సైనికుల కుటుంబాలను  ఆదుకోవడం మన కర్తవ్యం

14 May, 2018 01:18 IST|Sakshi
తెలంగాణ మాజీ సైనికులు, కుటుంబసభ్యుల ఆత్మీయ సమ్మేళనంలో నాయిని నర్సింహారెడ్డి

హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి 

హైదరాబాద్‌ : దేశ సరిహద్దులో ప్రాణాలను అడ్డుపెట్టి పనిచేస్తున్న సైనికులకు మనం ఎంత చేసినా తక్కువేనని హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి అన్నారు. ఆదివారం రవీంద్రభారతిలో తెలంగాణ మాజీ సైనికులు, కుటుంబసభ్యుల ఆత్మీయ సమ్మేళనం జరిగింది. ఈ కార్యక్రమంలో నాయిని మాట్లాడుతూ, సైనికులు తమ కుటుంబాలను, భార్యాపిల్లలను వదిలిపెట్టి దేశాన్ని కాపాడుతున్నారని తెలిపారు. సైనికుల కుటుంబాలను ఆదుకోవడం మనందరి కర్తవ్యం అని అన్నారు. వీరి సంక్షేమం కోసం కేంద్ర ప్రభుత్వం నైతిక బాధ్యత వహించాలని, మంచి పథకాలను ప్రవేశపెట్టాలని కోరారు.  

సైనికుల సంక్షేమాన్ని కాపాడాలన్న కారణంతో అసెంబ్లీలో సీఎం కేసీఆర్‌ ఒకరోజు జీతాన్ని ప్రకటించారని గుర్తుచేశారు. చట్ట సభలకు ప్రాతినిధ్యం వహించే ప్రజాప్రతినిధులు మొదలుకుని ప్రభుత్వ ఉద్యోగుల వరకు ఒక్క రోజు జీతాన్ని సైనిక సంక్షేమానికి ఇచ్చారని తెలిపారు. ప్రభుత్వ ఉపాధ్యాయుల్లో ఒక గ్రూపు ఒక రోజు జీతాన్ని ఇవ్వలేదన్నారు.  కెప్టెన్‌ ఉరేష్‌రెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో టీఎన్జీవో కేంద్ర సంఘం రాష్ట్ర అధ్యక్షులు కారం రవీందర్‌రెడ్డి, సైనిక సంక్షేమ అధికారి శ్రీనిష్‌ కుమార్, బెవరేజెస్‌ కార్పొరేషన్‌ చైర్మన్‌ దేవీ ప్రసాదరావు తదితరులు పాల్గొన్నారు.  

మరిన్ని వార్తలు