వారంలో ‘నీట్‌’ రాష్ట్ర స్థాయి ర్యాంకులు

6 Jun, 2019 02:18 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

జాతీయస్థాయిలో వేల ర్యాంకులు చూసి భయపడొద్దు

రాష్ట్రస్థాయిలో వందల్లోనే వస్తాయని నిపుణుల భరోసా

అఖిల భారత సీట్లకు మొదటి విడత కౌన్సెలింగ్‌

ఆ తర్వాతే రాష్ట్రస్థాయి కౌన్సెలింగ్‌ మొదలయ్యే అవకాశం

సాక్షి, హైదరాబాద్‌: వారం రోజుల్లోగా ‘నీట్‌’రాష్ట్రస్థాయి ర్యాంకుల ప్రకటన వెలువడుతుందని కాళోజీ నారాయణరావు ఆరోగ్య విశ్వవిద్యాలయం వర్గాలు చెబుతున్నాయి. బుధవారం ‘నీట్‌’ర్యాంకుల ప్రకటన అనంతరం రాష్ట్ర స్థాయిలో తమకెంత ర్యాంకు వస్తుందోనన్న ఆసక్తి, ఆందోళన విద్యార్థులు, వారి తల్లిదండ్రుల్లో నెలకొంది. తెలంగాణ నుంచి 48,996 విద్యార్థులు నీట్‌ పరీక్ష రాయగా, అందులో 33,044 మంది అర్హత సాధించారు. వారిలో చాలామంది జాతీయస్థాయిలో వచ్చిన వేలాది ర్యాంకులను చూసి ఆందోళన చెందుతున్నారు. కానీ రాష్ట్రస్థాయిలో ర్యాంకులు తక్కువగానే ఉంటాయని భావిస్తున్నారు. నీట్‌ నిపుణుల అంచనా ప్రకారం జాతీయస్థాయిలో 40 వేల లోపు ర్యాంకులు వచ్చిన విద్యార్థులకు, రాష్ట్ర స్థాయిలో 1,500 నుంచి 2 వేల లోపు ర్యాంకులే వచ్చే అవకాశం ఉంది.

అలాంటి వారికి కన్వీనర్‌ కోటాలోనే సీట్లు వచ్చే అవకాశం ఉంటుందని చెబుతున్నారు. జాతీయ స్థాయిలో లక్ష వరకు ర్యాంకులు వచ్చిన వారికి మన దగ్గర ప్రైవేటు కాలేజీల్లోనూ ఎంబీబీఎస్‌ సీటు వస్తుందంటున్నారు. నీట్‌లో 460 నుంచి 470 మార్కుల వరకు వచ్చిన వారికి కూడా కన్వీనర్‌ కోటాలో ఎంబీబీఎస్‌ సీట్లు వచ్చే అవకాశం ఉందని శ్రీచైతన్య కూకట్‌పల్లి జూనియర్‌ కాలేజీ డీన్‌ శంకర్‌రావు అభిప్రాయపడ్డారు. రాష్ట్ర స్థాయి ర్యాంకుల ప్రకటన అనంతరం ఈ నెల 20 నాటికి మొదటి విడత కౌన్సెలింగ్‌కు నోటిఫికేషన్‌ జారీచేస్తామని ఆరోగ్య విశ్వవిద్యాలయం వర్గాలు తెలిపాయి. జూలై చివరి నాటికి కన్వీనర్, మేనేజ్‌మెంట్‌ కోటా సీట్లను భర్తీ చేసి ఆగస్టు 1 నుంచి ఎంబీబీఎస్‌ తరగతులు ప్రారంభిస్తామని ఆరోగ్య విశ్వవిద్యాలయం వీసీ కరుణాకర్‌రెడ్డి ‘సాక్షి’కి తెలిపారు. 

రాష్ట్రంలో 4,600 ఎంబీబీఎస్‌ సీట్లు.. 
రాష్ట్రంలో ప్రభుత్వ, ప్రైవేటు మెడికల్‌ కాలేజీల్లో 2019–20 వైద్య విద్యా సంవత్సరానికి 4,600 సీట్లు అందుబాటులో ఉన్నాయి. 10 ప్రభుత్వ మెడికల్‌ కాలేజీల్లో 1,500 ఎంబీబీఎస్‌ సీట్లు, 21 ప్రైవేటు మెడికల్‌ కాలేజీల్లో 3,100 ఎంబీబీఎస్‌ సీట్లు ఉన్నాయి. ఇవికాక 10 ప్రైవేటు, ఒక ఆర్మీ, మరో ప్రభుత్వ డెంటల్‌ కాలేజీల్లో 1,106 డెంటల్‌ సీట్లున్నాయి. గతేడాది కంటే ఈసారి ఎంబీబీఎస్‌ సీట్లు ఏకంగా 1,000 పెరిగాయి. ప్రభుత్వంలోని అన్ని సీట్లు, ప్రైవేటు కాలేజీల్లోని 50 శాతం సీట్లు కన్వీనర్‌ కోటాలో భర్తీ చేస్తారు. ప్రభుత్వ మెడికల్‌ కాలేజీల్లో ఉన్న 1,500 సీట్లల్లో 15 శాతం అంటే 225 సీట్లు అఖిల భారత కోటా కింద కేంద్రం భర్తీ చేస్తుంది. వాటిల్లో రెండు విడతల కౌన్సెలింగ్‌ తర్వాత సీట్లు మిగిలితే తిరిగి వాటిని మన రాష్ట్రానికే ఇస్తారు.

మరోవైపు కేంద్రం అగ్రవర్ణ పేదలకు (ఈడబ్ల్యూఎస్‌)కు 10 శాతం రిజర్వేషన్‌ అమలు చేయాలని నిర్ణయించిన సంగతి తెలిసిందే. ఆ రిజర్వేషన్‌ అమలు చేయాలంటే ప్రస్తుత రిజర్వేషన్లు దెబ్బతినకుండా ఉంచాలి. అలాగైతే 25 శాతం సీట్లు పెంచాలి. ఆ మేరకు ప్రస్తుత సీట్లకు అదనంగా 375 సీట్లు పెరగాల్సి ఉంటుంది. అవే పెరిగితే మొత్తంగా ప్రభుత్వ ఆధ్వర్యంలో 1,875 సీట్లు అవుతాయి. వాస్తవంగా ఈడబ్ల్యూఎస్‌ కోటా సీట్ల పెంపుపై ప్రతిపాదనలు పంపాలని కేంద్రం రాష్ట్రాన్ని కోరింది. ఈ మేరకు ప్రతిపాదనలు పంపే పనిలో వైద్య విద్య డైరెక్టరేట్‌ ఉంది. ఈడబ్ల్యూఎస్‌ కోటా అమలు చేయాలంటే నోటిఫికేషన్‌ విడుదల లోపు దీనిపై కేంద్రం ఓ నిర్ణయం తీసుకోవాలి. అప్పుడే ఆ సీట్లు అందుబాటులోకి వస్తాయి. లేదంటే అంతే సంగతులు. అందుకోసమే నోటిఫికేషన్‌ను కొద్దిగా ఆలస్యంగా జారీచేయాలని ఆరోగ్య విశ్వవిద్యాలయం భావిస్తోంది. 

>
మరిన్ని వార్తలు