మలేరియాకు సరికొత్త విరుగుడు!

7 Jul, 2019 02:45 IST|Sakshi

వినూత్నమైన మందు కనుగొన్న హెచ్‌సీయూ పరిశోధన బృందం 

హైదరాబాద్‌: మలేరియా ఒకప్పుడు ప్రాణాంతక వ్యాధి.. అయితే ఇప్పుడు అన్ని రకాల మందులు అందుబాటులోకి వచ్చాయి. అయితే ఆ మందులు ఎక్కువగా వాడితే మలేరియా పరాన్నజీవులు నిరోధకతను పెంచుకుంటాయి. అందుకోసమే ఈ నిరోధకతను కూడా అడ్డుకునేందుకు హైదరాబాద్‌ సెంట్రల్‌ యూనివర్సిటీ పరిశోధకులు ప్రయోగాలు చేసి వినూత్నమైన మందును కనుగొన్నారు. మలేరియా వ్యాధికి కారణమైన ప్లాస్మోడియం వైవాక్స్‌ వంటి పరాన్నజీవుల్లోని డీఎన్‌ఏలో మెలికలు తిరిగి ఉన్న పోగులు (డీఎన్‌ఏ డబుల్‌ స్ట్రాండ్‌) విడిపోవడం వల్ల సాధారణంగా అవి మరణిస్తాయి. అయితే ఆ పోగులు విడిపోకుండా ఉండేందుకు ప్రాథమికంగా హోమోలాగస్‌ రీకాంబినేషన్‌ అనే ప్రక్రియ ద్వారా ఆ పోగుల మరమ్మతు చేసుకుంటాయి.

ఇక్కడ పీఎఫ్‌రాడ్‌ 51 అనే రీకాంబినేజ్‌ అనే ఎంజైమ్‌ను ఆ పరాన్నజీవి వాడుకుంటుంది. ఇక్కడే శాస్త్రవేత్తలు తమ దృష్టిని సారించారు. ఈ మరమ్మతు ప్రక్రియను అడ్డుకుంటే పరాన్నజీవుల జీవిత కాలం తగ్గుతుందని, మలేరియా కోసం వాడే మందుల నిరోధకత తగ్గుతుందని భావించారు. ఇందుకోసం బీవో2 అనే ఓ మందును కనిపెట్టారు. ఇది పీఎఫ్‌రాడ్‌ 51 ఎంజైమ్‌ పనిని సమర్థంగా అడ్డుకోగలిగిందని హెచ్‌సీయూ ప్రొఫెసర్‌ మృణాల్‌కంటి భట్టాచార్య వివరించారు.

అనేక మందులకు నిరోధకతను పెంచుకున్న ప్లాస్మోడియం జాతికి చెందిన డీడీ2, త్రీడీ7 అనే మరో ప్లాస్మోడియం జాతి పరాన్న జీవుల ఎదుగుదలను పరిశోధన కేంద్రంలోని సంవర్ధనంలో సమర్థంగా అడ్డుకుందని తెలిపారు. దీనికి సంబంధించిన వివరాలు జర్నల్‌ ఆఫ్‌ బయోలాజికల్‌ కెమిస్ట్రీ తాజా సంచికలో ప్రచురితమయ్యాయి. అయితే ఈ మందును తొలుత జంతువులపై ప్రయోగించి, వచ్చిన ఫలితాల ఆధారంగా మానవులపై ప్రయోగించనున్నారు. పరిశోధన బృందంలో ప్రతాప్‌ వైద్యమ్, దిబ్యేందు దత్తా, నిరంజన్‌ సంత్రమ్, ప్రొఫెసర్‌ సునందభట్టాచార్యలు కీలక పాత్ర పోషించారు.

మరిన్ని వార్తలు