మన ఊరి సంతోష్‌.. ఇంతపెద్ద నేరం చేశాడా?

27 Jun, 2018 10:47 IST|Sakshi

ధర్మారం వాసుల ఆశ్చర్యం

నకిలీ వేలిముద్రల తయారీపై సర్వత్రా చర్చ

వ్యాపారంలో దివాలాతో సిమ్‌ల విక్రయ వ్యాపారంలోకి..

అక్రమ సంపాదన కోసం నకిలీ వేలిముద్రల తయారీ

ధర్మారం (పెద్దపల్లి) : నకిలీ వేలిముద్రల తయారీ పెద్దపల్లి జిల్లాలో కలకలం సృష్టించింది. జిల్లాలోని ధర్మారం మండల కేంద్రానికి చెందిన పాత సంతోష్‌ కుమార్‌ (38) చిన్న వయస్సులోనే వ్యాపారం చేస్తూ లాభాలు ఆర్జించేందుకు వక్రమార్గం ఎంచుకున్నాడు. తాను చేస్తున్న పని దేశద్రోహానికి పాల్పడుతున్నట్లు గుర్తించలేని ఆయన.. పోలీసులకు అడ్డంగా దొరికిపోయాడు. అక్రమ సంపాదన కోసం ఆధార్‌కార్డులో వేలిముద్రను సైతం మార్చి సిమ్‌కార్డులను విక్రయించడం సంచలనం రేకెత్తించింది. అతి సామాన్యుడిగా కనిపించే సంతోష్‌.. ఇంతపెద్ద నేరం చేశాడా అని స్థానికులు ఆశ్చర్యానికి గురవుతున్నారు.

ధర్మారం గ్రామానికి చెందిన సంతోష్‌ కుమార్‌ ఏడవ తరగతి వరకు ధర్మారంలోనే చదువుకున్నాడు. 8వ తరగతి నుంచి ఇంటర్మీడియెట్‌ వరకు కరీంనగర్‌లో చదివాడు. అనంతరం ఇంజనీరింగ్‌ చదవాలని ప్రవేశపరీక్ష రాశాడు. ఇతర రాష్ట్రాల్లో సీటు రావడంతో మధ్యలోనే చదువు మానేసి వ్యాపారంలో దిగాడు. అప్పటికే తండ్రి గౌరయ్య చేస్తున్న అడ్తి వ్యాపారానికి సహకరించే సంతోష్‌ ధర్మారం శివారులో రెండు ఎకరాల వ్యవసాయ భూమిని లీజుకు తీసుకుని ఈముపక్షుల పెంపకం చేశాడు. ఇందులో దివాలా తీశాడు.

చివరికి తన షెటర్‌లోనే ధనలక్ష్మి కమ్యూనికేషన్‌ పేరుతో వొడాఫోన్‌ ప్రీపెయిడ్‌ కనెక్షన్స్‌ డిస్ట్రిబ్యూటర్‌ వ్యాపారాన్ని ప్రారంభించాడు. ఎక్కువ కనెక్షన్స్‌ విక్రయిస్తే కమీషన్‌ ఎక్కువగా ఇస్తామని కంపెనీ టార్గెట్‌ పెట్టింది. దీంతో సంతోష్‌ ధర్మారం, వెల్గటూర్‌ కళాశాలలు, పాఠశాలల్లో సిమ్‌కార్డులు విక్రయించాడు. ఈ క్రమంలో బంధువులు, మిత్రుల ఆధార్‌ కార్డులను తీసుకునేవాడు. చివరికి ఆధార్‌కార్డులు లభించకపోవడంతో నకిలీ వేలిముద్రలకు పాల్పడినట్లు సమాచారం. చిన్నప్పటి నుంచే ప్రతి విషయంలో వివాదాస్పదంగా వ్యవహరించేవాడని మిత్రులు అంటుంటారు. కాగా.. సిమ్‌కార్డుల టార్గెట్‌ చేరేందుకు ఇతరుల వేలిముద్రలను తయారీ చేయటం పట్ల స్థానికులు నివ్వెరపోతున్నారు.

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా