‘నేరెళ్ల’ బాధితులను పంపేసిన నిమ్స్‌ వైద్యులు

8 Sep, 2017 07:46 IST|Sakshi
‘నేరెళ్ల’ బాధితులను పంపేసిన నిమ్స్‌ వైద్యులు

బలవంతంగా వెళ్లగొట్టారంటూ బాధితుల ఆందోళన
మద్దతుగా నిమ్స్‌ వద్ద కాంగ్రెస్, ప్రజాసంఘాల నేతల ధర్నా


హైదరాబాద్‌: నిమ్స్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ‘నేరెళ్ల’బాధితులను ఆస్పత్రి సిబ్బంది గురువారం రాత్రి డిశ్చార్జి చేసి, బయటకు పంపించారు. తమకు ఆరోగ్య సమస్యలు ఉన్నాయని, చికిత్స కొనసాగించాలని కోరినా బలవంతంగా బయటకు పంపేశారంటూ ఈ సందర్భంగా బాధితులు ఆందోళనకు దిగారు. వారికి మద్దతుగా మాజీ ఎంపీ వి.హనుమంతరావు, ప్రజా సంఘాల నేతలు గజ్జెల కాంతం, అనిల్‌కుమార్‌ యాదవ్, పలువురు కాంగ్రెస్‌ నేతలు కూడా ఆస్పత్రి వద్ద ధర్నాకు దిగారు. చివరికి బాధితులను తీసుకెళ్లి బంజారాహిల్స్‌లోని కేర్‌ ఆస్పత్రిలో చేర్పించారు.

వెళ్లిపోవాలని బెదిరించారు..!
‘నేరెళ్ల’ఘటనలో తీవ్రంగా గాయపడిన బానయ్య, గోపాల్, హరీశ్, ఈశ్వర్, బాలరాజు, మహేశ్‌ అనే ఆరుగురిని తెలంగాణ ప్రజాసంఘాల జేఏసీ, అఖిలపక్షం నేతలు బుధవారం సాయంత్రం హైదరాబాద్‌లోని నిమ్స్‌ ఆస్పత్రిలో చేర్పించారు. వారికి తగిన చికిత్స అందజేయాలని వైద్య సిబ్బందికి సూచించి డబ్బు కూడా కట్టారు. అయితే బుధవారం నుంచి చికిత్స అందజేసిన వైద్యులు గురువారం రాత్రి వారిని డిశ్చార్జి చేశారు.

కానీ తమకు తీవ్ర ఆరోగ్య సమస్యలు ఉన్నాయని, చికిత్స కొనసాగించాలంటూ నేరెళ్ల బాధితులు ఆందోళనకు దిగారు. తమకు పైనుంచి తీవ్ర ఒత్తిడులు వస్తున్నాయని, వెళ్లిపోవాలని గురువారం మధ్యాహ్నం నుంచే ఆస్పత్రి సిబ్బంది ఒత్తిడి చేశారని వారు పేర్కొన్నారు. పోలీసులు కూడా మఫ్టీలో వచ్చి తమ వివరాలను, ఫొటోలను తీసుకుని వెళ్లారని... పంజాగుట్ట సీఐ పోలీసు సిబ్బందితో వచ్చి వెంటనే ఆసుపత్రి విడిచి వెళ్లకపోతే చర్యలు తప్పవని హెచ్చరించారని ఆరోపించారు. చివరికి ఆసుపత్రి సిబ్బంది తమకు ఎక్కిస్తున్న సెలైన్‌లను కూడా తొలగించి బయటికి పంపించారని చెప్పారు. బాధితులను నిమ్స్‌ నుంచి పంపేసిన విషయం తెలుసుకున్న కాంగ్రెస్, ప్రజా సంఘాల నేతలు గురువారం రాత్రి నిమ్స్‌ వద్దకు చేరుకుని బైఠాయించారు.

మరిన్ని వార్తలు