‘సాగునీటి’కి మరో భారీ కార్పొరేషన్‌!

11 Mar, 2018 03:49 IST|Sakshi

తెలంగాణ వాటర్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ కార్పొరేషన్‌ పేరిట ఏర్పాటుకు సర్కారు నిర్ణయం

సాగునీటి పథకాలకు వేగంగా నిధుల సమీకరణే లక్ష్యం

దేవాదుల, తుపాకులగూడెం, సీతారామ, వరద కాల్వల ప్రాజెక్టులకు కలిపి..

సుమారు రూ.20 వేల కోట్ల రుణాలు తీసుకునేందుకు కార్యాచరణ

సాక్షి, హైదరాబాద్ ‌: రాష్ట్రంలో సాగునీటి ప్రాజెక్టులకు అవసరమైన నిధుల సేకరణ కోసం మరో భారీ కార్పొరేషన్‌ను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. దేవాదుల, తుపాకులగూడెం, సీతారామ, వరద కాల్వ ప్రాజెక్టులకు కలిపి సంయుక్తంగా ‘తెలంగాణ రాష్ట్ర వాటర్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ కార్పొరేషన్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ (టీఎస్‌డబ్ల్యూఐసీ)’పేరిట కార్పొరేషన్‌ ఏర్పాటుకు ప్రణాళికలు సిద్ధం చేసింది. రాష్ట్ర ప్రభుత్వం గోదావరి నదిని సద్వినియోగం చేసుకొనేలా చేపట్టిన ప్రాజెక్టులకు భారీగా నిధులు అవసరమవుతున్న విషయం తెలిసిందే.

దీంతో నిధుల సమీకరణ కోసం ప్రభుత్వం ప్రత్యేకంగా కార్పొరేషన్లను ఏర్పాటు చేస్తోంది. దీనివల్ల వివిధ రుణ సంస్థలు, బ్యాంకుల నుంచి అవసరమైన మేరకు రుణాలు తెచ్చుకునేందుకు వీలు కలుగుతుంది. ఇప్పటికే కాళేశ్వరం ప్రాజెక్టు కోసం ప్రత్యేకంగా కార్పొరేషన్‌ ఏర్పాటు చేయగా... తాజాగా మరో నాలుగు ప్రాజెక్టులకు కలిపి సంయుక్తంగా కార్పొరేషన్‌ ఏర్పాటుకు నీటి పారుదల శాఖ ప్రభుత్వానికి ప్రతిపాదనలు సమర్పించింది. బడ్జెట్‌ సమావేశాలకు ముందు జరిగే కేబినెట్‌ భేటీలో దీనికి ఆమోదం తెలిపే అవకాశమున్నట్లు ప్రభుత్వ వర్గాల ద్వారా తెలుస్తోంది.

ఇప్పటికే రూ.25 వేల కోట్లు
కాళేశ్వరం ఎత్తిపోతల పథకానికి నిధుల కోసం రాష్ట్ర ప్రభుత్వం ‘కాళేశ్వరం ఇరిగేషన్‌ ప్రాజెక్టు కార్పొరేషన్‌ (కేఐపీసీ)’ను ఏర్పాటు చేసింది. ఆ కార్పొరేషన్‌ ద్వారా మూడు విడతల్లో రుణ సమీకరణ చేసింది. ఆంధ్రాబ్యాంకు, విజయా బ్యాంకు, పంజాబ్‌ నేషనల్‌ బ్యాంకుల ద్వారా మొత్తంగా రూ.24,780 కోట్ల రుణాలకు ఒప్పందాలు కుదరగా.. ఇప్పటికే రూ.6,299 కోట్ల మేర ఖర్చు చేశారు కూడా. తాజాగా దేవాదుల, తుపాకులగూడెం, సీతారామ, వరద కాల్వ ప్రాజెక్టులను కూడా శరవేగంగా పూర్తి చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది.

ప్రాజెక్టుల వ్యయాలు పెరగడంతో..
6.21 లక్షల ఎకరాల ఆయకట్టుకు నీరివ్వాలనే లక్ష్యంతో రూ.9,423 కోట్లతో దేవాదుల ప్రాజెక్టును చేపట్టారు. అయితే ప్రాజెక్టుకు నీటి కేటాయింపులు పెంచడంతో.. అంచనా వ్యయం రూ. 13,445.44 కోట్లకు పెరిగింది. ఇప్పటివరకు రూ.8,800 కోట్ల వరకు ఖర్చు చేయగా.. మరో రూ.4,700 కోట్ల మేర నిధులు అవసరం కానున్నాయి. దీనికితోడు ఇటీవలే ప్రాజెక్టు పరిధిలో అదనపు నీటి నిల్వ కోసం కొత్త రిజర్వాయర్‌ను ప్రతిపాదించారు.

10.78 టీఎంసీల సామర్థ్యంతో రూ.3,300 కోట్లతో వరంగల్‌ జిల్లా ఘణపూర్‌ మండలం లింగంపల్లి వద్ద దాన్ని నిర్మించేలా ప్రణాళికలు సిద్ధమయ్యాయి. అంటే దేవాదుల పూర్తికే రూ.8 వేల కోట్ల వరకు అవసరం కానున్నాయి. ఇక దేవాదుల దిగువన తుపాకులగూడెం బ్యారేజీని రూ.2,121 కోట్లతో చేపట్టగా.. మరో రూ.1,900 కోట్లు అవసరం. ఈ రెండు ప్రాజెక్టులకు రూ.10 వేల కోట్ల మేర అవసరంకాగా.. రూ.5 వేల కోట్ల నుంచి రూ.7 వేల కోట్ల వరకు సమీకరించాలని ప్రభుత్వం భావిస్తోంది.

రీ-ఇంజనీరింగ్‌తో..
ఉమ్మడి ఖమ్మం జిల్లా సాగునీటి అవసరాలను తీర్చే సీతారామ ఎత్తిపోతల పథకాన్ని రీఇంజనీరింగ్‌ చేయడంతో.. అంచనా వ్యయం రూ.7,926 కోట్ల నుంచి రూ.13,384 కోట్లకు పెరుగుతోంది. ప్రస్తుతం ప్రాజెక్టు పరిధిలో రూ.220 కోట్ల విలువైన పనులు మాత్రమే పూర్తయ్యాయి. వచ్చే రెండేళ్లలో కనీసం రూ.7 వేల కోట్ల మేర పనులు పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. అంటే ఈ ప్రాజెక్టుకు ఏటా రూ.3,500 కోట్లు అవసరం.

దీంతో ఈ ప్రాజెక్టునూ కార్పొరేషన్‌ పరిధిలోకి తెచ్చి.. రూ.8 వేల కోట్ల మేర రుణం తీసుకోవాలని ప్రభుత్వం భావిస్తోంది. ఇక వరద కాల్వ పనులను రూ.9,886 కోట్ల అంచనాతో చేపట్టగా.. ఇప్పటివరకు రూ.5,323 కోట్లు ఖర్చు చేశారు. మరో రూ.4,500 కోట్లు అవసరం కావడంతో దీన్ని కూడా కార్పొరేషన్‌ పరిధిలోకి చేర్చారు. మొత్తంగా నాలుగు ప్రాజెక్టులకు కలిపి రూ.20 వేల కోట్ల వరకు రుణాలను తీసుకోనున్నారు.

మరిన్ని వార్తలు