పోలీసులకు దీటుగా ఎన్‌సీసీ విద్యార్థులు  

21 Mar, 2019 17:32 IST|Sakshi
ఎన్‌సీసీ విద్యార్థులతో ఎస్పీ అపూర్వరావు

ఎన్‌సీసీ విద్యార్థులతో ఎస్పీ అపూర్వరావు 

ఎన్నికల విధులు నిర్వహించిన వారికి రివార్డులు   

సాక్షి,వనపర్తి క్రైం: ఇటీవల జరిగిన అసెంబ్లీ, గ్రామపంచాయతీ ఎన్నికల్లో పోలింగ్‌ కేంద్రాల వద్ద క్రమశిక్షణతో పోలీసులకు దీటుగా ఎన్‌సీసీ విద్యార్థులు విధులు నిర్వహించారని ఎస్పీ అపూర్వరావు అన్నారు. బుధవారం జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ డిగ్రీ కో–ఎడ్యుకేషన్‌ కళాశాల సమావేశ మందిరంలో ఎన్నికల్లో విధులు నిర్వహించిన ఎన్‌సీసీ విద్యార్థులకు నగదు రివార్డులు అందజేశారు. అనంతరం ఎన్‌సీసీ విద్యార్థులను ప్రత్యేకంగా అభినందించారు. ముందుగా భవిత, హైమావతి, రాజేశ్వరి, రవి, ఖాజ ఎన్‌సీసీ విద్యార్థులు మాట్లాడుతూ ఎన్నికల్లో విధులు నిర్వహించడం ఎంతో ఆనందంగా ఉందన్నారు.

విధులు నిర్వహిస్తూ ఉంటే ప్రజలకు సేవలందించే అనుభూతి కలిగిందని తెలిపారు. ఎన్నికల విధులు నిర్వహించడానికి అవకాశం ఇచ్చిన ఎస్పీకి వారు కృతజ్ఞతలు తెలిపారు. ఈసందర్భంగా ఎస్పీ అపూర్వరావు అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పిన విద్యార్థులకు రూ.వెయ్యి చొప్పున రూ.4వేలు అందజేశారు. ఈసందర్భంగా వారు మాట్లాడుతూ ఎన్నికల్లో ఎన్‌సీసీ విద్యార్థులు చక్కగా విధులు నిర్వహించి, ప్రశాంతంగా ఎన్నికలు జరిగేందుకు సహకరించారన్నారు.

ఎన్‌సీసీ క్రమశిక్షణతో భావిభారత పౌరులను తయారుచేయడంలో ప్రధానపాత్ర పోషిస్తుందన్నారు. ఇదే క్రమశిక్షణతో చదువుకుని జీవితంలోనూ ఉన్నతంగా రాణించాలన్నారు. అనంతరం ఎన్నికల విధులు నిర్వహించిన ఎన్‌సీసీ విద్యార్థులకు నగదు రివార్డులు అందజేశారు. కార్యక్రమంలో డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్‌ నరసింహారావు, పీఆర్‌ఓ రాజగౌడ్, సీసీ మధు తదితరులు ఉన్నారు.  

మరిన్ని వార్తలు