‘నీట్‌’ ఫలితాలపై నీలినీడలు

7 Jun, 2017 02:05 IST|Sakshi
‘నీట్‌’ ఫలితాలపై నీలినీడలు

సాక్షి, హైదరాబాద్‌: ఎంబీబీఎస్, బీడీఎస్‌ కోర్సుల్లో 2017 విద్యా సంవత్సరంలో ప్రవేశానికి నిర్వహించిన నీట్‌ ఫలితాల వెల్లడిపై ఇంకా స్పష్టత రావట్లేదు. ఈ నెల 8న ఫలితాలు రావాల్సి ఉండగా, మద్రాస్, గుజరాత్‌ హైకోర్టుల్లో పిటిషన్లు వేయడం, మద్రాస్‌ కోర్టు స్టే ఇవ్వడంతో పరిస్థితి గందరగోళంగా మారిన సంగతి తెలిసిందే. దీంతో 8న ఫలితాలు రావన్న సంకేతాలు వెలువడుతున్నాయి. కొందరైతే ఈ నెల 12న ఫలితాలు రావొచ్చని అంటున్నారు. 15లోపు ఎప్పుడైనా రావొచ్చని మరికొందరు అంటున్నారు. మరోవైపు సుప్రీంకోర్టులోనూ ఇదే అంశంపై పిటిషన్‌ విచారణకు రావాల్సి ఉందన్నారు. మొత్తంగా చూస్తే ‘నీట్‌’ఫలితాలపై అస్పష్టత కొనసాగుతోంది.

మద్రాస్‌ హైకోర్టు స్టేతో..
మద్రాస్‌ హైకోర్టు మధ్యంతర స్టే విధించ డంపై విద్యార్థుల్లో ఆందోళన నెలకొంది. ఎటువంటి సమాచారం లేక ఆవేదన చెందు తున్నారు. తమిళ, ఆంగ్ల భాషల ప్రశ్న పత్రాల మధ్య తేడా ఉందని, అందువల్ల పరీక్షను రద్దు చేసి మళ్లీ నిర్వహించాలని అక్కడి విద్యార్థులు కొంద రు కోర్టును ఆశ్రయించడంతో స్టే విధిం చింది. రాష్ట్రంలోనూ తెలుగు మాధ్యమానికి బదులు ఆంగ్ల మాధ్యమంలో ప్రశ్నపత్రం ఇచ్చారంటూ వరంగల్‌ అర్బన్‌ జిల్లా కేంద్రం లో నీట్‌ విద్యార్థులు ఆందోళన చేపట్టిన సంగతి తెలిసిందే.

హన్మకొండలోని ఓ పరీక్ష కేంద్రంలో సుమారు 600 మంది విద్యార్థులు పరీక్ష రాయగా.. అందులో 100 మందికి పైగా తెలుగు మీడియంలో రాసేందుకు దరఖాస్తు చేసుకున్నారు. కానీ వారికి ఆంగ్ల మాధ్యమంలో ప్రశ్నపత్రం ఇవ్వడంతో విద్యార్థులు అవాక్కయ్యారు. చివరికి ఆంగ్ల మాధ్యమంలోనే పరీక్ష రాయాలని తేల్చ డంతో.. విద్యార్థులు వారి తల్లిదండ్రులతో కలసి పరీక్ష కేంద్రం వద్ద ఆందోళనకు దిగారు. దీంతో ఎట్టకేలకు వారి కోసం మరోసారి తెలుగు ప్రశ్నపత్రంతో పరీక్ష నిర్వహించారు కూడా. అంతేగాక సిలబస్‌లో లేని ప్రశ్నలు కూడా ఇచ్చారని విద్యారంగ నిపుణులు అభిప్రాయపడ్డారు.

>
మరిన్ని వార్తలు