అరుదైన ఆలయంపై అంతులేని నిర్లక్ష్యం!

7 Oct, 2018 01:39 IST|Sakshi
మొగిలిచర్ల ఏకవీరాదేవి ఆలయం

సాక్షి, హైదరాబాద్‌: ఎంతో ప్రఖ్యాతి గాంచిన కాకతీయులు నిర్మించిన ఆలయాలు శిథిలావస్థకు చేరుకుంటున్నాయి. పైకప్పులు దెబ్బతిని చిన్న వర్షానికే నీటితో నిండిపోతున్నాయి. ఈ చారిత్రక సంపదను పరిరక్షించాల్సిన ప్రభుత్వాలు చోద్యం చూస్తున్నాయి. ఎప్పటికప్పుడు పరిరక్షణ చర్యలు చేపట్టాల్సిన అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారు. వరంగల్‌ రూరల్‌ జిల్లా్లలోని గీసుకొండ మండలం మొగిలిచర్ల గ్రామంలో ఉన్న దేవాలయం ప్రత్యేకమైనది. రాణి రుద్రమదేవి కాలంలో ఇక్కడ పూజలు జరిగాయి.

వేయి స్తంభాల గుడి, రామప్ప నిర్మాణాలన్నీ సాండ్‌బాక్స్‌ టెక్నాలజీగా చెప్పుకుంటాం. కానీ మొగిలిచర్లలోని ఆలయం మాత్రం నేటి ఇంజినీర్లకే అంతుచిక్కని సాంకేతికతతో రూపుదిద్దుకుంది. రాతిబండపై భారీ శిల్పాలను, శిలలను పేర్చినా వందల సంవత్సరాల నుంచి చెక్కుచెదరకుండా నిలబడి ఉండటం విశేషం. తెలంగాణలో కాకతీయుల చరిత్రను చెప్పే అత్యంత విశిష్టతను కలిగిన దేవాలయం పాలకుల నిర్లక్ష్యం, పురావస్తు శాఖ అధికారుల చిన్నచూపుతో నిరాదరణకు గురవుతోందని చరిత్రకారులు, గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.  

గుడి విశిష్టత
కాసె సర్వప్ప రచించిన ‘సిద్దేశ్వర చరిత్ర’లో చెప్పిన దాని ప్రకారం గర్భగుడి, అంతరాలయాలు చిన్నగదులుగా, 28 స్తంభాలతో, విశాలమైన అర్ధమంటపంతో కూడిన దేవాలయం ఇది. గర్భగుడిపైన విమానం లేదు. రంగమంటపంపైన అవశేషాలు మిగిలిన ఇటుకల విమానమొకటి కనిపిస్తున్నది. హిందూ దేవాలయాలవలె తూర్పు, ఉత్తర ముఖద్వారాలతో కాక పశ్చిమాభిముఖంగా ఈ గుడి ఉంది. గర్భాలయ ద్వారపాలకులు కనిపించరు. అంతరాలయ ద్వారమొకటి కొంత పూర్వకాకతీయ లేదా చాళుక్యశైలిలో కనిపిస్తుంది. రంగమంటపం   లోకప్పు అష్టదళపద్మం, అష్టభుజకోణాల మధ్య చెక్కబడివుంది.  

గతవైభవం
కోల్పోయిన ఆలయం
హరిహరదేవుడు, మురారిదేవుడు ఇద్దరూ తిరుగుబాటుకు ప్రయత్నించడం తెలిసిన రుద్రమదేవి వారిని మొగిలిచెర్లవద్దనే నిలువరించి, ఓడించి, బంధించింది. రుద్రమ సైనికాధికారులు రేచెర్ల ప్రసాదిత్యుడు, కాయస్త జన్నిగదేవుడు, విరియాల సూరననాయకుడు వారిని శత్రుశేషం ఉండరాదని వధించారు.

దేవగిరి రాజు మహదేవుడు రుద్రమ ఏకవీరాదేవి గుడికి వెళ్తున్నపుడే అడ్డగించి, యుద్ధానికి దిగాడు. మహదేవుని ఓడించి రుద్రమదేవి తరిమికొట్టిందని తెలుస్తోంది. మొగిలిచెర్లలో సైనిక శిక్షణ కేంద్రముండేది. ప్రతాపరుద్రుని కాలంలో ఇక్కడియోధులు ఢిల్లీలో తమ యుద్ధవిద్యా ప్రదర్శనలిచ్చారు. ఏకవీరాలయంలో పేరిణీ నృత్య ప్రదర్శనలు నిర్వహించేవారని ఈ గుడిపై పరిశోధన జరిపిన చరిత్రకారులు తెలిపారు.

రుద్రమదేవి పంచరాత్ర వ్రతం
మొగిలిచర్ల ఊరికి వాయవ్య భాగాన చేను, చెలకల మధ్య ఏకవీరాదేవి (రేణుకాదేవి) ఆలయం ఉంటుంది. దీనిని కాకతిరుద్రదేవుడు (క్రీ.శ.1042 నుంచి 1130) కట్టించినట్లు చరిత్ర చెబుతోంది. ఆలయం ముందు కూలిపడిపోయిన మహాద్వారం ఆనవాళ్లు ఉన్నాయి. ఈ ఆలయం పైకప్పు 34 రాతి స్తంభాలపై నిలిచి ఉంది. గర్భాలయంలో రెండు స్తంభాలతో అంతరాలయంతో పాటు, బయట ఒక నాట్యమండపం కూడా ఉన్నది.

గర్భాలయంలో ఏకవీరాదేవి విగ్రహం లేకపోయినా, కుండలములు, కంఠాభరణము, దండ కడియాలు ధరించి చతుర్భుజాలతో ఉన్న స్త్రీదేవతామూర్తి కనిపిస్తున్నది. ఈ విగ్రహం నాలుగుచేతుల్లో ఖడ్గం, ఢమరుకం, పానపాత్ర, త్రిశూలం ఉన్నాయి.‘‘కాకతితో పాటు ఏకవీరకు పూజలు గొప్పగా జరుగుతుండేవని, ఏకవీర ఆలయం సైనికాధికారి కట్టించినదని, సువిశాల ప్రాంగణంలో ఆలయనిర్మాణం జరిగిందని, మంచినీటిబావి తవ్వకం చేయబడిందని, ఏకవీరను రుద్రమదేవి క్రమం తప్పక పూజించేదని చరిత్ర చెబుతుంది.

అంతేకాకుండా యుద్ధవ్యూహరచనలను కూడా ఇక్కడే చేసేదని చరిత్రకారులు అభిప్రాయపడుతున్నారు. ఈ గుడినుంచి ఓరుగల్లుకు రెండు రహస్య సొరంగ మార్గాలుండేవని, కాకతీయులు ఏకవీర గుడి ఎదురుగా వున్న రాతిగుండ్లను తొలిచి గదులుగా చేసారని చెప్పబడింది. పట్టాభిషేకం పూర్తయిన తర్వాత రుద్రమదేవి ఐదు రాత్రులు నిద్రపోకుండా పంచరాత్రవ్రతం ఇక్కడే చేసిందని చారిత్రక ఆధారాలు చెబుతున్నాయి.

ఆలయాన్ని కాపాడాలి
ఇంతటి చారిత్రక ప్రాముఖ్యత కలిగిన ఆలయం నేడు గత వైభవాన్ని కోల్పోయింది. అక్కడికి వెళ్లాలంటే పొలాల గట్లపై నుంచి వెళ్లాలి. సరైన మార్గం లేక అక్కడికి వెళ్లే వాళ్లు నానా ఇబ్బందులు పడాల్సి వస్తోంది. ఆ గుడిలో ఎప్పుడు కూలిపోతాయో అన్నట్లు ఆలయ స్తంభాలు ఉన్నాయి. మట్టి బస్తాలను స్తంభాలు కూలకుండా పెట్టారు. కాగా వర్షానికి ఆ మట్టి బస్తాలు తడిసి బస్తాల్లోని మట్టి కరిగిపోతుంది. ఇప్పటికైనా పురావస్తుశాఖ స్పందించి ఆలయాన్ని కాపాడాలి. –ఆరవింద్‌ ఆర్య, చరిత్ర పరిశోధకుడు

మరిన్ని వార్తలు