యువహో

4 Feb, 2020 07:03 IST|Sakshi
హైదరాబాద్‌ జిల్లా నూతన కలెక్టర్‌గా శ్వేతా మహంతి

జీహెచ్‌ఎంసీకి కొత్త ఐఏఎస్‌లు

గ్రేటర్‌ పాలనపై ప్రభావం చూపేనా!

కొత్తగా నలుగురు అధికారులు   

నగరం నుంచి ఆరుగురి బదిలీ  

ఏడాదిలో జీహెచ్‌ఎంసీ ఎన్నికలు

కీలక పాత్ర పోషించనున్న అధికారులు

సాక్షి, సిటీబ్యూరో: గ్రేటర్‌ పరిపాలనలో యువ ముద్రపడనుంది. కొత్త ఉత్సాహం ఉరకలెత్తనుంది. కొత్త రక్తంతోప్రగతికి బాటలు పరుచుకోనున్నాయి. ఐఏఎస్‌ల బదిలీల్లోభాగంగా జీహెచ్‌ఎంసీ నుంచి ఆరుగురు బదిలీ కాగా, వీరిస్థానంలో నలుగురు వస్తున్నారు. వీరిలో ఒకరు ఇప్పటికే బాధ్యతలు చేపట్టారు. ఏడాది కాలంలో జీహెచ్‌ఎంసీ ఎన్నికలు జరగనుండగా.. ఆరుగురు ఐఏఎస్‌లను ప్రభుత్వం జిల్లాలకు బదిలీ చేసింది. జిల్లాల నుంచి నలుగురిని జీహెచ్‌ఎంసీలో నియమించింది. జీహెచ్‌ఎంసీలో మూడేళ్లు దాటిన ఐఏఎస్‌ల బదిలీ జరగనుందని దాదాపు ఎనిమిది నెలల నుంచే ప్రచారంలో ఉన్నా.. ఇప్పటి వరకు జరగలేదు. బదిలీల్లో మూడేళ్లు దాటిన వారితో పాటు దాదాపు ఏడాది క్రితం చేరిన వారు సైతం ఉన్నారు. అడిషనల్, జోనల్‌ కమిషనర్లుగా ఉన్న ఐఏఎస్‌లందరూ బదిలీ అయ్యారు. 

అనుకూలంగా ఉంటుందనే..
కొత్తగా వస్తున్న వారంతా యువ ఐఏఎస్‌లే. వీరంతా 2015, 2016 బ్యాచ్‌లకు చెందినవారు కాగా.. 2017, 2018 నుంచి మాత్రమే ఆయా జిల్లాల్లో సబ్‌ కలెక్టర్, స్పెషలాఫీసర్లుగా పనిచేశారు. బహుశా కమిషనర్‌ లోకేష్‌కుమార్‌కు అనుకూలంగా ఉంటుందనే తలంపుతో ప్రభుత్వం వీరిని ఇక్కడకు బదిలీ చేసినట్లు భావిస్తున్నారు. జూనియర్లయిన వీరు జీహెచ్‌ఎంసీ లాంటి కార్పొరేషన్‌ను.. అందులోని వివిధ విభాగాలను, పనితీరును అర్థం చేసుకునేందుకే ఎంతో సమయం పట్టనుంది. దాదాపు ఏడాదిలో ఎన్నికలు జరగనుండగా.. పదినెలల్లో ‘అభివృద్ధి’ క్లోజప్‌లో కనిపించాలనేది ప్రభుత్వ లక్ష్యంగా ఉంది. ఈ నేపథ్యంలో ఎన్నికల గడువులోగా వీరు తమదైన శైలిలో పనితీరును చూపించాల్సి ఉంది. కొత్తగా మరికొందరు వచ్చినా జీహెచ్‌ఎంసీ అధికారుల్లో ‘ఎలక్షన్‌ టీమ్‌’లో వీరు తగిన భూమిక వహించనున్నారు. ముఖ్యంగా ప్రజా సదుపాయాలను మెరుగుపరచాలని మున్సిపల్‌ మంత్రి కేటీఆర్‌ భావిస్తున్నారు. అందుకనుగుణంగా ఇప్పటికే జీహెచ్‌ఎంసీ అధికారులతో తరచూ సమీక్షలు నిర్వహిస్తున్నారు. కాలిబాటలు, రహదారులు, పబ్లిక్‌టాయ్‌లెట్లు, పార్కుల వంటివాటిపై ప్రత్యేక శ్రద్ధ వహిస్తున్నారు. వీటన్నింటినీ త్వరితంగా పూర్తిచేయించే బాధ్యత.. వారికప్పగించే విభాగాలనుబట్టి కొత్త ఐఏఎస్‌లపై ఉండనుంది. 

