విభజన రేఖ

10 Oct, 2017 15:09 IST|Sakshi

కొత్త కలెక్టరేట్‌ విషయంపై అధికార పార్టీ నాయకులు రెండుగా విడిపోయారు. మరో 48 గంటల్లో నూతన కలెక్టరేట్‌కు శంకుస్థాపన చేయాలని ప్రభుత్వం నిర్ణయించిన తరుణంలో గులాబీ ప్రజాప్రతినిధుల మధ్య విభజన ఏర్పడడం చర్చనీయాంశమైంది. కొంగరకలాన్‌ వైపు కొందరు, రావిర్యాల వైపు మరికొందరు మొగ్గుచూపడంతో ప్రతిష్టంభన ఏర్పడింది. కలెక్టరేట్‌ స్థలం విషయమై నాయకులు మంగళవారం సీఎంను కలవనున్నారు.

సాక్షి, రంగారెడ్డి జిల్లా ప్రతినిధి: నూతన కలెక్టరేట్‌ నిర్మాణం కోసం ఇబ్రహీంపట్నం మండలం కొంగరకలాన్, మహేశ్వరం మండలం రావిర్యాలలోని రెండు స్థలాలతో కూడిన తుది జాబితాను జిల్లా యంత్రాంగం ప్రభుత్వానికి సమర్పించింది. వీటిని పరిశీలించిన ప్రభుత్వం కొంగరకలాన్‌లో గతంలో రైస్‌హబ్‌కు కేటాయించిన 300 సర్వే నంబర్‌లోని 40 ఎకరాలను కలెక్టర్‌ కార్యాలయ భవన సముదాయానికి  కేటాయించాలని సూత్రప్రాయంగా నిర్ణయించింది. అయితే ఈ నిర్ణయాన్ని మొదట్నుంచి వ్యతిరేకిస్తున్న రాజేంద్రనగర్, షాద్‌నగర్, చేవెళ్ల, శేరిలింగంపల్లి ఎమ్మెల్యేలు ప్రకాశ్‌గౌడ్, అంజయ్యయాదవ్, కాలె యాదయ్య, అరికెపూడి గాంధీ, ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డి కొంగరలో కలెక్టరేట్‌ను నిర్మించాలనే నిర్ణయంపై పునరాలోచన చేయాలని కోరుతూ ముఖ్యమంత్రి కేసీఆర్‌ను కలవాలని నిర్ణయించుకున్నారు. ఈ క్రమంలోనే మంగళవారం సీఎం అపాయింట్‌మెంట్‌ కోరారు.

రాజేంద్రనగర్‌ నియోజకవర్గం అన్ని ప్రాంతాలకు అనువుగా ఉంటుందని, ఈ విషయాన్ని పరిగణనలోకి తీసుకోకుండా ఔటర్‌ రింగ్‌రోడ్డుకు రెండు కిలోమీటర్ల దూరంలో కలెక్టరేట్‌ను నిర్మించడం వల్ల పరిపాలనాపరంగా మంచిదికాదనే వాదనను సీఎం దగ్గర వినిపిస్తామని ఓ ఎమ్మెల్యే ‘సాక్షి’కి తెలిపారు. కాగా, జిల్లా మంత్రి మహేందర్‌రెడ్డి ప్రస్తుతం ఢిల్లీ పర్యటనలో ఉన్నందున.. కలెక్టరేట్‌ అంశంపై కలిసి వస్తారా? ప్రభుత్వ నిర్ణయానికి తల ఊపుతారా అనే అంశంపై ఉత్కంఠ నెలకొంది. కాగా, ప్రజాప్రతినిధుల బృందానికి తాను నాయకత్వం వహిస్తున్నట్లు వస్తున్న ప్రచారం సరికాదని ఎంపీ విశ్వేశ్వర్‌రెడ్డి స్పష్టం చేశారు. కలెక్టరేట్‌ అంశంపై చర్చించిన మాట వాస్తవమే అయినా సీఎం అపాయింట్‌మెంట్‌ విషయం తనకు తెలియదని, ఇంతకంటే తానేమీ మాట్లాడనని నర్మగర్భంగా వ్యాఖ్యానించారు.

సీఎం ఇష్టంతోనే...
కొత్త జిల్లాలు పురుడుపోసుకొని బుధవారం నాటికి ఏడాది పూర్తవుతుంది. ఈ నేపథ్యంలోనే ప్రస్తుతం లక్డీకాపూల్‌లో కొనసాగుతున్న కలెక్టరేట్‌ను పునర్విభజనకు అనుగుణంగా భౌగోళికంగా జిల్లాలోనే నిర్మించాలని ప్రభుత్వం గతేడాది నిర్ణయించింది. అందుకనుగుణంగా పలు చోట్ల స్థలాలను పరిశీలించినప్పటికీ ఏ ఒక్కదానిపైనా జిల్లా ప్రజాప్రతినిధుల నుంచి ఏకాభిప్రాయం కుదరలేదు. దీంతో స్థల ఖరారు అంశం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి అప్పగించారు. ఆయన కూడా కొన్ని స్థలాలను పరిశీలించి ప్రభుత్వానికి నివేదిక ఇచ్చారు. వీటిపైనా భిన్నాభిప్రాయాలు వ్యక్తం కావడంతో స్థల ఖరారు వ్యవహారం ముఖ్యమంత్రికే వదిలేశారు. అధికారయంత్రాంగం చాంతాడంత జాబితా సమర్పించినా ముఖ్యమంత్రి మాత్రం వీటిని పట్టించుకోలేదు. అధికారులు నివేదించిన జాబితా కాకుండా రైస్‌హబ్‌ స్థలానికి ప్రాధాన్యం ఇచ్చారు. వాస్తవానికి ఈ స్థలం పరిశీలనకు కూడా నోచుకోలేదు. రింగ్‌రోడ్డుకు 2 కిలోమీటర్ల దూరంలో ఉండడం, రవాణాపరంగా ఇబ్బంది ఉన్న దృష్ట్యా స్థలాన్ని పరిగణనలోకి తీసుకోలేదు.

 అయితే, అంతర్గత సంభాషణల్లో ముఖ్యమంత్రి కేసీఆర్‌... కొంగరలోని రైస్‌హబ్‌లో కలెక్టరేట్‌ ఏర్పాటు చేస్తే బాగుంటుందని అంతరంగాన్ని వెల్లడించారు. అంతేగాకుండా గూగుల్‌లో స్థలాన్ని కూడా వీక్షించారు. దీంతో ముఖ్యమంత్రి మనోగతానికి అనుగుణంగా వ్యవహరించడం మంచిదని భావించిన యంత్రాంగం.. గతంలో రైస్‌మిల్లర్ల కోసం కేటాయించిన 300 ఎకరాల్లో 40 ఎకరాలను కలెక్టరేట్‌ నిర్మాణానికి ఇవ్వాలని నిర్ణయించింది. దీంతోపాటు రింగ్‌రోడ్డు సమీపాన ఉన్న రావిర్యాల సర్వే నం.18 స్థలాన్ని కూడా ప్రభుత్వానికి నివేదించింది. అయితే, ఈ రెండింట్లో రైస్‌హబ్‌ స్థలానికే మొగ్గు కనిపిస్తున్నా... సగం మంది ఎమ్మెల్యేలు దీన్ని వ్యతిరేకిస్తున్నందున అనూహ్య పరిణామాలు చోటుచేసుకుంటే స్థలం మారే అవకాశంలేకపోలేదు. ముహూర్తం దగ్గరపడుతున్నా స్థలాన్ని ఖరారు చేయకపోవడంతో ఆర్‌అండ్‌బీ అధికారులకు టెన్షన్‌ పట్టుకుంది. శిలాఫలకంపై ఎవరి పేర్లను ముద్రించాలో.. ఏ నియోజకవర్గ పరిధిలో వస్తుందో తెలియక జుట్టుపీక్కుంటున్నారు.

మరిన్ని వార్తలు