ఇళ్లు.. ఇంకెప్పుడు?

3 Jan, 2019 06:41 IST|Sakshi
కూసుమంచి మండలం జూజుల్‌రావుపేటలో పూర్తయిన డబుల్‌ బెడ్‌రూం ఇళ్లు  

నత్తనడకన సాగుతున్న  ‘డబుల్‌’ నిర్మాణాలు 

కొన్నిచోట్ల మొదలుపెట్టని ఇళ్ల పనులు 

సాక్షిప్రతినిధి, ఖమ్మం: డబుల్‌ బెడ్‌రూం ఇళ్ల నిర్మాణాలు జిల్లాలో నత్తనడకన సాగుతున్నాయి. డబుల్‌ ఇళ్లను కేటాయించి.. టెం డర్లు పూర్తి చేసినప్పటికీ క్షేత్రస్థాయిలో నెలకొన్న సమస్యలతో నిర్మాణాలు నెమ్మదిగా నడుస్తున్నాయి. వీటిలో కొన్నింటి పనులు ఇప్పటికీ ప్రారంభం కాలేదంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. నిరుపేదలు మాత్రం టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం రెండోసారి అధికారం చేపట్టడంతో నిర్మాణాల వేగం పుంజుకుంటుందనే ఆశతో ఉన్నారు.

ప్రస్తుతం ఇళ్ల నిర్మాణం పూర్తికావడం ఒక ఎత్తయితే.. వాటిని లబ్ధిదారులకు కేటాయించడం మరో ఎత్తయింది. జిల్లాలో నిరుపేదలకు కేటాయించే డబుల్‌ బెడ్‌రూం ఇళ్ల నిర్మాణాలు ఒక అడుగు ముందు కు.. రెండడుగులు వెనక్కు అన్న చందంగా సాగుతున్నాయి. ఖమ్మం, మధిర, పాలేరు, సత్తుపల్లి, వైరాతోపాటు ఇల్లెందులోని కామేపల్లి మండలానికి ప్రభుత్వం 14,490 డబుల్‌ బెడ్‌రూం ఇళ్లు కేటాయించింది. వీటిలో 8,969 నిర్మాణాలను అనుమతించగా.. 7,374 ఇళ్ల నిర్మాణానికి టెండర్లు పిలిచారు. ఇంకా 1,876 ఇళ్ల నిర్మాణాలు ప్రారంభం కాలేదు. 994 ఇళ్లు పెంత్‌బీమ్‌ స్థాయిలో ఉండగా, 827 ఇళ్లకు శ్లాబ్‌ పూర్తయింది. 722 గృహాలకు ప్రహరీ నిర్మించారు. 891 ఇళ్లకు ప్లాస్టింగ్‌ పూర్తి చేశారు. ఇక 2,064 ఇళ్ల నిర్మాణాలు పూర్తయ్యాయి. 

సవాలక్ష సమస్యలు.. 
డబుల్‌ బెడ్‌రూం ఇళ్ల నిర్మాణం విషయంలో సవాలక్ష సమస్యలు ఎదురవుతున్నాయి. మండలాలవారీగా డబుల్‌ బెడ్‌రూం ఇళ్లు మంజూరైనా.. వాటిని నిర్మించడం అధికారులకు తలనొప్పిగా మారింది. మొదటగా మండలంలో ఇళ్లు మంజూరైన ప్రాంతంలో స్థల సమస్య తీవ్రంగా ఉంది. కొన్ని ప్రాంతాల్లో మాత్రమే ప్రభుత్వ స్థలం అందుబాటులో ఉండడంతో అక్కడ మాత్రమే నిర్మాణాలు ప్రారంభించారు. అనేక ప్రాంతాల్లో స్థలాల లభ్యత లేకపోవడంతో నిర్మాణాలు ఎప్పటికప్పుడు వాయిదా పడుతూ వస్తున్నాయి.

దీంతో అధికారులు ఇళ్ల నిర్మాణం కోసం మళ్లీ స్థలాన్వేషణ చేయాల్సి వస్తోంది. ఈ కారణంగానే చాలా వరకు ఇళ్ల నిర్మాణాలు ప్రారంభం కాలేదు. అలాగే గతంలో డబుల్‌ బెడ్‌రూం ఇళ్ల నిర్మాణానికి ప్రభుత్వం రూ.5,05,000 కేటాయించగా.. ఈ నగదుతో నిర్మాణాలు పూర్తి చేసేందుకు కాంట్రాక్టర్లు ముందుకు రాలేదు. దీంతో కూడా చాలా వరకు నిర్మాణాలు నిలిచిపోయాయి. ఇక కొన్ని ప్రాంతాల్లో ఇసుక లభించకపోవడంతో సగంలో నిలిచిపోయిన ఇళ్లు చాలా వరకు ఉన్నాయి.

అలాగే లబ్ధిదారుల ఎంపిక తలనొప్పిలా మారింది. ఇన్ని ఇబ్బందులుపడి ఇళ్ల నిర్మాణం పూర్తి చేసినా.. వాటి కేటాయింపు అధికారులకు ఇబ్బందిగా మారింది. గ్రామాల్లో ఇళ్లు కావాల్సిన వారి సంఖ్య ఎక్కువగా ఉండడం.. మంజూరై.. నిర్మించిన ఇళ్లు తక్కువగా ఉండడంతో వీటిని ఎవరికి కేటాయించాలో తెలియక అధికారులు సతమతమవుతున్నారు. కొన్నిచోట్ల ఇళ్ల కేటాయింపులో అధికారులు అక్రమాలకు పాల్పడ్డారనే ఆరోపణలు వస్తుండడంతో ఇళ్ల కేటాయింపు నిలిచిపోయిన సంఘటనలు కూడా ఉన్నాయి. లాటరీ పద్ధతిలో ఇళ్ల కేటాయింపు జరుగుతున్నా.. అధికారుల తీరుపై మాత్రం ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఈ కారణాలతో నిర్మాణం పూర్తయిన ఇళ్లను కూడా ఎవరికీ కేటాయించని పరిస్థితులు కొన్నిచోట్ల ఉన్నాయి.
 
వేగవంతమయ్యేనా.. 
రెండోసారి అధికారం చేపట్టాక టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం డబుల్‌ బెడ్‌రూం ఇళ్ల నిర్మాణాలు వేగవంతం చేసేందుకు చర్యలు తీసుకుంటుందనే ఆశాభావంతో నిరుపేదలు ఉన్నారు. నిర్మాణాలు జరగాల్సిన వాటిని వేగవంతం చేయడం.. నిర్మాణంలో ఉన్న వాటి విషయంలో సమస్యలను త్వరితగతిన పరిష్కరించాలని కోరుతున్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా సీఎం కేసీఆర్‌ డబుల్‌ బెడ్‌రూం ఇళ్ల నిర్మాణానికి చర్యలు తీసుకుంటామని, నిరుపేదలకు సొంత స్థలం ఉంటే రూ.6లక్షలు మంజూరు చేస్తామని ప్రకటించారు. దీంతో నిరుపేదల్లో ఆశలు చిగురిస్తున్నాయి. తమ సొంత స్థలంలో ఇళ్లు కట్టుకునేందుకు అవకాశం కలుగుతుందని భావిస్తున్నారు. ప్రభుత్వం నుంచి ఆదేశాలు వచ్చిన తర్వాత అధికారులు డబుల్‌ బెడ్‌రూం ఇళ్ల నిర్మాణాలను వేగవంతం చేసే అవకాశం ఉంది.

మరిన్ని వార్తలు