరివారీగా అమలుచేయాలన్నారు. ఏబీసీడీలు గ్రూపులుగా రిజర్వేషన్లు కేటాయించినపుడే నాయీ బ్రాహ్మణులు, రజకులు, తదితర అట్టడుగు స్ధాయిలో ఉన్న వెనుకబడిన కులాలకు న్యాయం జరుగుతుందన్నారు. మైనారిటీ బీసీ కులాలు రాజకీయంగా ఎదిగేందుకు అవకాశం లభిస్తుందని పేర్కొన్నారు. ఈ మేరకు ప్రభుత్వం సరైన నిర్ణయం తీసుకోవాలని కోరారు. సామాజిక న్యాయసూత్రాలకు భిన్నంగా వ్యవహరిస్తే ఎంబీసీ కులాలతో కలిసి రాష్ట్రవ్యాప్తంగా పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టనున్నట్లు పేర్కొన్నారు.  

నాయీ బ్రాహ్మణ వృత్తిని తమవారు తప్ప ఇతర కుల, మతస్తులు చేపట్టకుండా ప్రభుత్వం చర్యలు చేపట్టాలని కోరారు. నాయీ బ్రాహ్మణులపై దాడుల నియంత్రణకు ప్రత్యేక చట్టం తేవాలని డిమాండ్‌ చేశారు. ఈ సమావేశంలో సంఘం గౌరవ అధ్యక్షుడు మహేష్‌ చంద్ర, రాష్ట్ర ప్రచార కార్యదర్శి తేలుకంటి శ్రీనివాస్‌ తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు