ఆ చోరీ చేసింది నా కొడుకే.. ప్రాణహాని ఉంది

20 Jul, 2020 11:48 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : నగరంలో సంచలనం సృష్టించిన 100 కోట్ల రూపాయలు విలువ చేసే డాక్యుమెంట్ల చోరీలో కొత్త కోణం వెలుగులోకి వచ్చింది. చోరీకి పాల్పడినట్టు అనుమానిస్తున్న సుదీర్‌రెడ్డి తల్లి అజంతా మరో వివాదాన్ని తెరపైకి తీసువచ్చారు. చోరీకి గురైన డాక్యుమెంట్లు, రివాల్వర్లు అన్నీ తన అల్లుడు కోటారెడ్డివే అని, వాటిని తన కుమారుడు సుదీర్‌ రెడ్డినే దొంగలించాడని పోలీస్‌ స్టేషన్‌లో సోమవారం ఫిర్యాదు చేశారు. అంతేకాకుండా రూ.30 కోట్లు విలువ చేసే ఆస్తులను తన పేరు మీదకు మార్చేలా బెదిరింపులకు దిగుతున్నాడని, మాట వినకపోతే ఇంట్లో బందించి కుక్కలను వదిలి భయాందోళనకు గురిచేస్తున్నాడని ఫిర్యాదులో పేర్కొన్నారు. తండ్రిని కూడా విపరీతంగా వేధించేవాడని, ఆ చిత్రహింసలు తట్టుకోలేని తన భర్త చనిపోయాడని వాపోయారు. తన కుమారుడితో ప్రాణహాని ఉందని, రక్షణ కల్పించాలని కోరారు.


‘30 కోట్లు విలువ చేసే ఇళ్లను తన పేరు మీద రాయాలని రివాలర్వ్ తో తనని బెదిరిస్తున్నాడు. నాపైన రివాలర్వ్ ఎక్కు పెట్టి చంపుతాను అంటూ బెదిరింపులు దిగాడు. నా భర్త చనిపోక ముందే 30 కోట్లు ఇల్లు నా పేరు మీద రాశారు. ఆ ఇల్లు సుదీర్ రెడ్డికి ఇవ్వలేదని ఇంట్లో బంధించి కుక్కలను వదలి భయాందోళనకు గురి చేస్తున్నాడు. విదేశాల నుంచి అక్రమంగా ఆయుధాలు తీసుకొచ్చి ఇంట్లో భద్ర పరిచాడు. ఈ విషయం పై ఎన్నో సార్లు నిలదీసినా మాట వినట్లేదు. చిత్రహింసలు భరించలేక నా భర్త చనిపోయాడు. నా కుమారుడు నుంచి ప్రాణహాని ఉందని నాలుగు రోజులు క్రితమే డీజీపీ మహేందర్ రెడ్డికి ఫిర్యాదు చేశాను. నా పేరు మీద ఉన్న ఆస్తి మొత్తం రామకృష్ణ పరమహంస ఆశ్రమానికి రాశిస్తున్నా. ఇంట్లో ఇంకా 8 ఆయుధాలు ఉన్నాయి.’ అని ఫిర్యాదులో పేర్కొన్నారు. కాగా తన కార్యాలయంలోకి చొరబడి సుదీర్‌ రెడ్డి కీలక డాక్యుమెంట్లు చోరీ చేశాడని ఆదిత్యా హోం చైర్మన్‌ కోటారెడ్డి ఇప్పటికే ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. (​​​​​​​బంజారాహిల్స్లో భారీ చోరీ)


 

మరిన్ని వార్తలు