నిర్లక్ష్యం

20 Mar, 2018 11:32 IST|Sakshi
నిర్మాణ దశలో ఉన్న మెదక్‌ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయ భవనం

ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయాలు పూర్తయ్యేదెన్నడో..?

2016లో నిధులు మంజూరు   ఊ  ఇంకా  పనులు పూర్తి కాని వైనం

 మెదక్‌లో పునాది దశలోనే నిర్మాణ పనులు

నర్సాపూర్‌లో పూర్తయ్యేందుకు మరింత సమయం

సాక్షి, మెదక్‌ : పొరుగు జిల్లాలో ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయాలు పూర్తి కావచ్చాయి. మెదక్‌ జిల్లాలో మాత్రం క్యాంపు కార్యాలయాల నిర్మాణ పనులు ముందుకు సాగడం లేదు. ఈ జిల్లాలో ఉన్నదే రెండు నియోజకవర్గాలు. మెదక్‌ ఎమ్మెల్యే పద్మాదేవేందర్‌రెడ్డి, నర్సాపూ ర్‌ ఎమ్మెల్యే మదన్‌రెడ్డిల క్యాంపు కార్యాలయాల నిర్మాణ పనులు పూర్తి చేయిం చడంలో ఆర్‌ఆండ్‌బీ అధికారులు విఫలమవుతున్నారన్న విమర్శలు బహిరంగగానే ఉన్నాయి. టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నియోజకవర్గ కేంద్రాల్లో ఎమ్మెల్యేలకు క్యాంపు కార్యాలయాలు ఉండాలని నిర్ణయం తీసుకుంది.

దీంతో నియోజకవర్గ కేం ద్రాల్లో జీప్లస్‌ వన్‌ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయాల నిర్మాణానికి నిధులు కేటాయించింది. 2016లో ఒక్కో ఎమ్మె ల్యే క్యాంపు కార్యాలయం నిర్మాణం కోసం రూ.కోటి నిధులు కేటాయిం చింది. నియోజకవర్గంలోని వివిధ గ్రామాల నుంచి ప్రజలు వచ్చి ఎమ్మెల్యేలను కలిసేందుకు వీలుగా క్యాంపు కార్యాలయాలను డిజైన్‌ చేయించారు. ఈ కార్యాలయంలో ఎమ్మెల్యేలకు ప్రత్యేక చాంబర్‌తోపాటు నాలుగు గదులు, హాల్, కాన్ఫరెన్స్‌ హాల్‌ నిర్మించనున్నారు. ప్రభుత్వం మెదక్, నర్సాపూర్‌ ఎమ్మెల్యేలు పద్మాదేవేందర్‌రెడ్డి, మదన్‌రెడ్డిల క్యాంపు కార్యాలయాల నిర్మాణానికి 2016 డిసెంబర్‌ నెలలో నిధులు కేటాయించింది.

నిధులు మంజూరై నెలలు గడుస్తున్నా ఇంకా పనులు పూర్తి కాకపోవడంపై ఎమ్మెల్యేల్లోనూ అసంతృప్తి వ్యక్తం అవుతోంది. డిప్యూటీ స్పీకర్‌ పద్మాదేవేందర్‌రెడ్డి పలు సందర్భాల్లో ఇంజినీరింగ్‌ అధికారుల తీరుపై అసహనం వ్యక్తం చేశారు. వెంటనే ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయాల నిర్మాణ పనులు పూర్తి చేయాలని ఆదేశించారు. అయినా పనులు పూర్తి కాకపోవడం గమనార్హం. 

ఇంకా పిల్లర్ల దశలోనే.. 
డిప్యూటీ స్పీకర్‌ నివాసం మెదక్‌ పట్టణంలో ఉంది. నియోజకవర్గ ప్రజలను ఆమె ప్రస్తుతం అక్కడే కలుస్తున్నారు. తనను కలిసేందుకు వచ్చేవారితో సమావేశమయ్యేందుకు అనువైన వసతులు అక్కడ లేవు. దీంతో ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం త్వరగా పూర్తయితే అక్కడే అధికారులు, ప్రజలను కలవవచ్చని ఆమె భావిస్తున్నారు. అయితే క్యాంపు ఆఫీసు నిర్మాణం పనులు ఎంతకూ పూర్తి కాలేదు. పట్టణ ప్రధాన రహదారి పక్కన ఫారెస్టు రేంజ్‌ ఆఫీస్‌ సమీపంలో ఈ క్యాంపు కార్యాలయం నిర్మిస్తున్నారు. ప్రస్తుతం భవన నిర్మాణం పనులు పిల్లర్ల దశలో ఉన్నాయి. పనులు పూర్తి అయ్యేందుకు మరో 8 నెలలకు పైగా సమయం పట్టవచ్చని తెలుస్తోంది. అప్పటివరకు ఎన్నికలు వస్తే నిర్మా ణం పనులు మరింత జాప్యమయ్యే అవకాశం ఉంది. 

నర్సాపూర్‌లో పూర్తి కాని పనులు
నర్సాపూర్‌ ఎమ్మెల్యే మదన్‌రెడ్డి క్యాంపు కార్యాలయం నిర్మాణం పనులు సైతం ఇంకా పూర్తి కాలేదు. నర్సాపూర్‌లోని చిల్డ్రన్స్‌ పార్క్‌ సమీపంలో ఎంపీపీ ఇంటి నిర్మాణం చేపడుతుండగా ఆ భవనాన్ని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంగా మార్చేందుకు ఎమ్మెల్యే మదన్‌రెడ్డి ఆసక్తి చూపారు. దీంతో ఆర్‌అండ్‌బీ అధికారులు ఎంపీపీ క్వార్టర్స్‌ను ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయ భవనంగా మార్చేందుకు ప్రభుత్వం నుంచి అనుమతి తీసుకున్నారు. మొత్తం రూ.70 లక్షలతో నిర్మాణ పనులు చేపట్టారు. నిర్మాణం పనులు పూర్తయ్యేందుకు మరో రెండు, మూడు నెలల సమయం పట్టవచ్చని తెలుస్తోంది. 

మరిన్ని వార్తలు