మేడ్చల్‌ జిల్లా కొత్త కలెక్టర్‌గా వెంకటేశ్వర్లు సోమవారం బాధ్యతలు స్వీకరించారు.
జోన్లకా.. ప్రధాన కార్యాలయానికా?
నలుగురినీ అడిషనల్‌ కమిషనర్లుగా బదిలీ చేసినప్పటికీ.. ప్రధాన కార్యాలయంలో అడిషనల్‌ కమిషనర్లుగా కానీ, జోన్లలో జోనల్‌ కమిషనర్లుగా కానీ వీరి సేవలను వినియోగించుకోవడంలో కమిషనర్‌దే నిర్ణయం. జోన్లలో అయితే ప్రజా సదుపాయాల కల్పన పనుల్ని పరుగులు తీయించడంతో పాటు రాజకీయ పార్టీలు,  స్థానిక ప్రజాప్రతినిధులు, ప్రజలతోనూ సామరస్యంగా, సత్సంబంధాలు కలిగి ఉండటం అవసరం. ప్రధాన కార్యాలయంలోనైతే ఆయా విభాగాలపరంగా జరిగే పనుల్ని  ప్రజలకందాల్సిన సేవల్ని వేగిరంగా పూర్తిచేయాల్సి ఉంటుంది. వీరి పనితీరు ఎన్నికల్లో తగిన ప్రభావం చూపనుంది కనుక వీరికి జీహెచ్‌ఎంసీ కొలువు సవాలే. 

ప్రసాదరావు సిఫార్సుల మేరకు..
ప్రసాదరావు కమిటీ సిఫార్సులు, స్టాఫింగ్‌ ప్యాటర్న్‌ మేరకు జీహెచ్‌ఎంసీ సర్కిళ్లను 18 నుంచి 30కి, జోన్లను ఐదు నుంచి  ఆరుకు పెంచారు. గతంలో జీహెచ్‌ఎంసీలో 11 మంది అడిషనల్‌ కమిషనర్లు ఉండేవారు. అంతమంది అవసరం లేదని ఆరుగురు అడిషనల్‌ కమిషనర్లు చాలని సిఫార్సుల్లో పేర్కొన్నారు. బదిలీ అయినవారిని మినహాయించి జీహెచ్‌ఎంసీలో ప్రస్తుతం ఆరుగురు అడిషనల్‌ కమిషనర్లున్నారు. కొత్తగా వస్తున్నవారికి అడిషనల్‌ కమిషనర్ల పోస్టులే ఇస్తే ఈ సంఖ్య పదికి పెరుగుతుంది. గతంలో ఐదు జోన్లున్నప్పుడు ఖైరతాబాద్‌ జోన్‌లో మాత్రం ఐఏఎస్‌ అధికారి జోనల్‌ కమిషనర్‌గా ఉండేవారు. మిగతాజోన్లలో నాన్‌ ఐఏఎస్‌లు జోనల్‌ కమిషనర్లుగా ఉండేవారు. ప్రస్తుతం ఇక్కడి నుంచి బదిలీ అయిన హరిచందన, ముషారఫ్‌ అలీ ఫారూఖి అటు జోనల్‌ కమిషనర్లుగా పనిచేయడంతో పాటు కొన్ని విభాగాల అడిషనల్‌ కమిషనర్లుగానూ అదనపు బాధ్యతలు నిర్వహించారు. ఇటీవలే ఎల్‌బీనగర్‌ జోనల్‌ కమిషనర్‌గా బదిలీ అయిన సిక్తా పట్నాయక్‌ సైతం యూసీడీ, ఐటీ విభాగాల అడిషనల్‌ కమిషనర్‌గానూ అదనపు బాధ్యతలు నిర్వహించారు.   

డాక్టర్‌.. ఇంజినీర్లు
జీహెచ్‌ఎంసీకి బదిలీ అయిన నలుగురిలో చదువు రీత్యా ఒకరు డాక్టర్‌ కాగా, ముగ్గురు ఇంజినీర్లు. వీరు ఏమేరకు జీహెచ్‌ఎంసీకి తగిన చికిత్స, ఇంజినీరింగ్‌ చేస్తారో వేచి చూడాల్సిందే. 

ఎవరు.. ఎక్కడి నుంచి
రాహుల్‌ రాజ్‌: సబ్‌కలెక్టర్,  బెల్లంపల్లి  
కొత్తగా జీహెచ్‌ఎంసీకి బదిలీ అయిన వారిలో రాహుల్‌రాజ్‌ 2015 బ్యాచ్‌కు చెందినవారు కాగా, కొద్దికాలం కేంద్రంలో వైద్య, కుటుంబ సంక్షేమశాఖలో పనిచేశారు. హైదరాబాద్‌ జేఎన్‌టీయూ నుంచి ఇంజినీరింగ్‌ చేసిన ఆయన నిజామాబాద్‌ అసిస్టెంట్‌ కలెక్టర్‌గా కొద్దికాలం పనిచేశారు. ప్రస్తుతం బెల్లంపల్లి సబ్‌కలెక్టర్‌గా ఉన్న ఆయన జీహెచ్‌ఎంసీకి బదిలీ అయ్యారు. 

బి.సంతోష్‌:  స్పెషలాఫీసర్, వరంగల్‌ రూరల్‌
2016 బ్యాచ్‌కు చెందిన సంతోష్‌ వరంగల్‌ ఎన్‌ఐటీ నుంచి ఎలక్ట్రానిక్స్‌ అండ్‌ కమ్యూనికేషన్స్‌లో బీటెక్‌ చేశారు. ప్రస్తుతం వరంగల్‌ రూరల్‌ జిల్లాలో స్పెషలాఫీసర్‌గా ఉంటూ జీహెచ్‌ఎంసీకి బదిలీ అయిన ఈయన సోమవారం జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ లోకేశ్‌కుమార్‌కు జాయినింగ్‌ రిపోర్ట్‌ ఇచ్చారు. 

ప్రియాంక ఆల: స్పెషలాఫీసర్,యాదాద్రి భువనగరి
మహారాష్ట్ర హెల్త్‌సైన్సెస్‌ యూనివర్సిటీ నుంచి ఎంబీబీఎస్‌ చేసిన ప్రియాంక కార్పొరేట్‌ అఫైర్స్‌ మంత్రిత్వశాఖలో కొద్దికాలం ఉన్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా స్పెషలాఫీసర్‌గా ఉన్న ఆమెను ప్రభుత్వం జీహెచ్‌ఎంసీకి బదిలీ చేసింది.

