గ్రేటర్‌ క్యాబ్‌ సిటీ!

6 Sep, 2019 10:45 IST|Sakshi

విస్తరిస్తున్న ట్యాక్సీ సర్వీసులు  

ఓలా, ఉబర్‌కు దీటుగా మరిన్ని యాప్‌లు

ఇటీవల రోడ్డెక్కిన టోరా, ఒఫు క్యాబ్‌లు

త్వరలో ప్రైడో క్యాబ్‌ కూడా..

ప్రయాణికులకు అనుకూలంగా స్థిరమైన చార్జీలు

సాక్షి,సిటీబ్యూరో: గ్రేటర్‌ హైదరాబాద్‌ క్యాబ్‌ సిటీగా మారుతోంది. సిటీజనులు తమ రోజువారీ పనులకు, కార్యాలయాలకు వెళ్లేందుకు క్యాబ్స్‌ను ఆశ్రయిస్తుండడంతో ఈ రంగంలో సరికొత్త సర్వీసులు వచ్చిచేరుతున్నాయి. ఇంటి నుంచి బయటకు వచ్చి ఒక్క మొబైల్‌ క్లిక్‌తో అద్దెకారును పొందే అవకాశాలు సిటీలో వెల్లువెత్తుతున్నాయి. దీంతో క్యాబ్‌లకు డిమాండ్‌ అనూహ్యంగా పెరుగుతోంది. ప్రస్తుతం అందుబాటులో ఉన్న ఓలా, ఉబర్‌కు దీటుగా సరికొత్త క్యాబ్‌ సర్వీసులు నగర రహదారులపై దూసుకొస్తున్నాయి. ఇప్పటికే కొన్ని కొత్త క్యాబ్‌లు రోడ్డెక్కాయి. మరిన్ని త్వరలో అందుబాటులోకి రానున్నాయి. ప్రస్తుతం ఉన్న పోటీ ప్రపంచంలో వినియోగదారులను ఆకట్టుకునేందుకు రకరకాల సదుపాయాలు కల్పిస్తున్నాయి. మరోవైపు డ్రైవర్లకు సైతం సముచితమైన కమీషన్లు ప్రకటిస్తున్నాయి. ప్రయాణికులు కేవలం ఒకటి, రెండు క్యాబ్‌ అగ్రిగేటర్లపైనే ఆధారపడాల్సిన అవసరం లేకుండా మరిన్ని సంస్థల సేవలను వినియోగించుకొనే అవకాశంలభించింది. అదే సమయంలో ఓలా, ఉబర్‌ వంటి అంతర్జాతీయ సంస్థలకు పోటీగా స్థానిక క్యాబ్‌ అగ్రిగేటర్లు రావడం గమనార్హం. కొత్తగా అందుబాటులోకి వస్తున్న క్యాబ్‌ల వల్ల ప్రయాణికులకు స్థిరమైన చార్జీల్లో రవాణా సదుపాయం లభించనుంది. ఇప్పటికే ఆ దిశగా కొత్త క్యాబ్‌ సంస్థలు స్పష్టమైన హామీలతో ముందుకొచ్చాయి. 

రోడెక్కిన కొత్త క్యాబ్స్‌  
మెట్రో రైలు సదుపాయం అందుబాటులోకి వచ్చినప్పటికీ  క్యాబ్‌లకు ఆదరరణ మాత్రం తగ్గలేదు. సామాన్యుల నుంచి సాఫ్ట్‌వేర్‌ వర్గాల వరకు ఏ అవసరానికైనా క్యాబ్‌పైనే ఆధారపడుతున్నారు. గ్రేటర్‌లో సుమారు లక్షకు పైగా కార్లు క్యాబ్‌ అగ్రిగేటర్లతో అనుసంధానమై ఉన్నాయి. ఓలా స్వయంగా లీజు వాహనాలను నడుపుతోంది. శంషాబాద్‌ అంతర్జాతీయ విమానాశ్రయానికే ప్రతి రోజు 10 వేలకు పైగా సర్వీసులు రాకపోకలు సాగిస్తున్నాయి. ఇక సిటీలో ఎక్కడి నుంచి ఎక్కడికైనా వెళ్లేందుకు క్యాబ్‌ అందుబాటులో ఉంది. ప్రయాణికులలో ఉన్న ఈ డిమాండ్‌ను దృష్టిలో ఉంచుకొని కొత్త సంస్థలు ముందుకొస్తున్నాయి. రకరకాల ప్యాకేజీలతో ప్రయాణికులను, డ్రైవర్లను ఆకట్టుకుంటున్నాయి. మొబైల్‌ ఫోన్‌లో తమ యాప్‌ డౌన్‌లోడ్‌ చేసుకొని ఒకసారి క్లిక్‌ చేస్తే చాలు క్షణాల్లో వచివాలిపోతామని.. ‘పీక్‌ అవర్స్‌’ చార్జీలు అంటూ ప్రత్యేంగా లేవంటూ ఆకర్షిస్తున్నాయి. ‘ఫిక్స్‌డ్‌’  చార్జీలతో ‘ఒఫు’ క్యాబ్స్‌ ఇప్పటికే రోడ్డెక్కాయి. ఎలాంటి సర్‌చార్జీలు, కమిషన్లు లేని సేవలతో ‘టోరా’ క్యాబ్‌లు వచ్చేశాయి. ఇలాంటి ప్యాకేజీలతోనే ‘ప్రైడ్‌ క్యాబ్స్‌’ త్వరలో అందుబాటులోకి రానున్నాయి.  

