అల్జీమర్స్‌పై అవగాహన అవసరం: గవర్నర్‌

22 Sep, 2018 02:48 IST|Sakshi
డెమోన్షియా కేర్‌ సెంటర్‌ను పరిశీలిస్తున్న గవర్నర్‌ నరసింహన్‌ దంపతులు

హైదరాబాద్‌: సాంకేతిక పరిజ్ఞానం పెరుగుతుండటంతో మనుషుల జ్ఞాపకశక్తి తగ్గుతోందని ఉమ్మడి రాష్ట్రాల గవర్నర్‌ నరసింహన్‌ పేర్కొన్నారు. శుక్రవారం మాదాపూర్‌లోని పినిక్స్‌ ఎరీనాలో రెడ్‌ క్రాస్‌ సొసైటీ ఆధ్వర్యంలో అవెరథాన్‌ (బృహత్‌ జాగృతికరణ)ను జెండా ఊపి ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ..టెక్నాలజీపై పూర్తిగా ఆధారపడటం వల్ల జ్ఞాపకశక్తి, ఏకాగ్రత కోల్పోతున్నారన్నారు. అవసరమైనంత వరకే టెక్నాలజీని వాడాలని సూచించారు. ప్రస్తుతం ఇండియాలో 40 లక్షల మంది అల్జీమర్స్‌ వ్యాధితో బాధపడుతున్నారని, ఈ వ్యాధి వారి దగ్గరి కుటుంబీకులు 12 లక్షల మందిపై కూడా ప్రభావం చూపుతోందన్నారు.

బంధిత రాజకీయ విధానాలను రూపొందించడానికి భారతదేశంలో ఇది ఒక ఆరోగ్య ప్రధానమైన విషయంగా పరిగణించాలని పేర్కొన్నారు. ప్రతి ఒక్కరూ అల్జీమర్స్‌ వ్యాధిపై అవగాహన కలిగి ఉండాలన్నారు. రోజుకు 50 మంది రోగులకు పైగా పరీక్షించగల సామర్థ్యంతో డెమోన్షియా కేర్‌ సెంటర్‌ను ఇండియన్‌ రెడ్‌ క్రాస్‌ సొసైటీ, తెలంగాణ రాష్ట్ర శాఖ, బెంగళూర్‌లోని నైటింగేల్స్‌ మెడికల్‌ ట్రస్ట్‌ సంయుక్తంగా స్థాపించినట్లు రెడ్‌ క్రాస్‌ చైర్మన్‌ పాపారావు తెలిపారు. అల్జీమర్స్‌పై విస్తృత అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేయనున్నట్లు ఆయన పేర్కొన్నారు. ప్రజల ఆరోగ్య సంరక్షణకు వివిధ సేవలు, విపత్తు, అత్యవసర పరిస్థితులలో సహాయాన్ని అందిస్తున్న స్వచ్ఛంద సంస్థ రెడ్‌ క్రాస్‌ అని చెప్పారు. 

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు