కరుణానిధి మృతి పట్ల ‘నాయీ’ల సంతాపం

8 Aug, 2018 16:13 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: రాజకీయ దురందరుడు, తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి డాక్టర్‌ ఎం కరుణానిధి మరణం పట్ల అఖిల భారత నాయీ సెయిన్‌, సవితా, విల్లంకితుల నాయర్‌, ఇసాయ్‌ మేధావుల ఐక్య వేదిక (ఏఐఎన్‌ఐయూఎఫ్‌) సంతాపం ప్రకటించింది. భారత రాజకీయాల్లో చెరగని ముద్ర వేసిన ‘కలైంజ్ఞర్‌’ మరణం పూడ్చలేనిదని ఏఐఎన్‌ఐయూఎఫ్‌ కన్వీనర్‌ దుగ్యాల అశోక్‌ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. తమిళ నాయీ బ్రాహ్మణ కుటుంబంలో పుట్టి రాజకీయ రంగంలో శిఖరస్థాయికి ఎదిగారని కొనియాడారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. కరుణానిధి మరణం తమ జాతికి శరాఘాతమని  ఏఐఎన్‌ఐయూఎఫ్‌ ప్రతినిధి సూర్యనారాయణ వ్యాఖ్యానించారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ఆకాంక్షించారు.

ఓటమి ఎరుగని దురందరుడు
ఐదుసార్లు ముఖ్యమంత్రి పీఠాన్ని అధిష్టించి దేశ రాజకీయ రంగంలో ధ్రువతారగా వెలిగిన కరుణానిధి మరణం తమను ఎంతగానో కలచివేసిందని తెలంగాణ నాయీ బ్రాహ్మణ ఐక్యవేదిక రాష్ట్ర అధ్యక్షుడు, అడ్వకేట్‌ మద్దికుంట లింగం పేర్కొన్నారు. కరుణానిధి మృతికి ఆయన సంతాపం ప్రకటించారు. ఓటమి ఎరుగని రాజకీయ దురందరుడు కరుణానిధి అని కొనియాడారు. 13 పర్యాయాలు ఎమ్మెల్యేగా గెలిచి, ఐదుసార్లు ముఖ్యమంత్రి పీఠాన్ని అధిష్టించిన ఘనత ఆయకే దక్కిందన్నారు. డీఏంకే పార్టీకి ఏకధాటిగా 50 ఏళ్లు అధ్యక్షుడిగా కొనసాగారని, తమిళనాడులోనే కాక దేశ రాజకీయాల్లో తనదైన ముద్ర వేశారని గుర్తు చేశారు. నాయీ బ్రాహ్మణ కులంలోని గొప్ప నాయకుడు అస్తమించడంతో తామంతా తీవ్ర దిగ్భ్రాంతిలో మునిగిపోయామన్నారు. కరుణానిధి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.

కన్నీటి నివాళులు
కరుణానిధి నివాళులు అర్పిస్తూ తెలుగు రాష్ట్రాల్లోని నాయీ బ్రాహ్మణులు సంతాప కార్యక్రమాలు నిర్వహించారు. నల్లబ్యాడ్జీలు ధరించి, కరుణానిధి చిత్ర పటానికి పూల మాలలు వేసి నివాళులు అర్పించారు. సినీ, రాజకీయ రంగంలో ఆయన చేసిన సేవలను స్మరించుకున్నారు. ద్రవిద యోధుడికి కన్నీటితో కడసారి వీడ్కోలు పలికారు.

మరిన్ని వార్తలు