హామీలు అమలయ్యేలా చూడండి

1 Nov, 2019 17:38 IST|Sakshi
గవర్నర్‌కు వినతిపత్రం ఇస్తున్న నాయీబ్రాహ్మణులు

గవర్నర్‌ను కోరిన నాయీ బ్రాహ్మణులు

సాక్షి, హైదరాబాద్‌: తమ సామాజిక వర్గానికి రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలయ్యేలా చూడాలని తెలంగాణ నాయీబ్రాహ్మణ ఐక్యవేదిక శుక్రవారం గవర్నర్‌ డాక్టర్‌ తమిళిసై సౌందరరాజన్‌ను కోరింది. తమ సంఘీయులు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రభుత్వం పరిష్కరించేలా చేయాలని విన్నవించారు. ఐక్యవేదిక ప్రతినిధులు రాజ్‌భవన్‌లో గవర్నర్‌ను కలిసి ఈ మేరకు వినతిపత్రం సమర్పించారు. రాష్ట్రంలో ఉన్న 12 లక్షల మంది నాయీ బ్రాహ్మణుల్లో మెజారిటీ వర్గం ఇప్పటికి క్షురకులుగా జీవనం సాగిస్తున్నారని వీరిని ఆదుకోవాలని కోరారు. ఇతర కులాలకు చెందిన వారు క్షౌరవృత్తి చేపట్టకుండా సామాజిక​ రక్షణ కల్పించాలని, కార్పొరేట్‌ కంపెనీలు క్షౌరవృత్తి దారుల కడుపుకొట్టకుండా చూడాలన్నారు.

బడ్జెట్‌లో కేటాయించిన నిధులు విడుదల చేసి నాయీబ్రాహ్మణులకు సబ్సిడీ రుణాలు ఇవ్వాలని, వృత్తి నైపుణ్యం పెంచుకోవడానికి తగిన శిక్షణ ఇప్పించాలని విజ్ఞప్తి చేశారు. సెలూన్లను కమర్షియల్‌ విద్యుత్‌ టారిఫ్‌ నుంచి తప్పించాలని కోరారు. దీనిపై ముఖ్యమంత్రి కె. చంద్రశేఖరరావు ప్రగతిభవన్‌ సాక్షిగా హామీయిచ్చినప్పటికీ ఇప్పటివరకు అమలు కాలేదని గవర్నర్‌ దృష్టికి తీసుకొచ్చారు. రాష్ట్రవ్యాప్తంగా ఏళ్ల తరబడి ఆలయాల్లో సేవలు అందిస్తున్న నాయీబ్రాహ్మణులను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని.. చట్టప్రకారం ఐఎస్‌ఐ, పీఎఫ్‌ కల్పించాలని కోరారు. దాడుల నుంచి రక్షణ కల్పించేందుకు ప్రత్యేక చట్టం తీసుకురావాలన్నారు.

50 ఏళ్లు పైబడిన క్షౌరవృత్తిదారులకు ఫించన్‌ ఇవ్వాలని, ప్రభుత్వం మంజూరు చేసిన నాయీబ్రాహ్మణ కమ్యునిటీ భవనాన్ని రాజధాని హైదరాబాద్‌లో వెంటనే నిర్మించాలని డిమాండ్‌ చేశారు. తమ విజ్ఞాపనపై గవర్నర్‌ సానుకూలంగా స్పందించారని వారు తెలిపారు. గవర్నర్‌ను కలిసిన వారిలో తెలంగాణ నాయీ బ్రాహ్మణ ఐక్యవేదిక రాష్ట్ర అధ్యక్షుడు మద్దికుంట లింగం, గౌరవ అధ్యక్షుడు మహేశ్‌చంద్ర, మాదాల కిషన్‌, నర్సింహులు, అనంతయ్య, శ్రీనివాస్‌ ఉన్నారు.

మరిన్ని వార్తలు