జూలాలా.. తిరిగొచ్చెయ్యాలా!

6 Oct, 2018 08:18 IST|Sakshi

అరుదైన జంతు జాతులకు పుట్టిల్లు నెహ్రూ జూలాజికల్‌ పార్క్‌   

తొలుత హైదరాబాద్‌ జూలాజికల్‌ గార్డెన్‌గా నామకరణం

1967లో నెహ్రూ జూలాజికల్‌ పార్కుగా అభివృద్ధి  

380 ఎకరాల్లో విస్తరణ  ఠి  నేడు జూ పార్క్‌ వ్యవస్థాపక దినోత్సవం  

పార్కులో 120, 85 ఏళ్ల వయసున్న తాబేళ్లు ఉన్నాయి. నాంపల్లి జూపార్కు నుంచి ప్రస్తుత పార్కు వరకు పెద్ద తాబేలు ప్రస్థానం కొనసాగుతోంది. ఈ రెండు జీవులు జూ పార్కులో అంత్యంత ఓల్డేస్ట్‌గా గుర్తింపు పొందాయి. 

పార్కులో 163 జాతులకు చెందిన 1600 రకాల జంతువులు, 72 జాతులకు చెందిన 700 పక్షులతో పాటు సరిసృపాలు ఉన్నాయి. ఇందులో 30 క్రూరమృగాల జాతులు, 30 శాకాహార జంతు జాతులు ఉన్నాయి. 50కి పైగా పక్షి జాతులు ఉన్నాయి.

జంతువులకు ప్రతిరోజు సమృద్ధిగా ఆహారం అందజేస్తారు. వారాంతంలో ఒక రోజు (శుక్రవారం) మాత్రం పస్తులు ఉంచుతారు. ఇది వాటి ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందని అధికారులు చెబుతున్నారు.  

జూ పార్కును సందర్శించిన అరబ్‌ యువరాజులు ఏషియాటిక్‌ సింహాలు, చీతాలను బహుమతిగా అందించారు. జంతు మార్పిడిలో జత ఖడ్గ మృగాలు ఇక్కడికొచ్చాయి. జకోస్లోవియా నుంచి అరుదైన చీతాలు, షీసెల్‌ నుంచి అల్దాబ్రా తాబేళ్లు మన జూకు వచ్చాయి. 

బహదూర్‌పురా: కాంక్రీట్‌ జంగిల్‌గా మారిన మహానగరంలో మనుషులు యంత్రాలుగా బతకాల్సి వస్తోంది. ఇలాంటి చోట ఓ చిక్కని చిట్టడవి... అందులో పులుల గాండ్రింపులు, సింహాల గర్జనలు, ఏనుగుల ఘీంకారాలు వినిపిస్తే.? జింకల పరుగులు, పక్షుల సందళ్లు కనిపిస్తే.? ఎలా ఉంటుంది. అవి మనకు అతి చేరువగా తిరుగుతుంటే... ఎంతటి ఒత్తిడి అయినా వెంటనే మాయమవుతుంది. ఇంతటి అద్భుత అనుభూతిని పంచుతోంది నగరంలోని నెహ్రూ జూలాజికల్‌ పార్కు. నిత్యం రణగొణ ధ్వనులతో సతమతమయ్యే జనారణ్యానికి భిన్నంగా అరుదైన వన్యప్రాణి ప్రపంచాన్ని పరిచయం చేసే పర్యాటక కేంద్రమిది. పాతబస్తీ బహదూర్‌పురాలోని నెహ్రూ జూలాజికల్‌ పార్కు పరిశోధనలకు, అరుదైన జంతువుల పునరుత్పత్తికి కేంద్రంగా వర్ధిల్లుతోంది. అంతరించిపోయే స్థితిలో ఉన్న ఎన్నో జీవులను పునఃసృష్టి చేసి ప్రపంచానికి అందిస్తోంది. అక్టోబర్‌ 6న జూపార్కు వ్యవసాప్థక దినోత్సవం సందర్భంగా ‘సాక్షి’ ప్రత్యేక కథనం. 

నెహ్రూ జూలాజికల్‌ పార్కు సుమారు 380 ఎకరాల్లో విస్తరించి ఉంది. 1963 అక్టోబర్‌ 6న అప్పటి గవర్నర్‌ నగేశ్‌ చేతుల మీదుగా హైదరాబాద్‌ జూలాజికల్‌ గార్డెన్‌ ప్రారంభమైంది. అదేరోజు సందర్శకులకు అనుమతి ఇచ్చారు. అంతకముందు 1926లో ఏడో నిజాం ఈ మినీ జూను పబ్లిక్‌ గార్డెన్‌లో ఏర్పాటు చేశారు. 1959లో మీరాలం ట్యాంక్‌ వద్ద జూ గార్డెన్‌ను ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం అనుమతినిచ్చింది. అప్పటి ప్రధాని నెహ్రూ మరణానంతరం 1967లో నెహ్రూ జూలాజికల్‌ పార్కుగా పేరు మార్చారు.  

నాలుగు సఫారీలు...  
అడవిని పోలిన నాలుగు సఫారీలను (లయన్, టైగర్, బేర్, బైసన్‌ (ప్రస్తుతం నీల్గాయ్‌)) ఏర్పాటు చేసిన ఘనత నెహ్రూ జూలాజికల్‌ పార్కుకే దక్కింది. తొలినాళ్లలో జూలో బంధించిన జంతువులను సందర్శకులు చూసేవారు. 1970 తర్వాత జూపార్కు నిర్వహణలో అనేక మార్పులు వచ్చాయి. వన్యప్రాణుల ఆవాసాలకు అనుగుణంగా సహజమైన వాతావరణాన్ని కల్పించాలని జూ అధికారులు నిర్ణయించారు. అందుకు అనుగుణంగా 1974లో లయన్‌ సఫారీ, 1983లో టైగర్‌ సఫారీ, 1992 బేర్, బైసన్‌ సఫారీ పార్కులను ఏర్పాటు చేశారు. జంతువులు బయట తిరుగుతూ ఉంటే సందర్శకులు వాహనాల్లో నుంచి చూసే విధానమిది. అనంతరం 2000 నుంచి జూలోని జంతువులు కేజ్, మోట్, ఎన్‌క్లోజర్లకు పరిమితం కాకుండా, వాటి జీవన పరిస్థితులకు అనుగుణంగా సహజమైన వాతావరణాన్ని కల్పించి బయోలాజికల్‌ పార్కుగా తీర్చిదిద్దేందుకు సెంట్రల్‌ జూ అథారిటీ కృషి చేస్తోంది. 36 ఎకరాల్లో ఏర్పాటు చేసిన లయన్‌ సఫారీ గుజరా>త్‌ ఘిర్‌ ఫారెస్ట్‌ తరహాలో ప్రాముఖ్యతను సంతరించుకుంది. 1970కి ముందు ఘిర్‌ నేషనల్‌ ఫారెస్ట్‌తో పాటు దేశంలోనే వివిధ జూల్లోని సింహాల సంతతి వేగంగా క్షీణించసాగింది. అయితే ఇక్కడి సఫారీలో మాత్రం ఆయా ప్రాణులు వాటి సంతానాన్ని వృద్ధి చేసుకుంటున్నాయి. ఇక్కడి నుంచి సింహాలు, ఎలుగుబంట్లు, పులులను ఇతర జూలకు పంపిస్తూ, అక్కడి అరుదైన జీవులను ఇక్కడకు తీసుకొస్తున్నారు. ఇక్కడి ప్రయోగాల ఫలితంగా 20 పులులు జూలో ప్రాణం పోసుకున్నాయి. అంతేగాక అరుదైన కృష్ణ జింకలు, మూషిక జింకలు, తామిన్‌ డీర్, మణిపూర్‌ జింకల సంతతి ఇబ్బడిముబ్బడిగా పెరిగింది. ఇలా పెరిగిన జంతువులకు సహజ ఆవాసం కల్పించేందుకు అడవుల్లో వదులుతున్నారు.  

టికెట్లధరలు..
పార్కులో ప్రవేశానికి పెద్దలకు రూ.40, పిల్లలకు రూ.25. రైలు బండిలో పెద్దలకు రూ.20, పిల్లలకు రూ.10, కెమెరాకు రూ.30, వీడియో కెమెరాకు రూ.120, బ్యాటరీ వాహనంలో ప్రయాణానికి పెద్దలకు రూ.50, చిన్నారులకు రూ.40, సఫారీలో తిరిగేందుకు రూ.50, పిల్లలకు రూ.30. ప్రతి సోమవారం జూ పార్కుకు సెలవు ఉంటుంది.  
 
జూ రైడ్‌: విజటర్స్‌ వ్యాన్‌లో 10 మందిని ఎక్కించుకొని 40 నిమిషాలు జూపార్కులో తిప్పుతారు. పార్కు గేట్‌ నుంచి ప్రారంభమై తాబేలు, జింకలు, ఏనుగులు, తెల్లపులి, జాగ్వార్, ఉడ్స్, తొడేళ్లు, సింహం, చిరుతలు, నీటి గుర్రం, ఖడ్గమృగం, నిప్పుకోళ్లు, కొంగలు, జిరాఫీ, చిలుకలు, పచ్చ పాములు, నెమళ్లు, హిమాలయన్‌ ఎలుగుబంట్లను చూపించి తిరిగి జూపార్కు గేట్‌ వద్దకు చేరుకుంటుంది.  

సఫారీ రైడ్‌: పార్కులోని లయన్స్‌ సఫారీలో 30 నిమిషాలు తిరగవచ్చు. కేవలం 10 అడుగుల దూరం నుంచి పులులు, సింహాలు, ఎలుగుబంట్లు, అడవి దున్నలను చూడొచ్చు. ఇక చిట్టి రైల్‌లో 20 నిమిషాల్లో జూపార్కులోని జంతువులు, పక్షులను చూడొచ్చు.

సంతానోత్పత్తిలో గణనీయఫలితాలు..
అంతరించిపోతున్న అరుదైన వన్యప్రాణుల సంతానోత్పత్తిని జూలో చేపట్టి గణనీయమైన ఫలితాలు సాధించారు. మూషిక జింక (మౌస్‌ డియర్‌), ముళ్ల పందులు, చిన్న చిన్న పక్షులు, రాబందులతో పాటు మొసళ్లు, తెల్లజాతి పులులు, రాయల్‌ బెంగాల్‌ టైగర్‌లను ఇక్కడే పెంచారు.   

పరిశోధనలకు కేంద్రం...  
53 వసంతాలు పూర్తి చేసుకున్న జూ పార్కు పరిశోధనలకు, అరుదైన జంతువుల పునరుత్పత్తి కేంద్రంగా విరాజిల్లుతోంది. అడవిని పోలిన సఫారీలు, పగలే వెన్నెల వాతావరణంతో నిషాచర జీవులకు అనువుగాను మారింది. ఎన్నో రకాల పక్షులు, కీటకాలకు ఈ ప్రదేశం ఆలవాలం. దేశంలో పూర్తిగా కనుమరుగవుతున్న ఆసియాటిక్‌ సింహాల పరిరక్షణ, వాటి పునరుత్పత్తికి ఇక్కడ పరిశోధనలు జరుగుతున్నాయి. అంతేగాక తెల్ల పులుల సంతానోత్పత్తి కేంద్రం కూడా ఇక్కడే ఉంది. కృత్రిమ గర్భోత్పత్తి, సీసీఎంబీ పరిశోధనలకు కేంద్రంగాను ఉంది. పార్కు విహారానికి మాత్రమే గాక జంతువులు, పక్షుల్లోని కొత్త విషయాలను ప్రపంచానికి పరిచయం చేసే పరిశోధన కేంద్రంగాను రూపుదిద్దుకుంది. ‘జూ కారŠప్స్‌’ పేరుతో విద్యార్థులు, ఫ్రెండ్స్‌ ఆఫ్‌ స్నేక్‌ సొసైటీ సభ్యులు సందర్శకులకు వన్యప్రాణులపై అవగాహన కల్పిస్తున్నారు. అటవీ శాఖ ఉద్యోగాలకు శిక్షణ కేంద్రంగాను ఇది కొనసాగుతోంది.  

మరిన్ని వార్తలు