‘జైపాల్‌, నేను ఒకే స్కూల్లో చదువుకున్నాం’

28 Jul, 2019 14:16 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : కాంగ్రెస్‌ సీనియర్‌ నేత, కేంద్ర మాజీ మంత్రి జైపాల్‌ రెడ్డి(77) అనారోగ్యంతో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆదివారం తెల్లవారుజామున కన్నుమూసిన సంగతి తెలిసిందే. ఆయన మృతిచెందినట్లు తెలుసుకున్న రాజకీయ ప్రముఖులు తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా జైపాల్‌తో తమకున్న అనుబంధాన్ని చెబుతూ నేతలు భావోద్వేగానికి గురయ్యారు. జైపాల్‌రెడ్డి మృతి పట్ల మాజీ మంత్రి నాయిని నర్సింహరెడ్డి సంతాపం తెలిపారు. రాజకీయ జీవితంతో మచ్చలేని నాయకుడిగా జైపాల్‌ ఎదిగారని కొనియాడారు. ఇద్దరం కలిసి దేవరకొండ హైస్కూల్‌లో కలిసి చదుకున్నామని,  ఒకేసారి ఎమ్మెల్యేలుగా శాసనసభకు వెళ్లామని గుర్తు చేశారు. జైపాల్‌ మరణం దురదృష్టకరమన్నారు. ఆయన కుటుంబానికి సానుభూతి తెలిపారు. 

ఆయన నా రాజకీయ గురువు
జైపాల్‌రెడ్డి మృతి పట్ల రాజ్యసభ సభ్యుడు డి.శ్రీనివాస్‌ సంతాపం వ్యక్తం చేశారు. జైపాల్‌ రెడ్డి వల్లే తాను ప్రస్తుతం ఈ స్థాయిలో ఉన్నానన్నారు. విద్యార్థి దశ నుంచే తనను ప్రొత్సహించారని, ఆయనే తన రాజకీయ గురువు అని పేర్కొన్నారు. ఆయన వల్లే తాను కాంగ్రెస్‌ పార్టీలో చేరనన్నారు. ఏ పార్టీలో ఉన్న ఆయనతో ప్రత్యేక అనుబంధాన్ని కొనసాగించానన్నారు. నిజమాబాద్‌కు మంచినీటి, భూగర్భ మురుగు నీటి వ్యవస్థ పనులకోసం మొదట 100 కోట్లు ఇచ్చింది జైపాల్‌ రెడ్డినేనని గుర్తుచేశారు. ఆయన మరణం దేశానికి, రాష్ట్రానికి తీరని లోటని, వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతికి తెలిపారు. 

జైపాల్‌ రెడ్డికి ఘాట్‌ ఏర్పాటు చేయాలి : ఉత్తమ్‌
జైపాల్‌రెడ్డి మరణం కాంగ్రెస్‌ పార్టీకి తీరని లోటని టీపీసీసీ చీఫ్‌ ఉత్తమ్‌రెడ్డి అన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటులో ఆయన కీలకంగా వ్యవహరించారన్నారు. జైపాల్‌రెడ్డికి ఘాట్‌ ఏర్పాటు చేయాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. రేపు అంతిమ యాత్ర  ఆయన ఇంటి నంచి ఉంటుందన్నారు. నెక్లెస్‌ రోడ్‌లో దహనకార్యక్రమాలు చేసుకోవడానికి స్థలం కేటాయించాలని ముఖ్యమంత్రి కేసీఆర్‌ను కోరారు.

మరిన్ని వార్తలు