ఎన్డీ నేతల అరెస్టు

18 Aug, 2014 03:03 IST|Sakshi

ఇల్లెందు : తమ భూములను దున్నుకోనివ్వడం లేదం టూ టీఆర్‌ఎస్ నాయకుడు దేవీలాల్ నాయక్ ఫిర్యాదు ఇచ్చిన నేపథ్యంలో న్యూడెమోక్రసీ నాయకులను పోలీసులు ఆదివారం అరెస్టు చేశారు. సీఐ ఎన్.రమేష్ నేతృత్వంలో ఎన్డీ నాయకులు నాయిని రాజు తదితరులను వారి ఇళ్ల వద్ద అదుపులోకి తీసుకుని పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. సమాచారం అందుకున్న ఎన్డీ కార్యకర్తలు మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నర్సయ్య,  నాయకులు రాయల చంద్రశే ఖర్, జగ్గన్నల ఆధ్వర్యంలో సుమారు 200 మంది పట్టణంలో ప్రదర్శన నిర్వహించారు. అనంతరం పోలీస్ స్టేషన్ ఎదుట బైఠాయించారు.

సుమారు రెండు గంటల పాటు ఈ ఆందోళన జరిగింది. ఈక్రమంలో సీఐ ఎన్.రమేష్‌తో ఎన్డీ నేతలు వాగ్వాదానికి దిగారు. భూవివాధంలో మీ జోక్యం ఏమిటని, ఏ అధికారంతో అరెస్టు చేశారని ప్రశ్నించారు. ఆయుధాలతో వచ్చి బెదిరింపులకు పాల్పడినట్లు తమ వద్ద ఆధారాలున్నాయని, అందులో భాగంగానే అరెస్టు చేయాల్సి వచ్చిందని సీఐ సమాధానం ఇచ్చారు. ఈ క్రమంలో వాగ్వాదం తారస్థాయికి చేరుకుంది. తనను ఏకవచనంతో సంబోధించడంతో సీఐ అసహనం వ్యక్తం చేశారు.

స్టేషన్ ఎదుట నుంచి పది నిమిషాల్లో వైదొలగాలని మైక్‌లో ఆదేశాలు జారీ చేశారు.  ఈ క్రమంలోనే సబ్ డివిజన్‌కు చెందిన పలువురు సీఐలు, ఎస్సైలను,  కొత్తగూడెం నుంచి ప్రత్యేక బలగాలను రప్పించారు. ఆందోళనకారులను మించిన స్థాయిలో పోలీసు బలగాలు స్టేషన్ ముందుకు చేరుకోవడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. ఆందోళన విషయాన్ని సీఐ ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లారు. ఏఎస్పీ రమణకుమార్  హుటాహుటిన ఇల్లెందు చేరుకుని  ఆందోళన చేస్తున్న ఎన్డీ నేతలను స్టేషన్‌లోకి పిలిచి చర్చించారు. సమస్యను పరిష్కరిస్తామని ఏఎస్పీ హామీ ఇవ్వడంతో ఎన్డీ నేతలు ఆందోళన విరమించారు.

 వివాదం ఇలా...
 ధర్మారం తండాకు చెందిన లాకావత్ దేవీలాల్ నాయక్ భూముల విషయంలో 2006 నుంచి వివాదం నడుస్తోంది. తనకు తీవ్ర అన్యాయం జరిగిందని దేవీలాల్ నాయక్ ఇటీవల ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లినట్లు తెలిసింది. ఈ క్రమంలోనే గత నెల 22న భూముల వద్ద దేవీలాల్‌కు, ఎన్డీ నేతలకు మధ్య వాగ్వాడం చోటుచేసుకున్న విషయం విదితమే. ఈ నేపథ్యంలో దేవీలాల్ ఫిర్యాదు మేరకు ఎన్డీ నేతలను పోలీసులు అరెస్టు చేశారు.

మరిన్ని వార్తలు