దూసుకొచ్చిన మృత్యువు

13 Jul, 2019 10:13 IST|Sakshi

కామారెడ్డి బస్టాండ్‌లో ప్లాట్‌ఫాంపైకి దూసుకొచ్చిన బస్సు

అక్కడికక్కడే ప్రయాణికుడి మృతి 

మరో ఇద్దరికి స్వల్ప గాయాలు

సాక్షి, కామారెడ్డి:  కామారెడ్డి బస్టాండ్‌ లో మృత్యు శకటంగా మారి దూసుకొచ్చిన ఆర్టీసీ బస్సు ఓ ప్రయాణికుడి ప్రాణాలను బలిగొంది. మాచారెడ్డి మండలం ఫరీద్‌పేట గ్రామానికి చెందిన గుంటి లక్ష్మణ్‌ (35)  హైదరాబాద్‌ వెళ్లేందుకు శుక్రవారం బస్టాండ్‌లో వేచి చూస్తున్నాడు. బస్సు ఫ్లాట్‌పాం పైకి దూసుకొచ్చి ఢీకొనడంతో లక్ష్మన్‌ అక్కడి కక్కడే మృతి చెందాడు.

 బతుకుదెరువు కోసం పట్నం పోదామని ఇంటి నుంచి బయలుదేరిన అతడిని ఆర్టీసీ బస్సు రూపంలో మృత్యువు కబలించింది. బస్టాండ్‌లో బస్సు కోసం నిరీక్షిస్తూ కుర్చీలో కూర్చుండగా బస్సు రూపంలో మృత్యువు దూసుకురావడంతో అక్కడిక్కడే మృతి చెందిన సంఘటన కామారెడ్డి కొత్త బస్టాండ్‌లో శుక్రవారం మధ్యాహ్నం చోటుచేసుకుంది. ఆర్టీసీ డ్రైవర్‌ నిర్లక్ష్యమే కారణమంటూ కుటుంబ సభ్యులు, బంధువులు ఆందోళనకు దిగారు.

వివరాలు ఇలా ఉన్నాయి.. మాచారెడ్డి మండలం ఫరీద్‌పేట గ్రామానికి చెందిన గుంటి లక్ష్మణ్‌(35) కొంత కాలం పాటు వీఆర్‌ఏగా పని చేశాడు. ప్రస్తుతం ఆయన హైదరాబాద్‌లో ప్రైవేట్‌ కార్మికుడిగా చేసుకుంటూ జీవనం సాగించడం కోసం బావమరిది ప్రశాంత్‌తో కలిసి ఇంటి నుంచి బయలుదేరాడు. ప్రశాంత్‌ డబ్బులు తీసుకోచ్చేందుకు ఏటీఎంకు వెళ్లగా, లక్ష్మణ్‌ బస్టాండ్‌లోని హైదరాబాద్‌ బస్సులు వెళ్లే 1వ నంబర్‌ ప్లాట్‌ ఫాం వద్ద కుర్చీలో కూర్చున్నాడు. ఎదురుగా స్టాప్‌ ముందు నిలిపి ఉంచిన నాన్‌స్టాప్‌ బస్సు (ఏపీ 29 జెడ్‌ 3315) ఒక్కసారిగా ప్లాట్‌ ఫాంలోకి దూసుకువచ్చి పిల్లర్‌ను డీకొట్టింది. బస్సు, పిల్లర్‌ మధ్య ఇరుక్కుపోయిన లక్ష్మణ్‌ అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ ఘటనలో మరో ఇద్దరికి స్వల్పగాయాలు కాగా కామారెడ్డి ఏరియా ఆసుపత్రికి చికిత్స కోసం తరలించారు.

సంఘటన జరిగిన వెంటనే బస్సు డ్రైవర్‌ అక్కడి నుంచి పరారయ్యాడు. బస్సులోనికి దూసుకు రావడంతో ప్రయాణికులు భయాందోళనకు గురయ్యారు. కామారెడ్డి పట్టణ ఎస్‌హెచ్‌వో రామకృష్ణ, ఎస్సైలు రవికుమార్, గోవింద్‌ సిబ్బందితో కలిసి అక్కడికి చేరుకుని విచారణ జరిపారు. డ్రైవర్‌ ఇంద్రసేనారెడ్డి నిర్లక్ష్యంతోనే లక్ష్మణ్‌ మృతి చెందాడని ఆరోపిస్తూ మృతుని బంధువులు, కుటుంబ సభ్యులు పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు.

బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్‌ చేస్తూ మృతదేహంతో బైఠాయించారు. రూ.10 లక్షల పరిహారం చెల్లించాలని, మృతుని భార్య శోభకు ఉద్యోగం ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. డీఎస్పీ లక్ష్మీనారాయణ, ఆర్టీసీ డీవీఎం గణపతిరాజు ఆందోళనకారులతో మాట్లాడి సముదాయించారు. ఆర్టీసీ నిబంధనల ప్రకారం వచ్చే లబ్ధిని మృతుని కుటుంబానికి తప్పనిసరిగా అందజేస్తామని, ఔట్‌ సోర్సింగ్‌ విధానంలో ఉద్యోగం కల్పిస్తామని ఆర్టీసీ అధికారులు అంగీకరించినట్లు తెలిసింది. దీంతో ఆందోళనకారులు శాంతించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు పోలీసులు తెలిపారు. ప్రస్తుతం బస్సు డ్రైవర్‌ ఇంద్రసేనారెడ్డి పోలీసుల అదుపులో ఉన్నట్లు సమాచారం. సాంకేతిక లోపాల కారణంగానే ప్రమాదం జరిగిందని ఆర్టీసీ వర్గాలు చెబుతున్నా.. డ్రైవర్‌ నిర్లక్ష్యమే కారణమని మృతుడి బంధువులు ఆరోపిస్తున్నారు.  

మిన్నంటిన రోదనలు 
బస్టాండ్‌ ఆవరణలో లక్ష్మణ్‌ కుటుంబ సభ్యుల రోదనలు మిన్నంటాయి. ఈ దృశ్యాలను చూసి బస్టాండ్‌లోని ప్రయాణికులు సైతం కంటతడి పెట్టారు. పెద్ద ఎత్తున ఫరీద్‌పేట్‌ గ్రామస్తులు తరలివచ్చారు. 

విచారణ చేపడుతాం
ప్రమాదానికి గల కారణాలపై విచారణ కమిటీ వేశాం. విచారణ జరుపుతున్నాం. కమిటీ నివేదిక తర్వాత ప్రమాదానికి గల కారణాలను వెల్లడిస్తాం. 
– డీవీఎం గణపతిరాజు 

మరిన్ని వార్తలు