టోరా ఇలా..
ప్రస్తుతం రద్దీ అధికంగా ఉండే సమయంలో కొన్ని ఆగ్రిగేటర్లు చార్జీలు విపరీతంగా పెరుగుతున్నాయి. ప్రయాణికులపై అదనపు భారాన్ని మోపుతూ సర్‌ చార్జీలు వసూలు చేస్తున్నారు. మరోవైపు డ్రైవర్లకు సరైన కమిషన్లు, ప్రోత్సాహకాలు లభించడం లేదని.. పనిగంటలతో నిమిత్తం లేని టార్గెట్లతో డ్రైవర్ల మధ్య అనారోగ్యకరమైన పోటీని పెంచుతున్నారనే అభిప్రాయం కూడా ఉంది. దీనిని దృష్టిలో ఉంచుకొని ‘నో సర్‌చార్జీ–నో కమీషన్‌’ నినాదంతో  వచ్చింది ‘టోరా’. ప్రయాణికులు సర్‌చార్జీ చెల్లించాల్సిన అవసరం లేదు. అదే సమయంలో డ్రైవర్లు ఎలాంటి కమీషన్‌ కూడా చెల్లించాల్సిన పనిలేదు. టోరా యాప్‌ను వినియోగించుకున్నందుకు డ్రైవర్లు రోజుకు రూ.199 చొప్పున యూజర్‌ చార్జీలు మాత్రమే చెల్లిస్తే చాలునని  సంస్థ మార్కెటింగ్‌ డైరెక్టర్‌ కవితా భాస్కరన్‌ తెలిపారు. గత వారం రోజుల్లో సుమారు 50 వేల మందికి పైగా ప్రయాణికులు తమ సేవలను వినియోగించుకున్నట్లు కవితా భాస్కరన్‌ వివరించారు. 

ఫిక్స్‌డ్‌ చార్జీలతో ‘ఒఫు’
హైదరాబాద్‌ కేంద్రంగా ఇటీవల రోడ్డెక్కిన మరో క్యాబ్‌ సర్వీసు ‘ఒఫు’. ఒఫు అంటే ఆఫ్రికాలోని ఎగ్బో భాషలో ‘స్థిరమైన’ అని అర్థం. ఆ పదాన్ని స్ఫూర్తిగా తీసుకొని ఈ క్యాబ్స్‌ను ప్రారంభించినట్లు చెప్పారు ఆ సంస్థ వ్యవస్థాపకులు అరుణ్‌కుమార్‌. ప్రస్తుతం ఉదయం, సాయంత్రం రద్దీ అధికంగా ఉండే వేళల్లో, వర్షం కురిసినప్పుడు క్యాబ్‌ చార్జీలు అమాంతంగా పెరిగిపోతున్నాయి. సాధారణ వేళల్లో 10 కిలోమీటర్ల దూరానికి రూ.200 ఉంటే రద్దీ ఎక్కువగా ఉండే సమయంలో అది రూ.300 దాటిపోతోంది. దీనిని దృష్టిలో ఉంచుకొని ప్రయాణికులకు కిలోమీటర్‌కు రూ.19 చొప్పున 24 గంటల పాటు స్థిరమైన చార్జీలతో రవాణా సదుపాయాన్ని అందజేస్తారు. అలాగే డ్రైవర్లకు కిలోమీటర్‌కు రూ.15 చొప్పున చెల్లిస్తారు. 

29న ‘ప్రైడో’ క్యాబ్స్‌ ఆగమనం  
ప్రయాణికులపైన ఎలాంటి అదనపు భారం మోపకుండా, అదే సమయంలో డ్రైవర్లపై కమీషన్ల భారాన్ని తగ్గిస్తూ సిటీలో మెరుగైన రవాణా సదుపాయాన్ని అందజేసే లక్ష్యంతో ‘ప్రైడో క్యాబ్స్‌’ దూసుకొస్తోంది. తమ సర్వీసులను ఈ నెల 29న ప్రారంభించనున్నట్లు ప్రైడో వ్యవస్థాపకులు నరేంద్రకుమార్‌ తెలిపారు. ఈ సంస్థలో మహిళా డ్రైవర్లకు  భాగస్వామ్యం కల్పించనున్నారు. డ్రైవర్లు తమ ఆదాయాన్ని పెంచుకొన్న కొద్దీ ప్రైడోకు చెల్లించవలసిన కమీషన్‌ తగ్గడం గమనార్హం. ఉదాహరణకు నెలకు రూ.50 వేలు సంపాదించే డ్రైవర్‌ 10 శాతం చొప్పున కమీషన్‌ చెల్లిస్తే, రూ.70 వేలు సంపాదించే వారు కేవలం 4 శాతం చెల్లిస్తే సరిపోతుంది. అస్థిరమైన చార్జీలతో ప్రయాణికులను బెంబేలెత్తించకుండా తక్కువ చార్జీలతో ఎక్కువ రవాణా  సదుపాయం కల్పిస్తారు. ‘ప్రయాణికులకు, డ్రైవర్‌ భాగస్వాములకు, మా సంస్థకు ప్రయోజనం ఉండే విధంగా ప్యాకేజీలను సిద్ధం చేస్తున్నాం. మా సేవలు పూర్తి పారదర్శకంగా ఉంటాయి’ అని ఆయన వివరించారు. 

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా