ఏమి హాయిలే..

23 Mar, 2018 09:06 IST|Sakshi
తాబేలుపై నీటితో తడిపిన గోనెసంచులతో ఉపశమనం

జూపార్కులో వన్యప్రాణుల చల్లదనానికి ఏర్పాట్లు  

ఉపశమనం కల్పించేందుకు స్ప్రింక్లర్లు, ఫాగర్స్, కూలర్లు, ఏసీలు

గోనె సంచులు, గ్రీన్‌ పరదాలతో కూల్‌ కూల్‌..

బహదూర్‌పురా: ఎండలు మండిపోతున్నాయి.. నీటి విరజిమ్మే స్పింకర్లు, చల్లదనాన్ని ఇచ్చే గ్రీన్‌ పరదాలు.. కూలర్లు.. నీటి ఫాంట్లు.. ఫాగర్స్‌ వన్యప్రాణులకు వేసవి తాపం నుంచి ఉపశమనం కలిగించనున్నాయి. నెహ్రూ జూలాజికల్‌ పార్కులో వీటిని ఏర్పాటు చేశారు. జూలో వన్యప్రాణుల ఎన్‌క్లోజర్ల పైభాగంలో గ్రీన్‌ పరదాలు, ఎండుగడ్డి, కొబ్బరి పీచును ఏర్పాటు చేసి నీటితో తడిపి చల్లదనాన్ని కల్పిస్తున్నారు. ఓపెన్‌ ఎన్‌క్లోజర్‌లో ఉండే వన్యప్రాణులకు చుట్టూ నీటిని స్ప్రింక్లర్లతో విరజిమ్ముతున్నారు.

ఏనుగుల కోసం ప్రత్యేకంగా నిర్మించిన నీటి ఫాంట్‌లతో నీటిని విరజిమ్ముతూ వేసవితాపం నుంచి ఉపశమనం కల్పిస్తున్నారు. పులులు, సింహాలు, ఎలుగుబంట్ల ఎన్‌క్లోజర్ల వద్ద కూలర్ల ద్వారా చల్లనిగాలి, మధ్య మధ్యలో పైపుల ద్వారా నీటిని విరజిమ్ముతూ హాయిగా ఉండేలా ఏర్పాట్లు చేశారు. పక్షుల ఎన్‌క్లోజర్ల వద్ద నీటి బిందువులను పొగ రూపంలో విరజిమ్మే ఫాగర్స్‌లను ఏర్పాటు చేశారు. నిశాచర జంతువుశాల, సరీసృపాల జగత్తులో ఎండ వేడిమిని ఉపశమనం కల్పించేందుకు ఏసీలను ఏర్పాటు చేశారు. వీటికి తోడు అదనంగా బలవర్ధకమైన ఆహారం, విటమిన్స్, మినరల్స్‌ను అందజేస్తున్నారు.

మరిన్ని వార్తలు