కొత్తగా 3 పోలీస్ కమిషనరేట్లు!

15 Jan, 2016 03:28 IST|Sakshi
కొత్తగా 3 పోలీస్ కమిషనరేట్లు!

    రాష్ట్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపిన డీజీపీ అనురాగ్‌శర్మ
     ప్రతిపాదనల్లో మంచిర్యాల, ఖమ్మం, గోదావరిఖనికి చోటు

 సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో కొత్తగా మూడు పోలీసు కమిషనరేట్ల ఏర్పాటు దిశగా కసరత్తు మొదలైంది. ఈ మేరకు డీజీపీ అనురాగ్‌శర్మ రాష్ట్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపారు. ఆదిలాబాద్ జిల్లా మంచిర్యాల, కరీంనగర్ జిల్లా గోదావరిఖనితోపాటు ఖమ్మంలో కమిషనరేట్లు నెలకొల్పాల్సిన ఆవశ్యకత ఉందని ప్రతిపాదించారు. డీజీపీ ప్రతిపాదనలకు ప్రభుత్వ ఆమోదం లభిస్తే రాష్ట్రంలో కమిషనరేట్ల సంఖ్య ఆరుకు పెరగనుంది. ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు తెలంగాణలో హైదరాబాద్, సైబరాబాద్ కమిషనరేట్లు ఉండగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత 2015 జనవరి 25న వరంగల్‌ను కమిషనరేట్‌గా మారుస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

 కమిషనర్‌కు మెజిస్టీరియల్ అధికారాలు
 పోలీస్ కమిషనరేట్ ఏర్పడితే కమిషనర్‌గా ఉండే ఐపీఎస్ అధికారికి మెజిస్టీరియల్ అధికారాలు లభిస్తాయి. ఆయుధాల లెసైన్స్‌లు, ఎన్‌వోసీల జారీ, సెక్షన్ 144, పీడీ యాక్టు అమలు, ఐపీసీ పరిధిలోకి రాని లోకల్ లాస్ వంటి అధికారాలన్నీ కూడా కమిషనర్ చేతిలోనే ఉంటాయి. కమిషనరేట్ ఏర్పడితే కేంద్రం నుంచి మెగాసిటీ పోలీస్ పేరిట పెద్దఎత్తున నిధులు సమకూరుతాయి. కమిషనరేట్‌లోని ప్రతీ పోలీస్‌స్టేషన్‌కు హౌస్ ఆఫీసర్‌గా కచ్చితంగా ఇన్‌స్పెక్టర్ ర్యాంకు కలిగిన అధికారినే నియమించాల్సి ఉంటుంది.

పోలీసు కానిస్టేబుల్ నియామకాలు కమిషనరేట్ పరిధిలోనే జరుగుతాయి. అయితే వీటన్నింటి  కోసం ప్రభుత్వం ప్రత్యేకంగా చట్టం చేయాల్సి ఉంటుంది. ప్రస్తుతం  ప్రత్యేక చట్టం హైదరాబాద్, సైబరాబాద్ కమిషనరేట్లకు మాత్రమే ఉంది. వరంగల్ పోలీస్ కమిషనరేట్ ఏర్పడి ఏడాది గడిచినా ప్రత్యేక చట్టం రూపొందించకపోవడంతో మెజిస్టీరియల్ అధికారాలు బదలాయించలేదు. కొత్త కమిషనరేట్లకు అధికారుల కొరత తీవ్రంగా ఉంది. కొత్తగా కమిషనరేట్ల పరిధిలో డీసీపీలుగా ఐపీఎస్‌లను నియమించాల్సి ఉంటుంది. ఐపీఎస్‌ల కొరత కారణంగా ప్రస్తుత వరంగల్ కమిషనరేట్ పరిధిలో డీసీపీలను నియమించలేదు. కేవలం ఏసీపీలతోనే శాంతిభద్రతలను పర్యవేక్షిస్తున్నారు.  
 

మరిన్ని వార్తలు