పి.ప్రావీణ్య: స్పెషలాఫీసర్, కరీంనగర్‌
బిట్స్‌ పిలానీలో బీఈ (మెకానికల్‌) చేసిన ఈమె కేంద్రంలో ఫైనాన్స్, ఎకనామిక్‌ అఫైర్స్‌ విభాగంలో  కొద్దికాలం పనిచేశారు. కరీంనగర్‌ స్పెషలాఫీసర్‌గా ఉంటూ జీహెచ్‌ఎంసీకి బదిలీ అయ్యారు.  
వీరిలో  ప్రావీణ్య కర్ణాటకకు చెందిన వారు కాగా, మిగతా ముగ్గురు తెలంగాణకు చెందిన వారే కావడం విశేషం.

బదిలీ అయిన వారు..
హరిచందన దాసరి: శేరిలింగంపల్లి జోనల్‌ కమిషనర్‌గా, లేక్స్, జీవవైవిధ్య విభాగాల అడిషనల్‌ కమిషనర్‌గా పనిచేశారు. కొత్త ఆలోచనలు, సృజనాత్మకతతో పలు కొత్త కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. ఫీడ్‌ ది నీడ్, డాగ్‌ పార్క్, ఫుడ్‌హబ్‌ వంటివి ఏర్పాటు చేయడం ద్వారా మంచిపేరు తెచ్చుకున్నారు. దుర్గంచెరువు సుందరీకరణపై శ్రద్ధ చూపారు. సీఎస్సార్‌ ద్వారా పలు పనులు చేపట్టారు. ప్లాస్టిక్‌ ఫుట్‌ఫాత్‌లు సహా పలు కార్యక్రమాలు చేపట్టారు. 

ముషారఫ్‌ ఫారూఖి: ఖైరతాబాద్‌ జోనల్‌ కమిషనర్‌గా, చార్మినార్‌ పాదచారుల పథకం ప్రాజెక్ట్‌ ఆఫీసర్‌గా పనిచేశారు. లక్డికాపూల్, ఖైరతాబాద్‌ ప్రాంతాల్లో సుందరీకరణ పనుల ద్వారా పేరు తెచ్చుకున్నారు. నగరానికి గ్యాస్ట్రానమీ విభాగంలో యునెస్కో గుర్తింపు రావడంలో తగిన కృషి చేశారు. అద్దెకు సైకిళ్లు వంటివాటిపై శ్రద్ధ చూపారు.

సందీప్‌కుమార్‌ ఝా: బస్తీ దవాఖానాలకు అవసరమైన కమ్యూనిటీ హాళ్ల ఎంపికతోపాటు మీసేవ కేంద్రాల ద్వారా బర్త్‌ అండ్‌ డెత్‌ సర్టిఫికెట్ల జారీకి ఏర్పాట్లు చేశారు. ఎస్టేట్స్‌ విభాగంలో అవకతవకలు, అక్రమాల నిరోధానికి కృషి చేశారు. 

అద్వైత్‌కుమార్‌సింగ్‌: జీహెచ్‌ఎంసీ రెవెన్యూ విభాగంలో అక్రమాల నిరోధానికి కృషి చేశారు. స్పోర్ట్స్‌ విభాగంలో అవినీతి కట్టడికి ఆన్‌లైన్‌ ద్వారా బుకింగ్‌ అందుబాటులోకి తెచ్చారు.

శ్రుతి ఓజా: పారిశుద్ధ్యం, రవాణా, ఎస్టేట్స్‌ తదితర ఎన్నో విభాగాల్లో పని చేసినా, దేంట్లోనూ ఎక్కువ కాలం ఉండలేదు. చేపట్టిన పనులు ఒక కొలిక్కి వచ్చేలోగా విభాగాలు మారిపోయాయి. ఎస్టేట్స్‌ విభాగంలో జియోట్యాగింగ్‌ ద్వారా అక్రమాల నిరోధానికి  కృషి చేశారు.

సిక్తాపట్నాయక్‌: యూసీడీ విభాగంలో పలు సంస్కరణలు, ఇంటినెంబర్లకు 2డీ సర్వే తదితర కార్యక్రమాలు చేపట్టారు. 

మరిన్ని వార్తలు