జనగామ పరిసరాల్లో గూడు సమాధులు

2 Jul, 2018 00:44 IST|Sakshi
జనగామ జిల్లా రఘునాథపల్లిలో బయటపడిన గూడు సమాధి (డాల్మన్‌)

      గోదావరి తీరంలో గతంలో గుర్తింపు

      తాజాగా రఘునాథపల్లి గుట్టపై అరుదైన నిర్మాణాల జాడ

      విచ్చలవిడి క్వారీలతో కనుమరుగు 

సాక్షి, హైదరాబాద్‌: ప్రపంచంలోనే అరుదైన సమాధి నిర్మాణంగా గుర్తింపు పొందిన గూడు సమాధులు (డాల్మన్స్‌) జనగామ జిల్లాలోనూ వెలుగు చూశాయి. చుట్టూ వృత్తాకారంలో పాతిన రాళ్లు.. వాటి మధ్య నిలువు రాళ్లు, వాటి మీద వెడల్పాటి రాతి మూత ఏర్పాటు... ఇది క్రీ.పూ. 600 క్రితం నాటి సమాధుల ఆకృతి. గోదావరి నదీతీరంలోని పినపాక, మల్లూరు, జానంపేట, తాడ్వాయి తదితర దట్టమైన అటవీప్రాంతంలో వేల సంఖ్యలో ఈ తరహా నిర్మాణాలు పురావస్తు శాస్త్రవేత్తలను అబ్బురపరుస్తున్నాయి. గత ఏడాది అమెరికాలోని శాండియాగో వర్సిటీ ఆచార్యులు వీటిని పరిశీలించి ఆశ్చర్యపోయారు. వీటిపై  పరిశోధనలు అవసరమని అభిప్రాయపడ్డారు. తాజాగా కేంద్ర పురాతత్వ పర్యవేక్షణ సంస్థ (ఏఎస్‌ఐ) పినపాక మండలం జానంపేటలో వీటిపై అధ్య యనం మొదలుపెట్టింది.

ఆ తరహా సమాధులు గోదావరి నదీ తీరానికే పరిమితమయ్యాయన్న భావన అప్పట్లో వ్యక్తమైంది. కానీ జనగామ జిల్లా రఘునాథపల్లి పరిధిలోని గుట్టలపై కూడా వీటిని పోలిన సమాధులున్నట్టు తేలింది. ఆ ప్రాంతానికి చెందిన ఔత్సాహిక పురావస్తు పరిశోధకుడు రత్నాకర్‌రెడ్డి తాజాగా రఘునాథపల్లిలోని రాములవారిగుట్టపై వీటిని గుర్తించారు. ఈ ప్రాంతంలోని అన్ని గుట్టలపై ఇలాంటి సమాధులున్నాయని, వాటికి రక్షణ లేకపోవటంతో క్వారీ పేలుళ్లతో ధ్వంసమవుతున్నాయని ఆయన పేర్కొన్నారు. భావితరాలకు వీటి దర్శనభాగ్యం ఉండాలంటే క్వారీలను నియంత్రించాల్సిన అవసరం ఉందని అంటున్నారు. మల్లూరు గుట్టపైఉన్న గూడు సమాధుల్లో శవాల అవశేషాలు ఉంచేందుకు రాతి తొట్లను ఏర్పాటు చేసేవారని, కానీ ఈ ప్రాంతంలోని సమాధుల్లో అలాంటి తొట్లు కనిపించటం లేదన్నారు. గుట్ట దిగువన రాకాసిగుళ్లు (సమాధుల చుట్టూ గుండ్రటి రాళ్ల ఏర్పాటు) వేల సంఖ్యలో ఉన్నాయని, వ్యవసాయం వల్ల అవన్నీ కనుమరుగవుతున్నాయన్నారు.

రాములవారి గుట్ట పై అతిపెద్ద డాల్మన్‌ శిథిలాలు కనిపించాయి. 24 అడుగుల పొడవు, 6 అడుగుల వెడల్పున్న భారీ రాతి సల్ప మూడు ముక్కలై కనిపిస్తోంది. ఇది గూడు సమాధి పైభాగంలోని రాయి. క్వారీ పనుల్లో భాగంగా దీన్ని ధ్వంసం చేశారు. పైమూతగా వాడిన రాతి సల్ప అంతపెద్దగా ఉందంటే, ఆ సమాధి కూడా పెద్దగా ఉండి ఉండాలి. వాటిపై అధ్యయనం జరిపేందుకు విదేశీ నిపుణులు  ఆసక్తి కనబరుస్తున్నారు కానీ పురావస్తు శాఖ మాత్రం వీటిని గుర్తించకపోవటం, వాటి రక్షణకు ఎలాంటి చర్యలు తీసుకోకపోవటంతో అవి ధ్వంసమవుతున్నాయి. ఇదే ప్రాంతంలో ఆదిమానవులు రాతి ఆయుధాలను నూరేందుకు రాతి బండలపై ఏర్పాటు చేసుకున్న పొడవాటి గుంతలు (గ్రూవ్స్‌) కూడా ఉన్నాయి. ఇక కాకతీయుల కాలం నాటిదిగా భావిస్తున్న ఓ శాసనం, సమీపంలోని కానుగులవాగు ఒడ్డుపై దేవాలయ ఆనవాళ్లు, మెత్తటి శిలపై రెండు పాదాలు మాత్రమే కనిపిస్తున్న శిల్పం ఉంది. ఆ శిల్పం మిగతా భాగం భూమిలో కూరుకుపోయి ఉంది. అది వీరగల్లు శిల్పమన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.

మరిన్ని వార్తలు