వైద్య విద్యార్థులకు ధ్రువపత్రాల తలనొప్పి

5 Jul, 2018 03:02 IST|Sakshi

అఖిల భారత కోటాలో సీట్లు పొందినవారికి సమస్య

రాష్ట్రస్థాయి వెరిఫికేషన్‌కు ఒరిజినల్స్‌ ఇవ్వక సీటు దక్కని వైనం

సాక్షి, హైదరాబాద్‌: ‘నీట్‌’లో మెరిట్‌ ర్యాంకు సాధించిన రాష్ట్ర విద్యార్థులు సమస్యల వలయంలో చిక్కుకున్నారు. రాష్ట్రస్థాయిలో దరఖాస్తు చేసుకోవడానికి ముందే అఖిల భారత కోటా సీట్లకు మొదటి విడత కౌన్సిలింగ్‌ నిర్వహించారు. అందులో కొందరు తెలంగాణ విద్యార్థులు సీట్లు సాధించారు. గడువు సమీపించడంలో వివిధ రాష్ట్రాల్లోని వైద్య కాలేజీల్లో ఫీజులు చెల్లించి చేరిపోయారు. అటువంటి మెరిట్‌ విద్యార్థులు తెలంగాణలో సీటు పొందలేని పరిస్థితి నెలకొంది. రాష్ట్రంలో కౌన్సిలింగ్‌కు హాజరయ్యే పరిస్థితి వారికి లేకుండా పోయింది.

ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకున్నా కూడా సర్టిఫికెట్ల వెరిఫికేషన్‌కు ఒరిజినల్స్‌ ఇవ్వకపోవడంతో ఇక్కడి కౌన్సిలింగ్‌లో పాల్గొనలేని పరిస్థితి నెలకొంది. ఒరిజినల్స్‌ మాత్రమే వెరిఫికేషన్‌కు ఇవ్వాలని, ఎక్కడో కాలేజీలో చేరినట్లుగా కస్టోడియన్‌ సర్టిఫికెట్‌ ఇస్తే అనుమతి ఇవ్వలేమని కాళోజీ నారాయణరావు ఆరోగ్య విశ్వవిద్యాలయం నిబంధన విధించడంతో విద్యార్థులు ఆందోళన చెందుతున్నారు. అఖిల భారత కోటాలో మొదటి విడత ప్రవేశాల్లో కాలేజీలో చేరడానికి ఈనెల మూడో తేదీతో గడువు ముగిసిపోయింది. అఖిల భారత కోటాలో తొలి విడత ప్రవేశ ప్రక్రియ ప్రారంభమయ్యే నాటికి తెలంగాణలో అసలు సర్టిఫికెట్ల వెరిఫికేషనే ప్రారంభం కాలేదు. దీంతో ఇతర రాష్ట్రాల్లో అఖిల భారత కోటాలో చేరాల్సి వచ్చింది. అక్కడ సర్టిఫికెట్లు ఉండిపోవడంతో ఇక్కడ సమర్పించలేకపోయారు.

దీంతో ఇక్కడ స్థానికులైనా మొదటి విడతలో కనీసం పోటీ పడడానికి కూడా అవకాశాలు లేకుండా పోయాయి. దీంతో స్థానికంగా సీట్లు పొందలేక, తప్పని పరిస్థితుల్లో ఇతర రాష్ట్రాల్లోనే కొనసాగాల్సి వస్తుందని విద్యార్థులు ఆందోళన చెందుతున్నారు. కస్టోడియన్‌ సర్టిఫికెట్లకు అవకాశం కల్పించాలని కోరుతున్నారు. కస్టోడియన్‌ సర్టిఫికెట్లను అనుమతించబోమని ముందే నిర్ణయం తీసుకున్నామని విశ్వవిద్యాలయం వైస్‌ చాన్స్‌లర్‌ డాక్టర్‌ కరుణాకర్‌రెడ్డి ‘సాక్షి’కి తెలిపారు. వాస్తవంగా ఈనెల మూడో తేదీ నాటికి అఖిల భారత సీట్లలో చేరడానికి గడువుందని, కానీ మన రాష్ట్రంలో మొదటి విడతకు సంబంధించిన సర్టిఫికెట్ల వెరిఫికేషన్‌ గత నెల 30వ తేదీ వరకుందని ఆయన పేర్కొన్నారు. 

7 నుంచి 9 వరకు వెబ్‌ ఆప్షన్లు.. 
మొదటి విడత వెబ్‌ ఆప్షన్ల ప్రక్రియ ఈనెల ఏడో తేదీ నుంచి తొమ్మిదో తేదీ వరకు జరుగుతుందని కరుణాకర్‌రెడ్డి తెలిపారు. పదో తేదీన ఎవరెవరికి ఎక్కడ సీటు వచ్చిందో జాబితా విడుదల చేస్తామన్నారు. 

>
మరిన్ని వార్తలు