తాగునీటికి ‘విస్తరణ’ శాపం

28 May, 2014 23:25 IST|Sakshi

 రాయదుర్గం,న్యూస్‌లైన్: ప్రజలకు తాగునీటి సౌకర్యాన్ని మెరుగుపర్చేందుకు ఏర్పాటు చేయతలపెట్టిన పైప్‌లైన్ నిర్మాణ పనులకు రోడ్డు విస్తరణ పనుల జాప్యం శాపంగా మారింది. వాటర్‌వర్క్స్‌శాఖ గచ్చిబౌలి డివిజన్ పరిధిలో తాగునీటి సౌకర్యాన్ని మెరుగుపర్చేందుకు ఏడాది క్రితం రూ.4 కోట్లతో గౌలిదొడ్డి శివారులోని టాటా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫండమెంటల్ రీసెర్చ్(టీఐఎఫ్‌ఆర్) స్థలం వద్ద ఉన్న ప్రధాన రోడ్డు నుంచి భారీ పైప్‌లైన్ పనులను చేపట్టాలని తలపెట్టారు. అనంతరం పైప్‌లను కూడా ఏడాది క్రితమే టీఐఎఫ్‌ఆర్ నుంచి గౌలిదొడ్డి వరకు రోడ్డుకు ఇరువైపులా తెచ్చి ఉంచారు.

 కానీ ఈ లోగా నానక్‌రాంగూడ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ నుంచి గోపన్‌పల్లి ఎన్టీఆర్‌కాలనీలోని ఐటీ జోన్‌ను కలుపుతూ ఉన్న రోడ్డును విస్తరించాలని నిర్ణయించారు. మొదటివిడతలో ఎన్టీఆర్‌కాలనీ నుంచి గోపన్‌పల్లి తాండ కూడలి వరకున్న రోడ్డు విస్తరణ పనులను త్వరగా పూర్తిచేశారు. అనంతరం గోపన్‌పల్లితాండ కూడలి నుంచి గౌలిదొడ్డి ప్రభుత్వ పాఠశాల వరకున్న రోడ్డును 120 ఫీట్లు విస్తరించి మధ్యలో డివైడర్, సెంట్రల్ లైటింగ్ సిస్టమ్ ఏర్పాటు చేయాలని తలపెట్టారు. దీంతో పైప్‌లైన్ పనులకు రోడ్డు విస్తరణ అడ్డంకిగా మారింది.
 
 శాఖల మధ్య సమన్వయ లోపమే ప్రధానం: మంచినీటి పైప్‌లైన్, రోడ్డు విస్తరణ, విద్యుత్తు స్తంభాల తొలగింపు జరగాలంటే జీహెచ్‌ఎంసీ వాటర్‌వర్క్స్, రోడ్లు భవనాల శాఖ, విద్యుత్‌శాఖ అధికారులు సమన్వయంతో పనిచేయాల్సి ఉంది. కానీ మూడు శాఖల మధ్య సమన్వయలోపమే అన్ని పనులకు శాపంగా మారిం ది. ఏడాదిక్రితం పైపులను రోడ్డు పక్కనవేసి రోడ్లు భవనాల శాఖ గ్రీన్‌సిగ్నల్ కోసం వాటర్‌వర్క్స్ అధికారులు ఎదురుచూస్తున్నారు. కాగా రోడ్డు విస్తరణ పనులను చేపట్టాలన్నా విద్యుత్‌శాఖ అధికారులు రోడ్డుపక్కన వేసిన స్తంభాలను తొలగించి కొత్తగా వేసే రోడ్డు శివారున వేయాల్సిన పనులు ప్రస్తుతం పూర్తి కావొచ్చాయి. త్వరగా రోడ్డు పనులను చేపట్టి పైప్‌లైన్ పనులు పూర్తిచేస్తే  నీటి సరఫరా మెరుగుపడుతుంది.

మరిన్ని వార్తలు