రుణాల మంజూరులో ఇంత నిర్లక్ష్యమా..

13 Mar, 2014 23:20 IST|Sakshi

మంబాపూర్(పెద్దేముల్), న్యూస్‌లైన్: మెగా వాటర్ షెడ్ పథకం కింద మంజూరైన రుణం డబ్బులు చెల్లించడంలో అధికారుల జాప్యంపై గొర్రెలకాపరులు ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ వాటా డబ్బులు చెల్లించి పది నెలలవుతున్నా రుణం మొత్తం ఇవ్వకపోవడాన్ని నిరసిస్తూ మెగా వాటర్‌షెడ్ అసిస్టెంట్‌ను పంచాయతీ కార్యాలయంలో నిర్బంధించారు. పెద్దేముల్ మండల పరిధి మంబాపూర్ గ్రామంలో గురువారం చోటు చేసుకున్న సంఘటనకు సంబంధించి బాధితులు తెలిపిన వివరాలు... మంబాపూర్ గ్రామ పంచాయతీని 2009 సంవత్సరంలో మెగా వాటర్‌షెడ్ పథకం కింద ఎంపిక చేశారు. ఇందులో భాగంగా 24మంది గొర్రెలకాపరులకు రుణాలు మంజూరయ్యాయి. ఇందుకోసం వాటర్‌షెడ్ అధికారులు ఒక్కో లబ్ధిదారు నుంచి రూ.3,250చొప్పున కాంట్రిబ్యూషన్ కింద వసూలు చేశారు.

 దీనికి రెట్టింపు రూ.6,250లు ఒక్కో లబ్ధిదారుకు ఇవ్వాల్సి ఉండగా ఇప్పటివరకూ డబ్బుల జాడ లేదు. అడిగినప్పుడల్లా రేపు, మాపు అంటూ తిప్పుకుంటుండటంతో గొర్రెల కాపరుల్లో ఓపిక నశించింది. గురువారం ఉదయం వాటర్‌షెడ్ అసిస్టెంట్ బాలయ్యను పట్టుకున్నారు. పంచాయతీ కార్యాలయంలో రెండు గంటలపాటు నిలదీశారు. పది నెలలవుతున్నా రుణాలు ఎందుకు ఇవ్వడం లేదని ప్రశ్నించారు. తాము కట్టిన డబ్బులైనా తిరిగి చెల్లించాలని పట్టుపట్టారు. అయితే తన వద్ద డబ్బులు లేవని వాటర్‌షెడ్ అసిస్టెంట్ చెప్పడంతో మండిపడ్డారు. దీంతో ఆయన విషయాన్ని పైఅధికారులకు ఫోన్‌లో చెప్పారు.

అధికారులు లబ్ధిదారులతో మాట్లాడుతూ ప్రస్తుతం ఎన్నికల కోడ్ ఉన్నందున డబ్బులు ఇవ్వలేమని చెప్పడంతో లబ్ధిదారులు వెంకటయ్య, ధనరాజ్, అంజిలప్ప మండిపడ్డారు. కోడ్‌కు ముందే డబ్బులు వచ్చినా, పంపిణీ చేయకుండా పక్కదారి పట్టించడానికే ఈ విధంగా చేస్తున్నారని ఆరోపించారు. చివరకు ఎన్నికల కోడ్ ముగిసిన వెంటనే డబ్బులు ఇస్తామని అధికారులు చెప్పడంతో లబ్ధిదారులు  వాటర్‌షెడ్ అసిస్టెంట్‌ను వదిలేశారు.

>
మరిన్ని వార్తలు