మీకిదే మా భరోసా

14 Jul, 2018 09:12 IST|Sakshi
సైబర్‌ ల్యాబ్‌ను ప్రారంభిస్తున్న ఐజీ స్టిఫెన్‌ రవీంద్ర

వికారాబాద్‌ అర్బన్‌: గృహ హింస, అట్రాసిటీ, అత్యాచారం, లైంగిక దాడులకు గురవుతున్న మహిళలు, యువతులు, బాలికలకు అండగా నిలిచేందుకే భరోసా కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నామని షీటీం రాష్ట్ర ఇన్‌చార్జ్, ఐజీ స్వాతిలక్రా అన్నారు. వికారాబాద్‌లోని ఎస్పీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన నూతన సెంటర్‌ను ఐజీ స్టీఫెన్‌ రవీంద్ర, కలెక్టర్‌ సయ్యద్‌ ఉమర్‌ జలీల్, ఎస్పీ అన్నపూర్ణతో కలిసి శుక్రవారం ఆమె ప్రారంభించారు.

అనంతరం మాట్లాడుతూ.. ఎలాంటి సమస్యలు ఎదురైనా ధైర్యంగా ఎదుర్కోవాలని మహిళలు, యువతులకు పిలుపునిచ్చారు. భరోసా కేంద్రాలు బాధితులకు అండగా నిలుస్తాయని తెలిపారు. మహిళలపై, చిన్నారులపై రకరకాలుగా దాడులు జరుగుతున్నాయని, వీటితో కుంగిపోయిన వారికి కౌన్సెలింగ్‌ ఇచ్చి మనోధైర్యం నింపేందుకు ఇవి ఎంతగానో తోడ్పడుతాయని చెప్పారు. అత్యాచారాలకు గురైన మహిళలకు ఇక్కడే వైద్య పరీక్షలు నిర్వహించి, తగిన సహకారం అందిస్తారన్నారు.

అంతేకాకుండా నేరస్తులకు శిక్షపడే వరకు భరోసా కేంద్రం కృషి చేస్తుందని స్పష్టంచేశారు. ఇందుకోసం ఒక న్యాయ సలహాదారు అందుబాటులో ఉంటారని వివరించారు. న్యాయమూర్తి అనుమతితో కోర్టు కార్యకలాపాలు సైతం ఇక్కడి నుంచే నిర్వహిస్తామని, అవసరమైతే వీడియో రికార్డింగ్‌ చేసి న్యాయస్థానానికి సమర్పిస్తామని స్పష్టంచేశారు. చిన్నారుల హక్కుల పరిరక్షణకు హైదరాబాద్‌లో ప్రత్యేక కోర్టు ఉందని తెలిపారు.

ఉన్నత న్యాయస్థానం అనుమతితో త్వరలోనే వికారాబాద్‌లో చైల్డ్‌ కోర్టు ఏర్పాటయ్యేలా కృషి చేస్తున్నామని వెల్లడించారు. షీటీంలో భాగంగా కళాజాత బృందం గ్రామగ్రామానికి వెళ్లి పాటలతో ప్రజలను, యువతను చైతన్యం చేసే ప్రయత్నం చేస్తోందని తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా భరోసా కేంద్రాలను ఏర్పాటు చేసే కార్యక్రమం ప్రారంభమైందని, హైదరాబాద్‌లో మొదలైన ఈ కార్యక్రమం వికారాబాద్‌లో రెండో అడుగు వేసిందని ఆనందం వ్యక్తంచేశారు. త్వరలోనే రాష్ట్ర వ్యాప్తంగా ఈ సెంటర్లను ఏర్పాటు చేస్తామన్నారు. భరోసా కేంద్రం ఏర్పాటుకు పూర్తి స్థాయిలో సహకరించిన కలెక్టర్‌ జలీల్‌ను అభినందించారు.

సెంటర్‌ పని తీరుపై ఐజీల ఆరా... 

ఎస్పీ కార్యాలయంలోని భరోసా కేంద్రంలో పనిచేసే సిబ్బంది పనితీరుపై ఐజీలు స్వాతిలక్రా, రవీంద్ర ఆరా తీశారు. జిల్లా వ్యాప్తంగా ఇప్పటి వరకు 126 కేసులు రాగా.. కౌన్సెలింగ్‌ ద్వారా 45 కేసులను పరిష్కరించినట్లు ఎస్పీ అన్నపూర్ణ వారికి వివరించారు. 35 కేసులు ప్రస్తుతం కొనసాగుతున్నాయని, 21 కేసులు ఆయా పీఎస్‌లో ఉన్నాయని, 11 కేసులు కోర్టుల పరిధిలో ఉన్నాయని చెప్పారు. భరోసా సెంటర్‌లో అత్యాచార, గృహహింస, బాలికలపై లైంగిక దాడి, అట్రాసిటీ కేసుల విచారణ కోసం ఏర్పాటు చేసిన ప్రత్యేక గదులను అధికారులు పరిశీలించారు. సెంటర్‌ ఏర్పాటుకు కృషిచేసిన ఎస్పీని అభినందించారు.

సైబర్‌ ల్యాబ్‌ కమాండ్‌ కంట్రోల్‌ రూం ప్రారంభం... 

ఎస్పీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సైబర్‌ ల్యాబ్‌ కమాండ్‌ కంట్రోల్‌ రూంను ఐజీలు ప్రారంభించారు. ఈ సందర్భంగా నేరాల నియంత్రణకు తీసుకుంటున్న చర్యలను, సాంకేతిక వినియోగాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా సిబ్బందికి పలు సూచనలు ఇచ్చారు. కార్యక్రమంలో అడిషనల్‌ ఎస్పీ నర్సింలు, వికారాబాద్‌ డీఎస్పీ శిరీష, డీటీసీ డీఎస్పీ రవికుమార్‌ తదితరులు ఉన్నారు.  

సీసీ కెమెరాలు ప్రారంభం..

వికారాబాద్‌: వికారాబాద్‌ పట్టణ పోలీస్‌ స్టేషన్‌లో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలను ఐజీ స్టీఫెన్‌ రవీంద్ర శుక్రవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా స్టేషన్‌లో ఎంత మంది సిబ్బంది ఉన్నారని సీఐ వెంకట్రామయ్యను అడిగి  తెలసుకున్నారు. సీసీ కెమెరాల పని తీరును పరిశీలించారు. నేరాలను అదుపు చేయడంలో ఇవి ప్రధాన పాత్ర పోషిస్తాయని చెప్పారు. ఎస్పీ అన్నపూర్ణ, అడిష్‌నల్‌ ఎస్పీ నర్సింలు, డీఎస్పీ శిరీష, సీఐ వెంకట్రామయ్య, ఎస్‌ఐ సురేష్‌ తదితరులు పాల్గొన్నారు. 

మరిన్ని వార్తలు